వైసీపీ హయాంలో భూ కబ్జాలు
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:29 PM
గతంలో వైసీపీ నాయకులకు భూకబ్జాలే ఆభరణాలుగా మారాయని ఆళ్లగడ్డ ఎమ్యెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు.
ఆ పార్టీ నాయకులను ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
నంద్యాల రూరల్, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): గతంలో వైసీపీ నాయకులకు భూకబ్జాలే ఆభరణాలుగా మారాయని ఆళ్లగడ్డ ఎమ్యెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు. పట్టణంలోని తెలుగుగంగ కార్యాలయంలో బుధవారం నీటిలభ్యత, ప్రవాహంపై సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నీటి ప్రవాహంపై అవగాహన లేని నాయకులు కూడా విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌పై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రాజెక్ట్‌ల కోసం త్యాగాలు చేశామని ఊకదంపుడు ప్రచారాలు చేసుకోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. వైసీపీ నాయకుల ప్రవర్తనపై ప్రజలు విసుగు చెందారని, వారే తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి కేసీ కెనాల్‌ను ఆక్రమించి వెంచర్ వేసి రైతుల పక్షాన నిలబతామంటూ ఉత్తుత్తి ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్ట్‌ను ఆపాలని కేంద్రాన్ని కోరినపుడు అధికారంలో ఉండి ఏం చేశారని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. ఇరువురి మధ్య జరిగిన ఒప్పందం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ముచ్చుమర్రి, అన్నమయ్య ప్రాజెక్ట్ పునర్మిర్మాణం, హంద్రీ-నీవా విస్తరణ, శ్రీశైలం ప్రాజెక్ట్ పెండింగ్ పనులకు రూ.210 కోట్లు కేటాయింపు, తుంగభద్ర 33 గేట్లకు మరమ్మతులు చేయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని తెలుగుగంగ సబ్ కాలువల మరమ్మతులకు రూ.71 కోట్లతో ప్రతిపాదనలు పంపామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. తెలుగుగంగ నీటి ప్రవాహం 5వేల క్యూసెక్కుల నుంచి 8వేల క్యూసెక్కులకు పెంచడానికి రూ.400 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.