నగర పాలక ఆదాయానికి గండి
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:17 AM
నగరపాలక పరిదిలోని సి.క్యాంపులో ఉండే నగరపాలక దుకాణాలకు నిర్వహించిన వేలంలో దుకాణదారులు రింగయ్యారు. దీంతో నగరపాలక ఆదాయానికి పూర్తిస్థాయిలో గండిపడింది. మున్సిపల్ దుకాణాల కోసం రూ.20లక్షల నుంచి రూ.25లక్షల వరకు పోటీ ఉంటుంది. పాటదారులు ముం దస్తుగా సిండికేట్ అయ్యారు.
సిండికేట్‌గా దుకాణదారులు
కొత్తవారికి అవకాశమివ్వకుండా చర్యలు
హల్‌చల్ చేసిన తెలుగు తమ్ముళ్లు
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): నగరపాలక పరిదిలోని సి.క్యాంపులో ఉండే నగరపాలక దుకాణాలకు నిర్వహించిన వేలంలో దుకాణదారులు రింగయ్యారు. దీంతో నగరపాలక ఆదాయానికి పూర్తిస్థాయిలో గండిపడింది. మున్సిపల్ దుకాణాల కోసం రూ.20లక్షల నుంచి రూ.25లక్షల వరకు పోటీ ఉంటుంది. పాటదారులు ముం దస్తుగా సిండికేట్ అయ్యారు. నామమాత్రంగా పాటపాడాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వేలాల ద్వారా నగర పాలకకు వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది.
35 దుకాణాలకు వేలం..
నగరపాలక సమావేశ భవనంలో అడిషనల్ కమిషనర్ ఆర్‌జీవి.కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీ్‌షకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సి.క్యాంపులో 25 సంవత్సరాలు పూర్తి చేసు కున్న మొత్తం 37దుకాణాలకు గురువారం వేలం నిర్వహించారు. కొత్తవారికి అవకా శం ఇవ్వకుండా పాతవారే దక్కించుకునేలా తెలుగు తమ్ముళ్లు హల్‌చల్ చేశారు. సమావేశ భవనంలో కొందరు...సమావేశ భవనం బయట మరికొందరు వేచి ఉంటూ కొత్తవారు వచ్చిన వెంటనే వారిని రౌడీలతో బెదిరింపులకు గురిచేశారు. ప్రధానంగా సి.క్యాంపు కూడలిలో ఉండే దుకాణాలకు మంచి స్పందన ఉంటుంది. నగరంలోని వాణిజ్య ప్రాంతాల్లో అత్యధిక వ్యాపారాలు జరిగే ప్రాంతం ఉందంటే సి.క్యాంపు అని నగరంలోని ప్రజలందరికీ తెలుసు. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు యజమానులు ఇతరులతో రింగై నగర పాలక ఆదాయానికి భారీ స్థాయిలో గండికొట్టారు. అంతే కాకుండ రౌడీలను సైతం ఇందులో ప్రమేయం చేయించారు.
తొమ్మిది మంది పోటీ పడగా..
దుకాణం నెంబరు.3 కోసం సుమారు 9 మంది పోటీ పడ్డారు. ముందుగా ప్రభుత్వ పాటగా గుడ్‌విల్ రూ.9,6000 నుంచి ప్రారంభమైంది. చివరకు రూ.45,60,000కు దీపిక దక్కించుకున్నారు. దుకాణం నెంబరు 4 గుడ్‌విల్ రూ.2,60,000 ప్రారంభం కాగా కేవలం రూ.3లక్షలకే మధుసూధన్‌రెడ్డి దక్కించుకున్నారు. ఇందులో కేవలం రూ.40వేలు మాత్రమే నగరపాలికకు ఆదాయం వచ్చింది. 25సంవత్సరాలకు కేవలం రూ.40వేలు మాత్రమే ఆదాయం వచ్చిందంటే ఈదుకాణంలో కేవలం ఇద్దరే పా ల్గొనడంతో ఇతరులు ఎవరూ కూడా పాల్గొనకుండా రింగయ్యారని స్పష్టంగా అర్థమవుతోంది. మిగిలిన దుకాణాలు కూడా సుమారు రూ.15లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పాట పాడారు.
21వ దుకాణాన్ని పాతవారికే..
ప్రధానంగా 21వ నెంబర్ దుకాణాన్ని పాతవారికే కట్టబెట్టేందుకు తెలుగు తమ్ముళ్లు ముందుగానే ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఫణీంద్రకుమార్ అనే వ్యక్తి కూడా వేలంలో పాల్గొనేందుకు వచ్చి దరావత్తు డబ్బులు చెల్లించారు. అక్కడే ఉన్న తెలుగు తమ్ముళ్లు అతని వద్దకు వెళ్లి వేలం నుంచి తప్పుకోవాలని బెదిరించారు. అయినా కూడా ఫణీంద్రకుమార్ పట్టించుకోకుండ వేలంలో పాల్గొని అదే దుకాణాన్ని రూ.12.70,000 దక్కించుకున్నారు. ఒకవేళ ఫణీంద్రకుమార్ వేలంలో పాల్గొనకుంటే కేవలం రూ.5లక్షల వరకు మాత్రమే పాటపాడాలని ప్రయత్నాలు చేసుకున్నారు. ఇందులో 7 మంది పాల్గొన్నారు.
పొదుపు మహిళలకు రిజర్వేషన్
దుకాణం నెంబరు 24ను పొదుపు మహిళలకు రిజర్వేషన్ కేటాయించారు. దీని కోసం సుమారు 9 మంది పోటీపడ్డారు. దరఖాస్తు చేసుకునే ముందు అన్ని రకాల పత్రాలు జతపరిచిన తరువాతనే దానిని వేలంలో పాల్గొనేందుకు అనుమతిస్తారు. ఇందులో ఒక పొదుపు మహిళ కొన్ని పత్రాలు సమర్పించకపోవడంతో నగర పాలక సిబ్బంది వెనక్కి పంపించారు. ఇంతలో తెలుగు తముళ్లు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆమె కూడా వేలంలో పాల్గొనే విధంగా బెదిరించారు. చివరికి ఆమెకు కాకుండా పావని అనే మహిళ రూ.8,60,000కు దక్కించుకున్నారు. ఒకవేళ పత్రాలు సమ ర్పించని ఆమె దక్కించుకుని ఉంటే కేవలం రూ.5లక్షల వరకు మాత్రమే పరిమితం అయ్యేది.
దుకాణం నెంబరు5 ఓసీకి కేటాయించారు. ఇద్దరు మాత్రమే పాల్గొనడంతో గుడ్‌విల్ రూ.54వేలు ఉండగా కేవలం రూ.1,05,000కు మాత్రమే యూసు్‌ఫబాష దక్కించుకున్నారు. దీనికి కూడా ఎవరూ పాల్గొనకుండా అడ్డుకున్నారు.
ఇద్దరు మాత్రమే పాల్గొన్న దుకాణాలకు సంబంధించి నగరపాలక ఆదాయానికి పూర్తిస్థాయిలో గండి పడింది. ముగ్గురు ఆ పైన పాల్గొన్న దుకాణాలకు ఓ మోస్తారులో వేలంలో దక్కించుకున్నారు.
వేలంలో పాల్గొనేందుకుగాను రిజర్వేషన్ వారీగా కేటాయించారు. ఓసీ దుకాణానికి గుడ్‌విల్ రూ.54,000, ఎస్సీ, ఎస్టీ దుకాణానికి గుడ్‌విల్ రూ.55,200, టీఎల్‌ఎ్‌ఫ-ఎ్‌సఎల్‌ఎఫ్ దుకాణాలకు గుడ్‌విల్ రూ.54,000 కేటాయించారు. సగం దుకాణాల నుంచి నగర పాలక ఆదాయానికి భారీ స్థాయిలో ఆదాయం వచ్చింది. మిగిలిన సగం దుకాణాల నుంచి ఆదాయం తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.