కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలి
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:04 PM
కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్
నగరంలో భారీ ర్యాలీ, కలెక్టరేట్ ముట్టడి
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని కలెక్టరేట్‌ను ముట్టడించారు. ముందుగా జడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ప్రజానాట్య మండలి కళాకారుడు డప్పు మాణిక్యం వేసిన రైతు ఆత్మహత్య వేషధారణ ప్రజలను ఆలోచింప చేసింది. వినూత్నంగా ఎద్దుల బండిపై రైతు ఆత్మహత్య, కుటుంబ సభ్యులు విలపిస్తున్న దృశ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య అధ్యక్షతన ఆందోళన చేపట్టారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ జిల్లాలో కరువు విలయతాండవం చేస్తుంటే పాలకులు మొద్దు నిద్రపోతున్నారని, పంటలు ఎండిపోతున్నా పరిశీలించడం లేదని మండిపడ్డారు. జిల్లాలో వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్, ప్రాజెక్టులతో పాటు హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు అంతర్గత కాలువలు నిర్మించాలని డిమాండ్ చేశారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు. దేశంలో ఎన్డీయే పాలన పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతు భరోసా రూ.50 వేలు ఇవ్వాలని, పంట నష్టపోయిన వారికి ఎకరాలకు రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని అన్నారు. రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.రామాంజనేయులు, పి.రామచంద్రయ్య ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు ఎస్.మునెప్ప, లెనిన్‌బాబు, కార్యవర్గ సభ్యులు రామకృష్ణారెడ్డి, నభిరసూల్, మద్దిలేటి, లలితమ్మ, శ్రావణిరెడ్డి, శ్రీనివాసులు, కారుమంచి తదితరులు పాల్గొన్నారు.