Share News

చింతకుంట హత్య కేసులో 12 మందికి జీవితఖైదు

ABN , Publish Date - Mar 30 , 2026 | 11:46 PM

జిల్లాలో సంచలనం రేపిన చింతకుంట హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసులో 12 మంది నిందితులకు జీవితఖైదు విధిస్తూ మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్న రాజా తీర్పు చెప్పారు. ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామంలో 2012 ఫిబ్రవరిలో పాతకక్షల నేపథ్యంలో జరిగిన ఘటనలో నలుగురిని దారుణంగా కత్తులతో నరికి హత్య చేశారు.

చింతకుంట హత్య కేసులో 12 మందికి జీవితఖైదు
జీవిత ఖైదు పడిన తమవారిని పలకరిస్తున్న బంధువులు

నంద్యాల, క్రైం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సంచలనం రేపిన చింతకుంట హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసులో 12 మంది నిందితులకు జీవితఖైదు విధిస్తూ మూడో అదనపు జిల్లా న్యాయాధికారి అమ్మన్న రాజా తీర్పు చెప్పారు. ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామంలో 2012 ఫిబ్రవరిలో పాతకక్షల నేపథ్యంలో జరిగిన ఘటనలో నలుగురిని దారుణంగా కత్తులతో నరికి హత్య చేశారు. గ్రామానికి చెందిన ఇంజేటి కృష్ణారెడ్డి, ఆయన భార్య గోవిందమ్మ, కుమారుడు మల్లికార్జునరెడ్డి, మామ రామ సుబ్బారెడ్డిని పాతకక్షలతో ప్రత్యర్థులు ఇంటిపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో అప్పట్లో ఆళ్లగడ్డ పోలీసులు మొత్తం 19మందిపై కేసు నమోదు చేశారు. అయితే కేసు విచారణ సమయంలో కేసులోని ఏడుగురు నిందితులు మరణించారు. కేసు విచారణ అనంతరం మిగిలిన 12 మంది నిందితులు కుందూరు రామిరెడ్డి, ఇంజేటి శివసుమారెడ్డి, హుసేనావలి, కమాల్‌వలి, చిన్న మాబూవలి, పెద్ద అంకాలు, పల్కన్‌ వలి, మాల శ్రీను, చాంద్‌బాషా, మహబూబ్‌ బాషా, లక్కు శ్రీను, బాబు బాషాపై సాక్షాధారాలు రుజువు కావడంతో నిందితులకు కోర్టు జీవితఖైదు విధించింది. తీర్పు నిందితులను తరలించేందుకు పోలీసులు ప్రత్యేక ఎస్కార్ట్‌ ఏర్పాటు చేశారు.

కడప సెంట్రల్‌ జైలుకు తరలింపు

జీవిత ఖైదు పడిన 12 మంది నిందితులను పోలీసులు కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు. తీర్పు అనంతరం నంద్యాల కోర్టు నుంచి ప్రత్యేక భద్రతతో 12 మంది నిందితులను ఎస్కార్ట్‌తో తరలించే సమయంలో కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీవితఖైదు పడిన నిందితుల కుటుంబసభ్యుల ఆర్థనాదాలతో కోర్టు ప్రాంగణం భావోద్వేగాలతో నిండిపోయింది. తీర్పు వెలువడిన అనంతరం కోర్టు పరిసరాలు క్షణాల్లో బంధువుల రోదనలతో నిండిపోయింది. పరిస్థితిని పోలీసులు అదుపులో ఉంచుతూ నిందితులను సురక్షితంగా కడప జైలుకు తరలించారు.

న్యాయం జరిగే దాకా పోరాటం: ఎమ్మెల్యే అఖిలప్రియ

చట్టాలు, కోర్టులపై తమకు పూర్తిగా నమ్మకం, గౌరవం ఉందని, జీవితఖైదు శిక్ష పడిన వారి కుటుంబాలకు అండగా ఉండి న్యాయం జరిగే దాకా పోరాడతామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. రానున్న రోజుల్లో రాజకీయాల్లో మార్పులు తీసుకువస్తామని, ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సేవలందిస్తామని చెప్పారు. నంద్యాల కోర్టులో చింతకుంట హత్యకేసులో 12 మంది నిందితులకు జీవితఖైదు విధించిన నేపథ్యంలో నిందితుల కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ కీ లకవ్యాఖ్యలు చేశారు. భూమా కుటుంబాన్ని నమ్ముకున్న వారికి న్యాయం చేస్తామని అఖిలప్రియ హామీ ఇచ్చారు. కేసులో న్యాయం కోసం అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Updated Date - Mar 30 , 2026 | 11:46 PM