మామిడీలా
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:26 PM
బనగానపల్లె మామిడి(బంగినపళ్లకు)కి దేశవ్యాప్తంగా ఎంతో పేరుంది. రాష్ట్రంలో పం డించే మామిడిలో 70 శాతం బంగినపల్లి రకానికి చెందిన వాటినే పండిస్తున్నారు.
ఏటేటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం
పెరిగిన పెట్టుబడులు
నిలకడ లేని ధరలు
ఆందోళనలో రైతులు
బనగానపల్లె మామిడి(బంగినపళ్లకు)కి దేశవ్యాప్తంగా ఎంతో పేరుంది. రాష్ట్రంలో పం డించే మామిడిలో 70 శాతం బంగినపల్లి రకానికి చెందిన వాటినే పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 5లక్షల 8వేల హెక్టార్లలో వివిధ రకాల మామిడిని రైతులు సాగు చేస్తున్నారు. ఆధునిక విఽధానాలు అవలంభిస్తూ రైతులు మామిడిని సాగు చేస్తున్నారు. జూన్ నుంచి డిసెంబరు వరకు మామిడిని సాగు చేస్తున్నారు. మంచి రకాలు ఎంపిక చేసుకొని చీడపీడలను దృష్టి పెట్టుకొని పంటను రైతులు పండిస్తున్నారు.
బనగానపలె/ రుద్రవరం, ఫిబ్రవరి 20 ( ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో సుమారు 10వేల ఎకరాలో బంగినపల్లె మామిడి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఏటేటా మామిడి విస్తీర్ణం తగ్గిపోయింది. ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు 16 వేల హెక్టార్లకు పైగా బంగినపల్లి మామిడిని సాగు చేసేవారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల్లో కేవలం 12,270 ఎకరాలకు మామిడి పంట విస్తీర్ణంకు తగ్గిపోయింది. నంద్యాల జిల్లాలో ప్రస్తుతం మామిడి 8396 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 3874 ఎకరాలకు పడిపోయాయి.
హెక్టారుకు రూ.50వేలు ఆర్థికసాయం
ఏటేటా మామిడి విస్తీర్ణం తగ్గిపోతుండడంతో మామిడి రైతులను ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ప్రభుత్వం మామిడి పంట వేసే రైతులకు హెక్టారుకు రూ.50 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఒక్కో రైతుకు రెండు హెక్టార్ల వరకు పంట వేసుకుంటే ప్రోత్సాహం అందిస్తోంది. హెక్టారుకు మొదటి ఏడాది రూ.30వేలు, రెండవ ఏడాది రూ.20వేలు ఆర్థిక సాయం ప్రభుత్వం మంజూరు చేసి మామిడి రైతులను ప్రోత్స హిస్తోంది. అంటే రెండు హెక్టార్ల మామిడి పంటలను వేసే రైతులకు రెండేళ్లలో లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో కొందరు యువ రైతులు మామిడి పంటను సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు.
పెరిగిన పెట్టుబడులతో కుదేలు
నానాటికీ మామిడి పంట సాగుచేయడానికి పెట్టుబడులు ఏటేటా పెరుగుతున్నాయి. ఎకరాకు రైతు రూ.50వేల వరకు పెట్టుబడులకు ఖర్చవుతోంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కూలీలు, రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి. ఇంత కష్టపడ్డా ప్రకృతి వైపరీత్యాలతో రైతులు అప్పుల పాలవుతున్నారు. దీనికి తోడు పంట చేతికొచ్చే సరికి ధరలు సరిగా లేకపోవడంతో మామిడి రైతులు పూర్తిగా నష్టపోతున్నారు.
తేనె మంచు పురుగు, తామర పురుగు దాడి
మామిడి తోటలకు తేనెమంచు, తామర పురుగు, బూడిద తెగులు దాడి చేశాయి. తేనెమంచు, తామర పురుగు దాడి చేయడంతో పూత నల్లగా మారడం. రాలిపోయి పూత వచ్చిన కొమ్మలు మాత్రమే మిగిలిపోయి, పూత, పిందె రాలడంతో ఈ పంట దిగుబడి తగ్గుతుంది.
మామిడి రైతులను ప్రోత్సహిస్తున్నాం
ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స పథకంలో ఉద్యాన వన పంటలకు సబ్సిడీ ఇస్తుండడంతో రైతులు కొంతమేర మామిడి పంటను సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇందుకు తమ వంతు యత్నాలు సాగిస్తున్నాం.
శ్రీధర్, హార్టికల్చర్ అధికారి, బనగానపల్లె
మామిడి తోటలు కౌలుకు తీసుకున్నా..
70 ఎకరాలు మామిడి తోటలకు 45లక్షలు కౌలు చెల్లించా. ప్రకృతి దాడి చేయడంతో పూత పిందె రాలుతుంది. ఇప్పటికి 12 సార్లు మందులు పిచికారి చే సినా ఫలితం లేదు.
-హుసేని, కౌలు రైతు, రుద్రవరం