Share News

స్థానికంలో సత్తా చాటుదాం

ABN , Publish Date - Jan 25 , 2026 | 11:58 PM

‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విజయవంతంగా అమలు చేశాం. సూపర్‌-6ను సూపర్‌ హిట్‌గా అమలు చేశాం. సంక్షేమం..

స్థానికంలో సత్తా చాటుదాం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

టీడీపీ శ్రేణుల్లో ప్రజల్లోకి వెళ్లాలి

రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి

సీమకు నీరందించిన ఘతన చంద్రబాబుదే

మైనార్టీ, న్యాయ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

కొలువుదీరిన టీడీపీ జిల్లా కమిటీ

‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విజయవంతంగా అమలు చేశాం. సూపర్‌-6ను సూపర్‌ హిట్‌గా అమలు చేశాం. సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతోంది. ఇదే ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుదాం. టీడీపీ జెండాను పల్లె పల్లెనా ఎగురేద్దాం..’

- రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి

‘ప్రతిపక్షంలో ఉండి పోరాడి జగన్‌ రాక్షస పాలన అంతమొందించాం. అదే స్ఫూర్తితో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పనిచేయాలి. పార్టీలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉంటూ కష్టపడి పనిచేస్తే తగిన గుర్తింపు ఉంటుంది..’

- రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం వేడుకగా జరిగింది. పట్టణంలోని ఎస్‌ఆర్‌ పంక్షన్‌ హాల్‌లో టీడీపీ జిల్లా కార్యవర్గసభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు బీసీ జనార్ధన్‌ రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌తో పాటు ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, గిత్తా జయసూర్య తదితర ముఖ్య నాయకులు హజరయ్యారు. ముందుగా నాయకులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా గౌరు చరిత, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్‌ఎండీ ఫిరోజ్‌తో పాటు 40 మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ టీడీపీ నేతలు, కార్యకర్తలపై నూతన కార్యవర్గం అండగా నిలవాలన్నారు. ప్రజలు కూటమి పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వడంతో బాధ్యత మరింత పెరిగిందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నేతలందరూ ఒక్కటై సత్తా చాటుదామన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్చుకలేకపోతోందన్నారు. వైసీపీ నేతలు స్థాయికి మించి సిగ్గు.. శరం లేకుండా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్లలో వైసీపీ చేసిన పాపాలు వారికి నేడు శాపాలుగా మారుతున్నాయని దుయ్యబట్టారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ నేతలకు మాట్లాడే అర్హత కూడా లేదని గుర్తు చేశారు. మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ మాట్లాడుతూ.. 1982 నుంచి ఎంతో మంది సీనియర్లు జిల్లాలో టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే.. మీ సంగతి చూస్తామని వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. పోలీసులను ఉద్దేశించి సప్త సముద్రాల అవతల ఉన్నా.. వదిలిపెట్టేదిలేదని జగన్‌మోహన్‌రెడ్డి హెచ్చరించడం సిగ్గుచేటన్నారు.జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ.. ఇదే నంద్యాలలో సీఎం చంద్రబాబును అక్రమ అరెస్ట్‌ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దౌర్జాన్యాలను గుర్తించి 2024 ఎన్నికల్లో ప్రజలు 175 లో 164 స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి కూటమికి బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. కార్యకర్తలు, నాయకుల సేవలను ఎప్పటికి గుర్తించుకుంటామన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల మాదిరిగానే.. 2029 ఎన్నికల్లోనూ అన్ని స్థానాలను క్వీన్‌ స్లీప్‌ చేసే విధంగా కృషి చేస్తామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోను సమిష్టిగా పనిచేసి పార్టీకి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తాన్నారు.

ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా.. జిల్లా కేంద్రంలో నూతన కార్యవర్గ సభ్యులు అందుబాటులో ఉండి వారికి న్యాయం చేసే విధంగా పని చేయాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు నష్టపోకుండా ప్రభుత్వం కెసీ కెనాల్‌ ద్వారా నీటిని విడుదల చేసిందన్నారు. రైతులు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడుతూ.. అందరూ సమిష్టిగా పని చేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుదామన్నారు. సీఎం చంద్రబాబు రైతులకు ఎప్పటికి అండగా ఉంటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు మాండ్ర శివానందరెడ్డి, మల్లెల రాజశేఖర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీఆర్‌ ప్రసాద్‌, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ, రాష్ట్ర మార్కెఫెడ్‌ డైరెక్టర్‌ తులసి రెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్‌ గుంటుపల్లి హరిబాబు, కెసీ కెనాల్‌ ప్రాజెక్టు చైర్మన్‌ రామలింగారెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 11:58 PM