కల్తీ పాలపై మెరుపు దాడులు
ABN , Publish Date - Mar 02 , 2026 | 11:31 PM
పాలను విషతుల్యం చేస్తున్న కల్తీ వ్యాపారుల ఆట కట్టించేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది.
కల్తీ నిరూపితమైతే లైసెన్సులు రద్దు
డీఎఫ్‌ఎస్‌వో రాజగోపాల్‌రావు
ఆదోని, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): పాలను విషతుల్యం చేస్తున్న కల్తీ వ్యాపారుల ఆట కట్టించేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. కలెక్టర్ డా. సిరి ఆదేశాల మేరకు సోమవారం ఆదోని పట్టణంలోని ప్రధాన పాల డెయిరీలు, విక్రయ కేంద్రాలపై జిల్లా ఆహార భద్రత అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. గత నెల రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ఐదుగురు మృతిచెందిన విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో జిల్లా ఆహార భద్రత అధికారి రాజగోపాల్‌రావు నేతృత్వంలో అధికారులు ఆదోనిలో విస్తృతంగా సోదాలు చేపట్టారు. పట్టణంలోని పాత పోస్టు ఆఫీసు రోడ్డులో నాగరాజ్ మిల్క్ పార్లర్, గణేష్ సర్కిల్‌లోని తిరుమల మిల్క్ డెయిరీ, కౌడల్‌పేటలోని పల్లె పాలు విక్రయ కేంద్రంలో శాంపిల్స్ సేకరించారు. పాల నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువ వెన్న శాతం ఉన్నా, హానికరమైన రసాయనాలు (యూరియా, డిటర్జెంట్ వంటివి) కలిపినట్లు అనుమానం ఉన్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తనిఖీ చేసిన ప్రతి కేంద్రం నుంచి పాల నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఎస్‌ఓ రాజగోపాల్‌రావు మాట్లాతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్తీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ల్యాబ్ నివేదికలో కల్తీ జరిగినట్లు తేలితే సదరు డెయిరీల లైసెన్సులను తక్షణమే రద్దు చేసి, యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు, ఆదోని డివిజన్ వినియోగదారుల రక్షణ మండలి అధ్యక్షుడు ఈసాబాషా మాట్లాడుతూ వినియోగదారులు పాలు కొనేటప్పుడు ప్యాకింగ్ తేదీ, నాణ్యత ముద్రలను గమనించాలని సూచించారు.