జగన్... అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చెయ్యి
ABN , Publish Date - Jan 29 , 2026 | 04:20 AM
మాజీ సీఎం జగన్ బయట ఉంటూ మాట్లాడటం కాదు. అసెంబ్లీకి వెళ్లి గళమెత్తాలి. అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయాలి’ అని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
సీమపై సభలో మాజీ సీఎం మాట్లాడాలి
రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి
కర్నూలు న్యూసిటీ, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ‘మాజీ సీఎం జగన్ బయట ఉంటూ మాట్లాడటం కాదు. అసెంబ్లీకి వెళ్లి గళమెత్తాలి. అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయాలి’ అని రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు రాయలసీమకు వరప్రసాదం. దానిపై వైసీపీ నాయకులు, ఆ పార్టీ అధినేత జగన్ బయట నుంచి మాట్లాడటం సరికాదు. మాజీ సీఎంగా, ప్రతిపక్ష పార్టీ నేతగా జగన్ చేతులు ముడుచుకుని కూర్చోవడం విడ్డూరంగా ఉంది. సీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలుపుదల అంశంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసి నెలరోజులవుతోంది. నేటికీ ఆ వ్యాఖ్యలను జగన్ ఖండించకపోవడం బాధాకరం. అసెంబ్లీకి వెళ్లి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయకుండా రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్నారు. దమ్ముంటే అసెంబ్లీలో రాయలసీమ లిఫ్టు ప్రాజెక్టుపై జగన్ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రాజెక్టు పనులను పునరుద్ధరించేలా చొరవ తీసుకోవాలి. జగన్... అసెంబ్లీకి వెళ్తావా? రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తావా? తేల్చుకో. వివిధ రంగాల్లో బడ్జెట్ కేటాయింపులను రాయలసీమ ప్రాంతాల్లో ఖర్చు చేయడం లేదు. అందువల్ల జనాభా ప్రాతిపదికన 42 శాతం బడ్జెట్ నిధులను రాయలసీమకు విడిగా కేటాయించాలి. కడప ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలో పూర్తిచేయాలి. విభజన చట్టంలో రాయలసీమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి’ అని కుంచం కోరారు.