భూ సేక‘రణం’..!
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:56 PM
ఎన్నో ఏళ్ల పశ్చిమ ప్రాంత రైతుల స్వప్నం వేదవతి ప్రాజెక్టు. తాగు, సాగునీరు అందించాలి..
ఎకరాకు రూ.8 లక్షల పరిహారం
నాలుగేళ్ల కిందటి ధరతో పొట్టకొట్ట వద్దంటున్న రైతులు
వేదవతి ప్రాజెక్టు భూ నిర్వాసితుల ఆక్రందన
సేకరించాల్సిన భూములు 4,819.73 ఎకరాలు
ఒత్తిళ్ల మధ్య భూసేకరణ సాధ్యమా..?
న్యాయమైన పరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్
కర్నూలు, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఎన్నో ఏళ్ల పశ్చిమ ప్రాంత రైతుల స్వప్నం వేదవతి ప్రాజెక్టు. తాగు, సాగునీరు అందించాలి.. కరువు, వలసలు నివారించాలనే లక్ష్యంగా 2019లో ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. దశాబ్దాలుగా సాగు, తాగునీటి కోసం తల్లడిల్లుతున్న కరువు పల్లె సీమలకు జీవజలం అందించే ప్రాజెక్టులు అవసరమే. ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం జీవనాధారమైన సాగు భూములు త్యాగం చేస్తున్న అన్నదాతలకు న్యాయమైన పరిహారం చెల్లించి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేదవతి ప్రాజెక్టు నిర్మాణం కోసం 4,819.73 ఎకరాలు రైతుల నుంచి తీసుకోవాలి. నాలుగేళ్ల క్రితం ఎకరం రూ.8 లక్షలు ప్రకారం ధర నిర్ణయించారు. ఏళ్లు గడుస్తున్నా.. 23 ఎకరాలకు మాత్రమే పరిహారం చెల్లించారు. భూముల ధరలు చుక్కలు తాకాయి. ఈ పరిస్థితుల్లో నాలుగేళ్ల కింద నిర్ణయించిన రేట్లకు భూములు ఇచ్చి తాము ఎట్లా బతకాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా న్యాయమైన పరిహారం అందించి భూ నిర్వాసిత రైతులకు అండగా నిలవాలని రైతులు సంఘాల నాయకులు కోరుతున్నారు. వేదవతి ప్రాజెక్టు భూసేకరణపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య ఆలూరు, ఆదోని నియోజకవర్గాల సరిహద్దుల్లో వేదవతి (హగరి) నది ప్రవహిస్తుంది. యేటా 30-45 టీఎంసీల వరద జలాలు తంగభద్రలో కలుస్తున్నాయని దివంగత రిటైర్డ్ ఇంజనీరు సుబ్బరాయుడు అంచనా వేశారు. వరద నీటిని ఒడిసిపట్టి కరువు నేలకు మళ్లిస్తే.. ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు ఇవ్వవచ్చని రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఆ నివేదిక ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే చేసి డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) ఇవ్వాలని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.2 కోట్లు నిధులు విడుదల చేశారు. వేదవతి నది, అవసరాన్ని బట్టి హంద్రీనీవా కాలువ నుంచి 8 టీఎంసీలు వెత్తిపోసి సాగు, తాగునీరు ఇవ్వడానికి అనుకూలతలు ఉన్నాయంటూ 2016లో సర్వే సంస్థ నాటి సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు, రూ.1,942.38 కోట్లు నిధులు మంజూరు చేస్తూ 2019 జవనరిలో జీవో.ఆర్‌టీ.నెం.77 జారీ చేసింది. ఫిబ్రవరిలో టెండర్లు పిలవగా హైదరాబాద్‌కు చెందిన మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ర్ఫాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ 4.69 శాతం అధిక (ఎక్సెస్) రేట్లకు దక్కించుకుంది. పనులు దక్కించుకున్న మెఘా కంపెనీ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. అదే ఏడాది ఎన్నికలు రావడం, మేలో జగన్ ఆధ్వర్యంలో ఏర్పడి వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల నిర్లక్ష్యం వేదవతి ప్రాజెక్టుకు శాపంగా మారింది. గంపెడు మట్టి కూడా తీయలేదు. ఒక్క ఎకరా భూమి కూడా సేకరించలేదు.
భూ సేకరణలో జాప్యం
భూసేకరణలో అంతులేని జాప్యం వల్ల వేదవతి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ సేకరణ కోసం 2022లో అప్పటి కలెక్టర్ కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ (జేసీ) రాంసుందరరెడ్డి గ్రామాల్లో రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. సాగు భూములు ఇవ్వడానికి మొదట్లో ఇవ్వడానికి రైతులు ఒప్పుకోలేదు. వేలాది మంది రైతులు, వందల గ్రామాలకు జల ప్రయోజనాలు అందించాలంటే రైతులు త్యాగాలు అవసరమని అవగాహన కల్పిస్తే, ఎకరానికి రూ.15 లక్షలు పరిహారం చెల్లిస్తే ఇస్తామంటూ ముందుకు వచ్చారు. జిల్లా అధికారులు రూ.8 లక్షలు రేటు నిర్ణయించారు. ఈ రేటుకు భూములివ్వడం ఇష్టం లేకపోయినా తమ ప్రాంతం బాగుకోసం ఎట్టకేలకు మెజార్టీ రైతులు ఒప్పుకున్నారు. తక్షణమే భూ సేకరణ చేసి ఉంటే, ఈపాటికి ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఉండేది. అయితే.. అప్పటి వైసీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వపోగా, అంతులేని నిర్లక్ష్యం కారణంగా భూసేకరణ అటకెక్కింది. ఫలితంగా వేదవతి ప్రాజెక్టుకు శాపంగా మారింది. సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక వేదవతి ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో నిర్మాణం చేపట్టే 36 ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో వేదవతి ప్రాజెక్టును కూడా చేర్చింది. 2028 జూలై ఆఖరులోగా పనులు పూర్తి చేసి రైతులకు అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత నెల 25న సంజీవని కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఆలూరు నియోజకవర్గం ఆస్పరికి వచ్చిన సీఎం చంద్రబాబు వేదవతి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి అన్నదాతకు అంకితం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, పనులు పూర్తి చేయాలంటే హాలహర్వి, ఆలూరు, చిప్పగిరి, మద్దికెర మండలాల్లో 4,819.73 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఏడేళ్ల కాలంలో 703.51 ఎకరాలకు మాత్రమే ఎంజాయిమెంట్ సర్వే పూర్తి చేశారు. 196.15 ఎకరాలకు మాత్రమే అవార్డు పాస్ చేశారు. అందులో కేవలం 23 ఎకరాకలకు మాత్రమే రైతులకు భూ పరిహారం చెల్లించారు. రూ.181.05 కోట్లు విలువైన పనులు చేసిన కాంట్రాక్ట్ సంస్థ, భూసేకరణలో జాప్యం, నిధుల కొరత, చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో చేతులెత్తేసింది. గురువారం కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి వేదవతి ప్రాజెక్టు నిర్మాణం ప్రదేశాలను పరిశీలించారు. 15 రోజుల్లో భూ సేకరణ ప్రక్రియ మొదలు పెడుతామని పేర్కొన్నారు.
నాలుగేళ్ల కిందటి రేటుకు భూములెలా ఇస్తాం?:
కలెక్టర్ డాక్టర్ సిరి ప్రకటనతో భూ నిర్వాసిత రైతుల్లో ఆందోళన మొదలైంది. భూ సేకరణ సరే..! పరిహారం ఎంత ఇస్తారు..? రేటు తేల్చకుండానే భూ సేకరణ ఎలా చేపడుతారు..? అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. 2022లో ఎకరానికి రూ.8 లక్షలు పరిహారం చెల్లించేలా ఆనాటి కలెక్టర్ కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ రామసుందరరెడ్డి రేటు నిర్ణయించారు. దాదాపు నాలుగేళ్లు గడిచింది. ఇప్పుడు అదే రేటుకు భూసేకరణ చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. తమకు జీవనాధారమైన భూములు కోల్పోవడానికి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే.. తమ పల్లెల నీటి ప్రయోజనాలు, భవిష్యత్తు తరాల అవసరాల కోసం అయిష్టంగానే భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నామని అంటున్నారు. ఇప్పుడొచ్చి నాలుగేళ్ల క్రితం నిర్ణయించిన ధరకే భూములు సేకరిస్తారంటే ఎలా ఇస్తాం..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు ఎకరానికి రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాం. జిల్లా అధికారులు రూ.8 లక్షలకు ఒప్పించారు. ప్రస్తుతం భూముల ధరలు బాగా పెరిగాయి. మార్కెట్ రేటు ఎకరం రూ.15-20 లక్షలకు పైగా పలుకుతోంది. ప్రధాన రోడ్డు పక్క పొలాలైతే రూ.25-30 లక్షలకు పైగా పలుకుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాలుగేళ్ల క్రితం నిర్ణయించిన పరిహారమే చెల్లిస్తాంటే భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని రైతులు ఏకరువు పెడుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్ విలువతో సంబంధం లేకుండా, భూ సేకరణ చట్టం-2013 ప్రకారం మార్కెట్ విలువ ప్రకారం భూమి ధర నిర్ణయించాలి. ఆ ధరపై రెండు రెట్లు అధికం చేసి, దీనికి వంద శాతం కలిపి ఎకరానికి ధర నిర్ణయించి పరిహారం చెల్లిస్తేనే న్యాయం జరుగుతుందని రైతులు అంటున్నారు.
సాగు భూములే మాకు జీవనాధారం - ఉశేని, రైతు, బిలేహాల్ గ్రామం, హాలహర్వి మండలం:
వేదవతి ప్రాజెక్టులో భాగంగా మా ఊరు వద్ద 2.029 టీఎంసీలతో హాలహర్వి జలాశయం నిర్మిస్తామంటున్నారు. మాకు జీవనాధారమైన మూడు ఎకరాల భూమిని కోల్పోవాల్సి వస్తుంది. ఇక్కడ ఎకరం రూ.25 లక్షలకు పైగా పలుకుతోంది. ఎకరాకు రూ.2 లక్షలు పరిహారం ఇస్తామంటే ఒప్పుకోలేదు. 2022లో అప్పటి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ భూ సేకరణ కోసం సమావేశం పెడితే భూములు ఇచ్చేదిలేదని ఊరంతా ఒప్పుకోలేదు. ఎకరాకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలి.
భూసేకరణ ఇలా (ఎకరాల్లో)
వివరాలు భూములు
సేకరించాల్సిన భూములు 4,819.73
ఎంజాయిమెంట్ సర్వే 703.51
అవార్డు పాస్ అయినది 109.15
అవార్డు పాస్ దశలో ఉన్నది 199.05
అవార్డు దశలో ఉన్నది 205.67
ఇప్పటికే సేకరించిన భూమి 23.05
చెల్లించిన పరిహారం రూ.1.53 కోట్లు
వేదవతి ప్రాజెక్టులో భాగంగా సేకరించే భూములు (ఎకరాల్లో), భూ నిర్వాసిత గ్రామాలు
మండలం సేకరించే గ్రామాలు
భూములు
హాలహర్వి 2,724.90 అమృతాపురం, కుర్లేహల్లి,
విరూపాపురం, బొల్లుగొట్ట,
బిలేహాల్, హాలహర్వి, నెట్రవట్టి
ఆలూరు 491.63 అరికెర, హలేబీడు, మొలగవళ్లి,
ఆలూరు, హత్తిబెలగల్,
పెద్దహోతూరు, తుంబలబీడు
చిప్పగిరి 1,558.88 నేమకల్లు, చిప్పగిరి
మద్దికెర 44.13 బూరుజుల, మద్దికెర, ఆగ్రహారం
మొత్తం 4,819.73