Share News

వృద్ధురాలి ఇంటికి తాళం

ABN , Publish Date - May 22 , 2026 | 12:11 AM

ఓ వృద్ధురాలిపై వడ్డీ వ్యాపారులు దౌర్జన్యం ప్రదర్శించి ఆమె ఇంటికి తాళం వేశారు. ఈ ఘటన గురువారం ఆదోని త్రీ టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని చోటుచేసుకున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ సాయి సర్వేశ్వరరావు తెలిపారు

వృద్ధురాలి ఇంటికి తాళం
దిగాలుగా కూర్చొన్న మీనాక్షమ్మ

వడ్డీ వ్యాపారి దౌర్జన్యం

ఇల్లు లాక్కునేందుకు కుట్ర

ఆదోని, మే 21 (ఆంధ్రజ్యోతి): ఓ వృద్ధురాలిపై వడ్డీ వ్యాపారులు దౌర్జన్యం ప్రదర్శించి ఆమె ఇంటికి తాళం వేశారు. ఈ ఘటన గురువారం ఆదోని త్రీ టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని చోటుచేసుకున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ సాయి సర్వేశ్వరరావు తెలిపారు. వివరాలు.. పట్టణంలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన టి.మీనాక్షమ్మ అనే వృద్ధురాలు తన అవసరాల కోసం స్థానికంగా ఉండే గోల్డ్‌ రమేష్‌ వద్ద తన ఇంటిని తాకట్టు పెట్టి రూ.4.50లక్షలు అప్పుగా తీసుకుంది. ఈఏడాది జనవరి 1న తాను తీసుకున్న అసలు మొత్తాన్ని చెల్లించేందుకు మీనాక్షమ్మ అతడి వద్దకు వెళ్లింది. రమేష్‌ అసలుతో పాటు భారీగా వడ్డీ కూడా కావాలని డిమాండ్‌ చేశాడు. తాను అంత వడ్డీ కట్టలేనని బాధితురాలు ప్రాధేయపడింది. ఆగ్రహానికి గురైన గోల్డ్‌ రమేష్‌, అతడి అనుచరుడు ఉదయ్‌కుమార్‌ కలిసి అప్పట్లో మీనాక్షమ్మ ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారు. వృద్ధురాలని కూడా చూడకుండా ఆమెను బలవంతంగా బయటకు లాగేశారు. ఇంట్లో ఉన్న సామగ్రిని రోడ్డుపై పడేశారు. బాధితురాలిని, ఆమె కుమార్తెలను నానా దుర్భాషలాడుతూ తీవ్రంగా అవమానించి ఇంటికి తాళం వేశారు.

పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినా...

అప్పట్లో బాధితురాలు ఈ విషయమై స్థానిక పెద్దలను ఆశ్రయించగా పంచాయితీ చేశారు. అదేరోజే రూ.50వేలు చెల్లించాలని, మిగిలిన రూ.4లక్షలు మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా మూడు నెలలోపు కట్టాలని పంచాయితీ నిర్వహించారు. పెద్దల మాట ప్రకారం మీనాక్షమ్మ గడువులోగా మిగిలిన రూ.4లక్షల నగదును పట్టుకుని గోల్డ్‌ రమేష్‌ వద్దకు వెళ్లింది. ఎలాగైనా ఆమె ఇంటిని ఆక్రమించుకోవాలని అతడు ఆ డబ్బులు తీసుకోవడానికి నిరాకరించాడు. ఆమెను ఇంటి నుంచి గెంటేసి మరోసారి తాళం వేసి ఇంటిని లాక్కునేందుకు కుట్ర వేశాడు. విసిగిపోయిన బాధితురాలు పోలీసుల ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - May 22 , 2026 | 12:11 AM