శ్రీస్వామి నారాయణ గురుకులానికి భూమి
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:16 AM
ఆధునిక విద్య.. సద్విద్య.. బ్రహ్మవిద్య అనే మూడు ప్రధాన విద్యా బోధనలు అందించే అంతర్జాతీయ గుర్తింపు పొందిన శ్రీ స్వామి నారాయణ గురుకుల అంతర్జాతీయ పాఠశాల(ఎస్‌జీఐఎస్) కర్నూలులో ఏర్పాటు కానుంది. కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామ పరిధిలో పాఠశాల స్థాపనకు పది ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలనే ఆ సంస్థ విన్నపాన్ని ప్రభుత్వం పరిశీలించింది
ఎకరం రూ.71.63 లక్షల మేరకు ధర నిర్ణయం
ఓర్వకల్లులో సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్ ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు
దేవనకొండ మండలంలో సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థకు భూమి
మంత్రివర్గం కీలక నిర్ణయం
కర్నూలు, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఆధునిక విద్య.. సద్విద్య.. బ్రహ్మవిద్య అనే మూడు ప్రధాన విద్యా బోధనలు అందించే అంతర్జాతీయ గుర్తింపు పొందిన శ్రీ స్వామి నారాయణ గురుకుల అంతర్జాతీయ పాఠశాల(ఎస్‌జీఐఎస్) కర్నూలులో ఏర్పాటు కానుంది. కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామ పరిధిలో పాఠశాల స్థాపనకు పది ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలనే ఆ సంస్థ విన్నపాన్ని ప్రభుత్వం పరిశీలించింది. మార్కెట్ ధర ఎకరం రూ.71.63 లక్షల ప్రకారం కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంగళవారం ఉండవల్లి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్‌రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్ హాజరయ్యారు. జిల్లాలో పలు సంస్థలు ఏర్పాటుకు భూ కేటాయింపులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే అంతర్జాతీయ గుర్తింపు పొందిన శ్రీ స్వామి నారాయణ గురుకుల ఇంటర్నేషన్ స్కూల్ స్థాపనకు ప్రభుత్వ భూమిని కేటాయించారు.
ఓర్వకల్లు నోడ్‌లో సింథటిక్ ఆర్గానిక్ కెమికల్ ఉత్పత్తి
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్ గుట్టుపాడు క్లస్టర్‌లో సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్, ఏపీఐ ఉత్పుత్తులు చేసేందుకు విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. ఈ సంస్థకు ఎస్‌ఐపీబీ సిఫార్సుల మేరకు ప్రోత్సాహకాలు అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే.. దేవనకొండ మండలం ముతకూరు తదితర గ్రామాల్లో రెన్యూ ఫొటో వోల్టాయిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేసింది. రైతుల నుంచి ప్రైవేట్ భూములను కొనుగోలు చేసి సోలార్ యూనిట్ ఏర్పాటు చేశారు. ఆ భూముల మధ్యలో ఖాళీగా ఉన్న రెవిన్యూ, అసైన్డ్ భూములు కేటాయించాలని ఆ సంస్థ విన్నపం మేరకు ఆ భూములను కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 కింద సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం క్యాప్టివ్ జనరేటింగ్ ప్లాంట్లకు వర్తించే ప్రోత్సాహకాలను కొనసాగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జిల్లాలో ఆలూరు, చిప్పగిరి, హొళగుంద మండలాల్లో 900 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల కోసం ఎన్‌టీసీసీ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్‌కు అనుమతులు మంజూరు చేసింది.