పొంచి ఉన్న ఎల్‌నినో
ABN , Publish Date - Jun 28 , 2026 | 11:32 PM
ప్రస్తుత ఖరీఫ్ పంటలపై ఎల్‌నినో ప్రతికూల ప్రభావం పొంచి ఉన్నదని, రైతులు అప్రమత్తంగా ఉండి పంటలను కాపాడుకోవాలని ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు తెలిపారు.
పంటలను మెలకువగా కాపాడుకోండి
డ్రిప్ సేద్యమే రక్ష
10వేల హెక్టార్లలో డ్రిప్ ఏర్పాటుకు చర్యలు
ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీ
ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు
కర్నూలు అగ్రికల్చర్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఖరీఫ్ పంటలపై ఎల్‌నినో ప్రతికూల ప్రభావం పొంచి ఉన్నదని, రైతులు అప్రమత్తంగా ఉండి పంటలను కాపాడుకోవాలని ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం కర్నూలు జిల్లాలోని కల్లూరు, కోడుమూరు, కర్నూలు, గూడూరు, దేవనకొండ తదితర మండలాల్లో డ్రిప్‌ను ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ మండలాల్లో పర్యటించిన అనంతరం ఆదివారం కలెక్టరేట్‌లోని సూక్ష్మ సేద్యం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం 10వేల హెక్టార్లలో రైతుల పొలాల్లో డ్రిప్, స్పింకర్ల యూనిట్లను ఏర్పాటు చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎల్‌నినో నుంచి పంటలను కాపాడుకోడానికి డ్రిప్ సేద్యం మంచి మార్గమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఐదెకరాల్లోపు ఉంటే.. వంద శాతం రాయతీ అందించడం జరుగుతుందని, మిగతా అన్ని వర్గాల రైతులకు పదెకరాల వరకు 90 శాతం రాయితీ, పదెకరాలు పైబడిన రైతులకు 50 శాతం రాయతీ డ్రిప్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం అందిస్తాయని అన్నారు. అన్ని వర్గాల రైతులకు స్పింకర్లు యూనిట్లకు 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు డ్రిప్, స్పింకర్ల యూనిట్ల ఏర్పాటు కోసం తమ పరిధిలో ఉన్న గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ, ఉధ్యాన అధికారుల ద్వారా రిజిస్ర్టేషన్ చేసుకోవాలన్నారు. లేదా ప్రభుత్వం వారి వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. డ్రిప్, స్పింకర్ల ఏర్పాటు కోసం జిల్లాలో 22 కంపెనీలను అందుబాటులోకి ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. రైతులు తమ వాటా సొమ్మును ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలని, ఇతరులకు డబ్బులు ఇవ్వరాదన్నారు. తమ వంతు వాటా చెల్లించిన రైతులకు కలెక్టర్ వెంటనే శాంక్షన్ ఉత్తర్వులు అందిస్తారని, పొలాల్లో డ్రిప్, స్పింకర్ల యూనిట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.