Share News

నా శవాన్ని కుక్కలకు వదిలేయండి

ABN , Publish Date - May 11 , 2026 | 11:40 PM

నలుగురు పిల్లలు పుట్టి చనిపోయిన ఐదో సంతానంగా పుట్టిన కుమారుడిపై ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకు న్నారు.

నా శవాన్ని కుక్కలకు వదిలేయండి
ఆత్మహత ్య చేసుకున్న చిరంజీవి

తల్లిదండ్రులకు భారమయ్యాను

మృతదేహాన్ని వాళ్లకు అప్పగించవద్దు

ఇదే నా చివరి కోరిక

ఓ యువకుడి సూసైడ్‌ నోట్‌

రైలు కింద పడి బలవన్మరణం

నలుగురు పిల్లలు పుట్టి చనిపోయిన ఐదో సంతానంగా పుట్టిన కుమారుడిపై ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకు న్నారు. మృత్యుంజయుడు కావాలంటూ అతడికి ‘చిరంజీవి’ అనే పేరు కూడా పెట్టారు. అనారోగ్యం పాలయిన కుమారుడిని బతికించుకోవడానికి ఉన్న ఆస్తులు అమ్మి, డబ్బులు ఖర్చు చేశారు. అంత చేసిన ఆ కుమారుడు వృద్ధాప్యంలో అండగా ఉంటాడనుకున్న తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చాడు. రైలుకు ఎదురువెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు యువకుడు రాసుకున్న సూసైడ్‌ నోట్‌ ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఎంతో చేసిన తల్లిదండ్రులకు తానేమీ చేయలేకపోయానని, వారిని బాధపెట్టానంటూ ఆ నోట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఎన్నో పాపాలు చేశానని మదనపడ్డాడు. తన శవం తల్లిదండ్రులకు ఇవ్వవద్దని వేడుకున్నాడు. అంతేకాకుండా తన శవాన్ని కుక్కలకు వేయాలని, చెత్తకుప్పలో పడేయాలంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయంశంగా మారింది. నంద్యాల పట్టణ సమీపంలోని పొన్నాపురం రైల్వే గేటు సమీపంలో చోటు చేసుకున్న ఈ సంఘటన అందర్నీ కలవరపరుస్తోంది.

నంద్యాల క్రైమ్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డ మండలం పడకండ్లకు చెందిన మునెయ్య కుమారుడు చిరంజీవి (25) నంద్యాల పట్టణం ఎన్‌జీవో్‌స కాలనీలో నివాసం ఉంటూ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మునెయ్యకు నలుగురు సంతానం పుట్టి చనిపోయారు. ఐదో సంతానంగా జన్మించి అనారోగ్యం పాలైన చిరంజీవిని బతికించుకునేందుకు నానా కష్టాలు పడ్డారు. పుట్టుకతోనే మెదడు సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న యువకుడి వైద్యం కోసం తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అయితే తన వల్ల తల్లిదండ్రులకు ఎలాంటి లాభం లేదని, కష్టాలు, ఇబ్బందులు తప్ప వారికి ఏమీ చేయలేకపోయానని జీవితంపై విరక్తి చెందిన చిరంజీవి మనోవేదనతో ఓ సూసైడ్‌ నోట్‌ను ముందుగా రాసుకున్నాడు. తన వల్ల ఎలాంటి ఉపయోగం లేనప్పుడు తాను బతికి ప్రయోజనం లేదనుకున్నాడో..ఏమో కాని.. లేకలేక పుట్టిన తనను తన తల్లిదండ్రులు ఎంతో గారాభంగా..ఆప్యాయంగా చూసుకున్నారని, తాను ఉండి వారిని కష్టపెట్టేకంటే చనిపోతే వారికి కష్టాలు తప్పుతాయనుకున్న చిరంజీవి సూసైడ్‌ నోట్‌ను పెట్టి రైలుకు ఎదురెళ్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు మృతుడు చిరంజీవి రాసిన సూసైడ్‌ నోట్‌లో ‘నా శవాన్ని తల్లిదండ్రులకు అప్పగించవద్దని, ఆరోగ్యం సహకరించడం లేకపోవడం ఆత్మహత్యకు చేసుకుంటున్నా. ఉరిశిక్ష పడిన వారికి కూడా చివరి కోరిక ఇస్తారు. అలాగే నాకూ ఓ కోరిక ఉంది. నా చివరి కోరిక తీర్చండి. నేను చనిపోయాక నా శవాన్ని కుక్కలకు ఆహారంగా వేస్తే సంతృప్తికరంగా ఉంటుంది. లేకపోతే ఎక్కడైనా చెత్త కుప్పలోనైనా పడేయండి. అంతేకానీ అమ్మా నాన్నలకు మాత్రం శవాన్ని ఇవ్వకండి. నా చావు, నా శవాన్ని చూసి వారు తట్టుకోలేరు. వారి ఆవేదన, బాధ నేను ఊహించలేను. ఈ లెటర్‌ మాత్రం ఇచ్చి క్షమాపణ కోరినట్లు చెప్పండి. ఇక సెలవ్‌..’ అంటూ రాసిన సారాంశం కంటనీరు తెప్పించింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి చిరంజీవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - May 11 , 2026 | 11:40 PM