భూ బకాసురులు
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:14 PM
ఆదోనిలో భూబకాసురుల ఆకలి మాత్రం తీరడం లేదు. రాజకీయ నాయకులు, కొందరు అవినీతి అధికారులు కుమ్మక్కై రూ.10కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పంచుకున్నారు.
రూ.10 కోట్ల విలువైన స్థలం కబ్జా
కుమ్మక్కైన అధికారులు, నాయకులు?
మండిగిరి సర్వే నంబర్ 630లో ప్రభుత్వ భూమి స్వాహా
ఆదోని, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఆదోనిలో భూబకాసురుల ఆకలి మాత్రం తీరడం లేదు. రాజకీయ నాయకులు, కొందరు అవినీతి అధికారులు కుమ్మక్కై రూ.10కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పంచుకున్నారు. మండిగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 630లో సాగుతున్న ఈ అక్రమ దందా ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది.
వంకను సైతం వదలకుండా..
ఆర్‌ఎస్‌ఆర్ (రెసెటిల్‌మెంట్ రిజిస్టర్) రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 630లో ఉన్న 3.33 ఎకరాల భూమి ప్రజల అవసరా కోసం కేటాయించిన రస్తా(దారి) స్థలం. ఇప్పుడు అక్కడ రస్తా కనపడదు. కేవలం రాతి స్తంభాలు, ప్రహరీలు మాత్రమే కనిపిస్తున్నాయి. సహజ సిద్ధంగా ప్రవహించే వంకను సైతం వదలకుండా ఆక్రమించి ప్రహరీ నిర్మించారంటే ఆక్రమణదారుల తెగింపు ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వాటాల పర్వంలో భాగస్వాములు
ఈ భూకబ్జాలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు భాయి-భాయి అన్నట్లు వ్యవహరించడం విశేషం. గత ప్రభుత్వ హయాంలో ఈ ఆక్రమణల పర్వానికి తెరలేపారు. ప్రభుత్వం మారాక అడ్డుకోవాల్సిన కొందరు కూటమి నేతలు సైతం ఈ వాటాల పర్వంలో భాగస్వా ములు అయ్యారు. ఒక యువ నాయకుడు, మరో కీలక నేతకు ఇందులో భారీగా ప్లాట్లు దక్కినట్లు ఆరోపణలున్నాయి.
సమగ్ర విచారణ జరిపించాలి
కలెక్టర్ ప్రత్యేక బృందంతో సర్వేనంబర్ 630లో సమగ్ర విచారణ జరిపించాలి. అక్రమంగా పొందిన పట్టాలను తక్షణమే రద్దుచేసి భూమిని స్వాధీనం చేసుకోవాలి. నిబంధనలు అతిక్రమించి నిర్మించిన ప్రహరీలను కూల్చివేయాలి. అవినీతికి సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
చక్రం తిప్పిన రెవెన్యూ అధికారి
ఈ కుంభకోణంలో గతంలో ఆదోనిలో పని చేసిన ఒక ఆర్‌ఐ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. రిటైర్డ్ అయిన తహసీల్దార్లకు భారీగా ముడుపులిచ్చి పాత తేదీలతో పట్టాలు సృష్టించారు. సదరు ఆర్‌ఐ తన అధికార దుర్వినియోగంతో సొంత బంధువుల పేరిట కూడా ప్లాట్లు చేయించుకోవడం గమనార్హం. రెవెన్యూ రికార్డులను సైతం తారుమారు చేసి ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేశారు. ప్రస్తుతం ఈ భూ కుంభకోణం వ్యవహారం ఎమ్మెల్యే పార్థసారథి, ఉన్నతాధికారుల వద్దకు చేరడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. అవినీతికి పాల్పడిన సదరు అధికారిపై ఇప్పటివరకు విచారణ జరగకపోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ స్థలాన్ని కాపాడుతాం
మండిగిరి పంచాయతీలోని సర్వే నంబర్ 630లో 3.33 ఎకరాల భూమి ఉంది. అందులో ప్లాట్లు వేసినట్లు నాకు తెలిసింది. బీజేపీ నాయకులు సైతం నాదృష్టికి తెచ్చారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఆ ప్రభుత్వ స్థలాన్ని కాపాడుతాం.
-శేషఫణి, తహసీల్దార్, ఆదోని