Share News

పుష్పపల్లకిలో పరమ శివుడు

ABN , Publish Date - Feb 13 , 2026 | 11:04 PM

శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భ్రమరాంబ, మల్లికార్జున స్వామి పుష్పపల్లకిలో వైభవంగా ఊరేగారు.

పుష్పపల్లకిలో పరమ శివుడు

శ్రీగిరిపై భక్తజన సంద్రం

బ్రహ్మోత్సవాల్లో నేడు గజ వాహనసేవ

శ్రీశైలం, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భ్రమరాంబ, మల్లికార్జున స్వామి పుష్పపల్లకిలో వైభవంగా ఊరేగారు. నేత్రానందభరితంగా గ్రామోత్సవం కొనసాగింది. బ్రహ్మోత్సవాల్లో ఆరోరోజైన శుక్రవారం సాయంత్రం అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులకు పూజలు చేిసి, మేళతాళాల నడుమ గంగాధర మండపం వద్దకు తోడ్కొని వచ్చి పుష్పపల్లకిలో గ్రామోత్సవం నిర్వహించారు. ఎర్రపు, పసుపు బంతులు, తెల్ల, పసుపు చామంతులు, కనకాంబరాలు, డచ్‌రోస్‌, అశోకపత్రాలు, కాగడాలు, గ్లాడియేలస్‌, అస్పెర్‌ గ్రాస్‌, జబ్రా, కార్నెషన్‌, ఆర్కిడ్స్‌, నందివర్ధనం, గరుడవర్దనం మొదలైన పలు సుగంధ పుష్పాలను పుష్ప పల్లకికి వినియోగించారు. గ్రామోత్సవం గంగాధరమండపం దగ్గర మొదలై బయలు వీరభద్రస్వామిని చేరుకొని తిరిగి గంగాధరమండపం చేరుకుంది. ఉత్సవంలో కళాకారుల నృత్యాలు, కోలాటాలు, ఢమరుక, శంఖనాదాలు, జాంజ్‌ పథక్‌, నందికోల సేవ, బీరప్పడోలు, చెంచుల నృత్యాలు, కొమ్ముకోయ నృత్యాలు భక్తులను మైమరిపించాయి. ఈ కార్యక్రమాల్లో ఈవో శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తలమండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌ నాయుడు, సభ్యులు దేవకి వెంకటేశ్వర్లు, ఏవీ రమణ. అనిల్‌ కుమార్‌, శివమ్మ, మురళీధర్‌ తదితరులు, ఆలయ అధికారులు ఈఈ నర్సింహారెడ్డి, బాలమురళీకృష్ణ, పీఆర్‌వో శ్రీనివాసరావు పాల్గొన్నారు.

నేడు గజవాహనసేవలో స్వామి, అమ్మవార్లు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శనివారం స్వామి, అమ్మవార్లు గజవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Feb 13 , 2026 | 11:04 PM