Share News

ప్రైవేటు సర్వేయర్లకు లైసెన్స్‌

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:35 PM

భూముల సర్వేలు, రీ సర్వేలు, రిజిస్ర్టేషన్లు, లే అవుట్ల అనుమతుల ప్రక్రియలో పెరుగుతున్న డిమాండ్‌ వల్ల ప్రైవేటు సర్వేయర్లకు ప్రాధాన్యం పెరుగుతోంది.

 ప్రైవేటు సర్వేయర్లకు లైసెన్స్‌

ఉమ్మడి జిల్లాలో 250 మంది దరఖాస్తు

యువతకు కొత్త అవకాశాలు

పరీక్షలో ఉత్తీర్ణులకే లైసెన్సు

భూసేవల వేగవంతానికి ప్రభుత్వ చర్యలు

కర్నూలు కలెక్టరేట్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): భూముల సర్వేలు, రీ సర్వేలు, రిజిస్ర్టేషన్లు, లే అవుట్ల అనుమతుల ప్రక్రియలో పెరుగుతున్న డిమాండ్‌ వల్ల ప్రైవేటు సర్వేయర్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రభుత్వ సర్వేయర్ల కొరత, భూ సంబంఽధ సేవలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో అర్హులైన యువతకు ప్రైవేటు సర్వేయర్‌ లైసెన్సులు జారీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ప్రజలకు భూసేవలను వేగవంతం చేస్తుంది. గతంలో లైసెన్స్‌ పొంది ఉండి ప్రస్తుతం ఆసక్తి ఉన్న ప్రైవేటు సర్వేయర్లుకు మాత్రమే ప్రభుత్వం రెన్యువల్‌ చేస్తోంది. గతంలో ఉమ్మడి జిల్లాలోని 250 మంది అభ్యర్థులు ప్రైవేటు సర్వేయర్‌ లైసెన్సులు పొంది ఉన్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో దాదాపు 87 మంది ప్రైవేటు సర్వేయర్ల లైసెన్సులకు దరఖాస్తు చేసుకున్నారు.

అర్హతలు

ప్రైవేటు సర్వేయర్‌ లైసెన్సు పొందాలంటే ఐటీఐ సివిల్‌ డ్రాప్ట్‌మ్యాన్‌, డిప్లమా ఇన్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ లేదా బీటెక్‌ (సివిల్‌) అర్హత తప్పనిసరి. అంతేగాకుండా ఆధునిక సర్వే పరికరాలైన టోటల్‌ స్టేషన్‌, జీపీఎస్‌ సాంకేతికతపై అవగాహన లేదా శిక్షణ ఉండాలి. ఏపీ లైసెన్స్‌డ్‌ సర్వేయర్స్‌ నిబంధనలు-2003 ప్రకారం లైసెన్సులు జారీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రూ.5వేలు చలానా చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం విజయవాడలో నిర్వహించే ప్రత్యేక పరీక్షలో పాల్గొనాలి. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే లైసెన్సులు మంజూరు చేస్తారు. అలాగే పోలీసు ధృవీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది.

మూడేళ్ల పాటు చెల్లుబాటు : గతంలో లైసెన్సులు పొంది సేవలందించిన వారికి నిబంధనల మేరకు ప్రాధాన్యత ఇస్తూ రెన్యువల్‌ చేసే అవకాశం ఉంది. సర్వేలకు పారితోషికం లైసెన్సు పొందిన ప్రైవేటు సర్వేయర్లకు భూమి విస్తీర్ణం, సర్వే పరిధిని బట్టి ఒక్కో సేవకు రూ.500 నుంచి రూ.750 వరకు పారితోషికం లభించే అవకాశం ఉంది. భూముల కొలతలు, హద్దుల నిర్ధారణ, రికార్డుల సమన్వయం వంటి సేవల్లో వీరి పాత్ర కీలకంగా మారనుంది.

ప్రజలకు ప్రయోజనం: ప్రస్తుతం అనేక మండలాల్లో సర్వేయర్ల కొరత కారణంగా రైతులు, భూ యజ మానులు నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రైవేటు సర్వేయర్ల నియామకంతో ఈ సమస్య కొంత వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. భూ వివాదాల పరిష్కారం, రిజిస్ర్టేషన్‌ అనంతరం కొలతలు, రీసర్వే పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.

లైసెన్సు రెన్యువల్‌కు అవకాశం

గతంలో ఉమ్మడి జిల్లాలో 250 మంది ప్రైవేటు సర్వేయర్లకు లైసెన్సు జారీ చేశారు. కర్నూలు జిల్లాలో 87 మంది లైసెన్సు రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

- అరుణ్‌ కుమార్‌, డిప్యూటీ డైరెక్టర్‌

Updated Date - Jun 05 , 2026 | 11:35 PM