లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:33 PM
యాజమాన్యాలకు అనుగుణంగా, కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కేంద్ర కార్మిక, రైతు, వ్యవసాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
కార్మిక సంఘ నాయకుల డిమాండ్
నగరంలో జైలు భరో
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): యాజమాన్యాలకు అనుగుణంగా, కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కేంద్ర కార్మిక, రైతు, వ్యవసాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక, రైతు, వ్యవసాయ సంఘాల పిలుపు మేరకు సోమవారం వందలాది మంది కార్మికులు రాజవిహార్ నుంచి కలెక్టరేట్ వరకు ఊరేగింపు నిర్వహించి, ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు జి. చంద్రశేఖర్, సీఐటీయూ నగర కార్యదర్శి విజయ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యరద్శి కే. జగన్నాథం, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి. నిర్మల మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ కూలీలకు కనీస వేతేనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం కింద సుప్రీంకోర్టు నెలకు రూ.31 వేలు అని చెప్పినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. భారత ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. ఉపాధి కూలీలకు కనీస వేతనం రూ.700 ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజులు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు
జైల్ భరో కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్న 71 మంది కార్మికులను, నాయకులను మూడో పట్టణ సీఐ శేషయ్య అధ్వర్యంలో అరెస్టు చేసి మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ. అంజిబాబు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నక్కి లెనిన్‌బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారాయణ, స్వరాజ రైతు ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి శేఖర్, సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్‌దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.