స్థానిక సన్నాహాలు..!
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:14 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర యంత్రాంగం సన్నద్ధమవుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి.
ఓటర్ల జాబితాలపై ప్రత్యేక దృష్టి
బీసి రిజర్వేషన్లపై ఉత్కంఠ
జిల్లాలో పోలింగ్ కేంద్రాలు పరిశీలన
అక్టోబరులో ఎన్నికల లక్ష్యంగా..
ఏర్పాట్లపై అధికారులు కసరత్తు
స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర యంత్రాంగం సన్నద్ధమవుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. అక్టోబరులో ఎన్నికలు నిర్వహించే అవకాశాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), జిల్లా యంత్రాంగాలు ముందస్తు కసరత్తు చేపట్టాయి. ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేం ద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది శిక్షణ, రిజర్వేషన్ల ఖరారు తదితర అంశాలను నిర్ణీత గడువుల్లో పూర్తిచేయాలని జిల్లా అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో బీసీ రిజర్వేషన్లు అత్యంత కీలక అంశంగా మారాయి.
కర్నూలు కలెక్టరేట్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్లపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయి పర్యటనలు, ప్రజాభిప్రాయ సేకరణ, బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పక్షాల నుంచి వినతుల స్వీకరణ చేపట్టింది. బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ స్థితిగతులు, స్థానిక సంస్థల్లో వారి ప్రాతినిథ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదిక రూపొందించే ప్రక్రియను కమిషన్ చేపట్టింది. కమిషన్ నివేదిక సమర్పించిన నేపథ్యంలో ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయం వెలువడిన తర్వాతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారు, వార్డులు, స్థానాల రిజర్వేషన్ ప్రక్రియ మరింత స్పష్టతకు వచ్చే అవకాశముంది. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి వార్డుల పునర్‌వ్యవస్థీకరణ, ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించారు.
సిబ్బందికి శిక్షణ ప్రక్రియను..
ఎన్నికల నిర్వహణలో కీలకమైన అధికారులు, సిబ్బందికి శిక్షణ ప్రక్రియను కూడా వేగవంతం చేయనున్నారు. పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బందికి దశలవారీగా శిక్షణ ఇచ్చి పోలింగ్ విధానం, ఓటర్ల గుర్తింపు, పోలింగ్ కేంద్రాల్లో పాటించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పించనున్నారు. నెలరోజుల్లోపు శిక్షణ ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఓటర్ల జాబితాలే కీలకం
స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటర్ల జాబితాలే అత్యంత కీలకం. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఫొటో, ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి ప్రచురించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పట్టణ స్థానిక సంస్థలకు వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాల ప్రక్రియను ఎస్‌ఈసీ ప్రారంభించింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల కోసం వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురించే దిశగా చర్యలు జరుగుతున్నాయి. 2025 నాటి ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని స్థానిక సంస్థల ఓటర్ల జాబితాల ప్రక్రియ చేపట్టే అంశంపై అధికారులు దృష్టి సారించారు.
రానున్న రెండు నెలలు ..
రానున్న రెండు నెలలు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అత్యంత కీలకం కానున్నాయి. ఒకవైపు సర్ తుది ఓటర్ల జాబితా ప్రక్రియ కొనసాగుతుండగా.. మరోవైపు స్థానిక సంస్థలకు వార్డుల వారీగా ఓటర్ల జాబితాల తయారీ జరుగుతోంది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం, ఓటర్ల జాబితాల తుది రూపకల్పన పూర్తయిన తర్వాత ఎన్నికల నిర్వహణపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
అధికారులు అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్
రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు పూర్తి అవగాహనతో ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో మున్సిపల్ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మాట్లాడుతూ ఎలక్టోరల్ రోల్స్, వార్డుల వారిగా ఓటర్ల జాబితా ప్రచురణ ఆర్వోలు, ఏఆర్వోల నియామకం, పోలింగ్ కేంద్రాల జాబితా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లకు సంబంధించిన చర్యలను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. సెప్టెంబరులో నిర్వహించనున్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్‌ను దృష్టిలో ఉంచుకుని అన్నిశాఖలు తమ పనితీరు, కీలక సూచికలు (కేపీఐ), పురోగతి పెండింగ్ అంశాలపై సమగ్రంగా నివేదికలను రూపొందించాలని కలెక్టర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. నివేదికలు సక్రమంగా రూపొందించేలా సమన్వయం చేయాలని సీపీవోను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.