జీడీపీకి ఎల్లెల్సీ నీరు
ABN , Publish Date - Aug 04 , 2026 | 11:35 PM
గాజులదిన్నె ప్రాజెక్టుకు గత 13 రోజులుగా తుంగభద్ర దిగువ కాలువ నీరు రోజుకు 171 క్యూసెక్కల ప్రకారం చేరుతోంది.
గోనెగండ్ల, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె ప్రాజెక్టుకు గత 13 రోజులుగా తుంగభద్ర దిగువ కాలువ నీరు రోజుకు 171 క్యూసెక్కల ప్రకారం చేరుతోంది. ఈ నీటిని గోనెగండ్ల దగ్గర ఉన్న ఎస్కేప్ చానల్ ద్వారా జీడీపీలోకి అధికారులు మళ్లించారు. దీంతో గాజులదిన్నె ప్రాజెక్టు ఎల్లెల్సీ నీటితో కళకళ లాడుతోంది. ప్రస్తుతం జీడీపీలో 1.79 టీఎంసీల నీరు వచ్చి చేరింది. దీంతో జీడీపీ కింద ఉన్న ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే రబీలో సాగుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయకట్టు రైతులు తెలుపుతున్నారు. వర్షాలు సెప్టెంబరు, అక్టోబర్ నెలలో కూడా కురుస్తాయి కాబట్టి అప్పటి లోగా ప్రాజెక్టుకు కావాల్సినంత నీరు వచ్చి చేరుతుందనే నమ్మకం ఉందని రైతులు తెలుపుతున్నారు. జీడీపీ కుడి, ఎడమ కాలువ కింద దాదాపు 13వేల ఎకరాలు సాగు అవుతోంది. పలు తాగునీటి పథకాలకు కూడా ఈ నీరే అవసరం. అయితే ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో వర్షాలు కురియక పోయినప్పటికీ ఎల్లెల్సీ నీరు వచ్చి చేరుతుండటంతో జీడీపీకి నీటి కళ వచ్చి చేరింది. అలాగే తుంగభద్ర డ్యామ్‌కు కూడా గత రెండు రోజులుగా రోజుకు లక్ష క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతం నుంచి వచ్చి చేరడంతో ఎల్లెల్సీ రైతులు వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్‌కు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల వరద నీరు వచ్చి భారీగా చేరుతోంది.