Share News

కొనసాగుతున్న న్యాయవాదుల ఆందోళన

ABN , Publish Date - Feb 26 , 2026 | 01:05 AM

న్యాయవాది పవన కుమార్‌పై దాడి చేసిన నాలుగో పట్టణ సీఐని శిక్షించాలని న్యాయవాదులు చేస్తున్న ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. న్యాయవాదులు బుధవారం కూడా కోర్టు విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు.

కొనసాగుతున్న న్యాయవాదుల ఆందోళన
ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్తున్న న్యాయవాదులు

విచారణ కమిటీని నియమించిన ఎస్పీ

కర్నూలు లీగల్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): న్యాయవాది పవన కుమార్‌పై దాడి చేసిన నాలుగో పట్టణ సీఐని శిక్షించాలని న్యాయవాదులు చేస్తున్న ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. న్యాయవాదులు బుధవారం కూడా కోర్టు విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జిల్లా ఎస్పీకి విజ్ఞాపన పత్రాన్ని అందజేసి న్యాయవాదిపై దాడి చేసిన సీఐ విక్రమసింహ పై చర్యలు తీసుకోవాలని ఎస్పీ విక్రాంత పాటిల్‌ను న్యాయవాదులు కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ ఘటనపై కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్‌ ఆధ్వర్యంలో విచారణ కమిటీని వేసినట్లు ఆయన తెలిపారు. రిపోర్టు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని, అంతవరకు వేచి చూడాలని ఎస్పీ న్యాయవాదులను కోరారు.

ఆసుపత్రిలో చేరిన న్యాయవాది పవన కుమార్‌: తనపై ఫోర్త్‌ టౌన సీఐ దాడి చేశాడని ఆరోపణలు చేస్తున్న న్యాయవాది ఎం. పవన కుమార్‌ బుధవారం అస్వస్థతకు గురై ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారని ఆయన భార్య మీడియాకు తెలిపారు. బుధవారం ఉదయం తన భర్త తీవ్ర మానసిక ఆవేదనకు గురై పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్పించామని తెలిపారు.

Updated Date - Feb 26 , 2026 | 01:05 AM