Share News

లైసెన్స్‌లను రెన్యువల్‌ చేయించాలి

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:35 PM

మద్యం దుకాణాల లైసెన్స్‌కు సంబంధించిన అన్ని ప్రక్రియలను సెప్టెంబర్‌ 30 లోపు రెన్యువల్‌ చేయించాలని ఎక్సైజ్‌ డీప్యూటీ కమిషనర్‌ పీ. శ్రీదేవి ఆదేశించారు.

లైసెన్స్‌లను రెన్యువల్‌ చేయించాలి
సమావేశంలో మాట్లాడుతున్న డీసీ శ్రీదేవి

పొరుగు రాష్ట్రాల మద్యంపై నిఘా పెంచాలి

సీఐలతో ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌

కర్నూలు అర్బన్‌, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మద్యం దుకాణాల లైసెన్స్‌కు సంబంధించిన అన్ని ప్రక్రియలను సెప్టెంబర్‌ 30 లోపు రెన్యువల్‌ చేయించాలని ఎక్సైజ్‌ డీప్యూటీ కమిషనర్‌ పీ. శ్రీదేవి ఆదేశించారు. గురువారం జిల్లా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల సీఐలతో నెల వారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ మద్యం దుకాణాల లైసెన్స్‌దారులకు బకాయిలు ఏమీ లేవని నిర్థారించుకున్న తర్వాతే బ్యాంక్‌ గ్యారంటీలు రిటర్న్‌ చేయాలని సీఐలను ఆదేశించారు. కర్నూలు, నంద్యాల జిల్లాలను నాటుసారా రహిత జిల్లాలుగా ప్రకటించినందు వల్ల తిరిగి నాటు సారా తయారీ చేయకుండా పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, నాటు సారా మానేసిన వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పనపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల మద్యం జిల్లాలోకి ప్రవేశించకుండా, చెక్‌ పోస్టు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలు విఽఽధిగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, నిరంతర నిఘ ఉంచి వాహనాల తనిఖీ చేపట్టాలని ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల మద్యం కేసుల్లో, గ్రేవ్‌ క్రైమ్‌ కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి, అరెస్టు పెండింగ్‌ ఉన్న నిందితులను సత్వరమే అరెస్టు చేయాలని అన్నారు. దర్యాప్తు అనంతరం చార్జ్‌షీట్‌ కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగంపై స్కూల్‌, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగేలా చూడాలని ఆదేశించారు. ఈ సమీక్షలో అసిస్టెంట్‌ కమిషనర్‌ వి. హనుమంతరావు, ఈఎ్‌సలు ఎం. సుధీర్‌ బాబు, ఎస్‌. రవికుమార్‌, ఏఈఎ్‌సలు రాజశేఖరరెడ్డి, రామకృష్ణారెడ్డి, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2026 | 11:35 PM