కూరగాయలకు ధరాఘాతం
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:32 AM
కూరగాయల ధరలు పడిపోయాయి. సాగు చేసిన రైతులకు కోత కూలి కూడా గిట్టుబాటు కావడం లేదు. ముఖ్యంగా కాకర, బెండ, టమోట రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం పంట కోత, మార్కెట్ తరలించే ఖర్చులకు రాబడి సరిపోవడం లేదు
కోతకు సరిపోని రాబడి
కాకర, టమోటా పంటలను వదిలేసుకుంటున్న రైతులు
ప్యాలకుర్తిలో దాదాపు 40 ఎకరాల్లో కాకర సాగు
కోడుమూరు రూరల్, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): కూరగాయల ధరలు పడిపోయాయి. సాగు చేసిన రైతులకు కోత కూలి కూడా గిట్టుబాటు కావడం లేదు. ముఖ్యంగా కాకర, బెండ, టమోట రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం పంట కోత, మార్కెట్ తరలించే ఖర్చులకు రాబడి సరిపోవడం లేదు. దీంతో రైతులు పంటను వదిలేసుకుంటున్నారు. మరికొందరు తర్వాతి కోతకు అయినా ధర వస్తుందనే ఆశతో ఉన్నారు. మండలంలో కాకర దాదాపు 70 ఎకరాల వరకు సాగైనట్లు అంచనా. ఒక్క ప్యాలకుర్తి గ్రామంలోనే 40 ఎకరాల మేర పంట సాగైంది. కాకర పంట దాదాపు 5 నెలలు ఉంటుందని రైతులు అంటున్నారు. అయితే మార్కెట్‌లో అమ్ముడవుతున్న ధరలతో కోత ఖర్చులకు సరిపోక మధ్యలోనే పంటను తొలగించుకుంటున్నారు. టమోటా పంటకు గిట్టుబాటు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
రైతుకు మిగలడం లేదు
కాకర, టమోటా సాగులో ఎకరాకు విత్తులు మొదలు నాటు, ఎరువులు, పిచికారీ ఖర్చులు పెరిగిపోయాయి. కాకరలో 50 రోజులు, టమోటాలో 90 రోజుల నుంచి కోతలు ప్రారంభమవుతాయి. ఎకరా కోతకు కనీసం 20 మంది కూలీల అవసరం ఉంటుంది. పంటట కోత, గట్టుకు మోయడానికి, గ్రేడింగ్ కోసం కూలీలకు రూ. 6 వేలు అవుతుంది. మార్కెట్ తరలించేందుకు 20 కిలోల బాక్సుకు రూ. 50 ఖర్చు అవుతుంది. తీరా మార్కెట్‌లో బాక్సు రూ. వంద కూడా పలకడం లేదు.
మూడెకరాల్లో సాగు చేశా
రబీలో మూడెకరాల్లో కాకర పంట సాగు చేశాను. పెట్టుబడి దాదాపు రూ. లక్షన్నర అయ్యింది. నెల రోజుల నుంచి కోత జరిపినపుడల్లా రూ. 6 వేలు ఖర్చు అవుతోంది. పంటను అమ్ముకుంటే రూ. 4 వేలు మాత్రమే వస్తోంది. మరో కోతలో అయినా రేటు పెరుగుతుందని ఆశతో ఉన్నాను. కాకర గిట్టుబాటు లేదు. - షఫీ, రైతు ప్యాలకుర్తి
టమోటా గిట్టుబాటు కావడం లేదు
ఎకరాలో టమోటా సాగు చేశాను. నారు కొనుగోలు, నాటు, ఎరువులు, పిచికారీ ఖర్చులు దాదాపు రూ. 40 వేలు అయ్యింది. తీరా పంట చేతికందాక ధర పడిపోయింది. కోత, మార్కెట్ తరలించే ఖర్చులకు గిట్టుబాటు కావడం లేదు. పెట్టుబడి కూడా రాలేదు. - సూపిరెంటు, రైతు, వర్కూరు