ఎమ్మిగనూరులో చేనేతల స్థలం కబ్జా
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:49 PM
‘అధికార, ప్రతిపక్ష నాయకులు కుమ్మక్కై ఓ నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన ఆరు సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారు.
అధికార, ప్రతిపక్ష నాయకులు కుమ్మక్కు
న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు
ఎమ్మిగనూరు, జనవరి 21(ఆంధ్రజ్యోతి): ‘అధికార, ప్రతిపక్ష నాయకులు కుమ్మక్కై ఓ నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన ఆరు సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారు. తనను స్థలాన్ని కబ్జా చేశారు..’ అంటూ బాధితులు వీడియో తీసి పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితులు తెలిపిన వివరాలు.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మిల టరీ కాలనీ సమీపంలో 30ఏళ్ల క్రితం చేనేత కుటుంబానికి చెందిన నారాయణ, నాగరత్న అనే దంపతులు ఆరు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. అప్పట్లో ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవటంతో నివాసం ఏర్పాటు చేసుకోలేకపోయినట్లు పేర్కొంటున్నారు. మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్న వీరు ఇటీవలే గతంలో తాము కొనుగోలు చేసిన స్థలంలో గుడిసె వేసుకునేందుకు బండలు పాతారు. పట్టణానికి చెందిన ఓఅధికార పార్టీ ముఖ్య నాయకుడు, వెంకటాపురం కాలనీకి చె ందిన ఓ ప్రతిపక్ష నాయకుడి అనుచరులు వచ్చి ఆ స్థలం తమదేనని బండ లు తొలగించాలన్నారు. ఈ స్థలం తాము 30 ఏళ్ల క్రితం 574సర్వే నంబర్‌లో ప్లాట్ నెం 16, 17ను తాము కొనుగోలు చేశామని స్థలానికి రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని చూపించారు. ఎంత చెప్పిన వినకుండా నాయకుల అనుచరులు 30మంది దౌర్జన్యంగా బండలను పగలగొట్టారు. అడ్డుకునేందుకు వెళ్తే చంపుతామని బెదిరిస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదుచేసినా ఎవరూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి తమకు న్యాయం చేయాలని మొర పెట్టుకున్నారు.