Share News

పులకుర్తిలో స్థల వివాదం

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:21 AM

మండలంలోని పులకుర్తిలో ఓ ఇంటి స్థలం విషయంలో గొడవ జరిగింది. గూడూరు రహదారిలో ఇరవై ఏళ్ల కిందట ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేసింది. అక్కడ పేదలు నివాసాలు ఏర్పరచుకున్నారు.

పులకుర్తిలో స్థల వివాదం
పట్టా చూపుతున్న బాధితులు, తొలగించిన రేకుల ఇల్లు

ఇంటి రేకులు కూల్చారని బాధితుల ఫిర్యాదు

కోడుమూరు రూరల్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పులకుర్తిలో ఓ ఇంటి స్థలం విషయంలో గొడవ జరిగింది. గూడూరు రహదారిలో ఇరవై ఏళ్ల కిందట ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేసింది. అక్కడ పేదలు నివాసాలు ఏర్పరచుకున్నారు. నాగన్న, దస్తగిరమ్మ అనే దంపతులు తొమ్మిది నెలల క్రితం అక్కడ గుడిసెను తొలగించి నాపరాతి బండలు, రేకులు, పైపులతో ఇల్లు కట్టుకున్నారు. అయితే ఆ స్థలంతోపాటు మరికొన్ని ప్లాట్లు పాఠశాల కోసం కేటాయించినట్లు కొందరు కొన్ని రోజుల కింద అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కర్నూలు వెళ్లి పీజీఆర్‌ఎ్‌సలో అర్జీ ఇచ్చారు. అధికారులు ఈ వివాదాన్ని 75 రోజుల్లో పరిష్కరించాలని సిబ్బందికి గడువు విధించారు. రెండు రోజుల క్రితం నాగన్న కంటి ఆపరేషన్‌ కోసం ఆ దంపతులు కర్నూలు వెళ్లారు. ఆ సమయంలో వారి ఇంటికి ఉన్న బండలు, రేకులు కొందరు తొలగించారు. దీంతో ఆ దంపతులు పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. రేకుల ఇంటిని తొలగించడంతో పాటు నగదు, బంగారు దొంగిలించారని ఆరోపించారు. స్థల వివాదంపై తహసీల్దార్‌ నాగరాజు వివరణ కోరగా ఆ స్థలంపై కొందరు ఫిర్యాదు అందించారని తెలిపారు. విచారణ జరిపి నివేదికను ఆర్డీవోకు పంపామఅన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 12:21 AM