తరుగు పేరుతో దగా
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:46 AM
మండలంలో ఈ రబీ సీజన్‌కు 16వేల ఎకరాల్లో శనగ సాగు చేశారు. ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావడంతో రైతులు సంతోషించారు.
శనగ రైతులు దోచుకుంటున్న వ్యాపారులు
ప్రభుత్వం కొనుగోలు చేయాలని వినతి
సంజామల, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఈ రబీ సీజన్‌కు 16వేల ఎకరాల్లో శనగ సాగు చేశారు. ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావడంతో రైతులు సంతోషించారు.
మార్కెట్ సదుపాయం లేక నష్టం..
శనగకు విక్రయించేందుకు జిల్లాస్థాయిలో మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం క్వింటాకు రూ.5,875ల మద్దతు ధర ప్రకటించినా ఇంతవరకు కొనుగోలు ప్రారంభం కాలేదు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు క్వింటాకు రూ5వేలకు విక్రయిస్తున్నారు.
అనామతు పద్ధతితో నష్టం...
నాలుగు దశాబ్ధాల కాలం నుంచి వ్యాపారులు అనామతు విధానం అనుసరిస్తూ రెతుకు నష్టం చేస్తున్నారు. ఉగాదిలోపు శనగలను రైతు విక్రయించుకుంటే గోదాము ఖర్చు లేకుండా అప్పటి మార్కెట్ ధర ప్రకారం మొత్తాన్ని రైతుకు కొంత మొత్తాన్ని అందజేస్తారు. ఉగాది దాటాక గోదాముల ఖర్చు కింద బస్తాకు రూ.వంద చెల్లించాల్సి ఉంటుంది. ధర వచ్చినప్పుడు శనగలను అమ్మి రైతుకు అందజేస్తారు.
50కేజీల బస్తాకు 3 కేజీల వరకు..
వ్యాపారులు 50 కేజిల శనగలకు 2 నుంచి 3 కేజిలు తరుగు పేరుతో లాగేస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. మండలంలో 24 గ్రామాలకు కలిపి 25 నుంచి 30 మంది దళారి వ్యాపారులున్నారు. ధాన్యం కొనుగోలులో వీరి పెట్టుబడి కేవలం సంచులు, హమాలీల ఖర్చులు మాత్రమే. ఆరుగాలం కష్టించి పనిచేసే రైతు కంటే వీరికే రూ. లక్షల్లో లాభం వస్తోంది.
50 కేజీలకు 2 కేజీల తరుగు తీస్తున్నారు
నాలుగు ఎకరాల్లో శనగ సాగు చేశాను. 32 బస్తాల దిగుబడి వచ్చింది. డబ్బు అవసరమై క్వింటా రూ 5వేల ప్రకారం విక్రయించాను. వ్యాపారి 50 కిలోల శనగలకు 2 కిలోల ప్రకారం తరుగు తీసుకున్నారు. ఈ లెక్కన 30 క్వింటాళ్లకు 120 కిలోల శనగ నష్టపోయాను. - హుస్సేనయ్య, రైతు, గిద్దలూరు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
మూడు ఎకరాలలో సాగు చేశాను. ఈ ఏడాది పంట బాగా పండి, ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అయితే దళారి వ్యాపారులకు విక్రయించాలంటే భయం వేస్తుంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే మద్దతు ధరకే విక్రయిస్తాను. - శేఖర్, ఎగ్గోని.