Share News

భ్రామరికి కుంభోత్సవం

ABN , Publish Date - Apr 08 , 2026 | 12:09 AM

అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహా క్షేత్రంలో భ్రమరాంబదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం నేత్రపర్వంగా జరిగింది.

భ్రామరికి కుంభోత్సవం
కుంభరాశికి ప్రత్యేక పూజలు

స్త్రీ వేషధారణలో హారతి ఇచ్చిన పురుషుడు

శ్రీశైలంలో అమ్మవారి నిజరూప దర్శనం

శ్రీశైలం, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహా క్షేత్రంలో భ్రమరాంబదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఏటా చైత్రమాసంలో పౌర్ణమి తరువాత కుంభోత్సవ సాత్వికబలి కార్యక్రమాన్ని జరిపించడం ఆలయ సంప్రదాయం. 25 వేల గుమ్మడికాయలు, 1 లక్ష నిమ్మకాయలు, 2000 వేలకు పైగా కొబ్బరికాయలతో ఆలయ ప్రాంగణమంతా కళకళలాడింది. అమ్మవారి సింహమండపం, ప్రాకార మండపంతోపాటు ప్రధానాలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. రజకులచే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక అలంకారంలో ముగ్గులు వేశారు. ఈవో శ్రీనివాసరావు దంపతులతోపాటు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టిభొట్ల భరద్వాజశర్మ, బోడెపూడి వెంకటసుబ్బారావు, ఆల అనీల్‌కుమార్‌, ఏవీ రమణ, సుబ్బలక్ష్మి కుంభోత్సవంలో పాల్గొన్నారు. తెల్లవారుజామున ప్రాత:కాల పూజలలో భాగంగా అర్చక వేదపండితులు ఏకాంతంగా అమ్మవారికి నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ పుష్పార్చలు శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం హరిహరాయ గోపురం వద్ద కోటగోడపై ఉన్న మహిషాసురమర్థిని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాక సాత్వికబలిని సమర్పించి పసుపు కుంకుమలతో శాంతి ప్రక్రియను పూర్తి చేశారు.

కుంభరాశి...కుంభహారతి

సాయంత్రం ప్రదోషకాల పూజల అనంతరం మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం చేసి గర్భాలయ ద్వారాలను మూసివేశారు. అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న సింహ మండపం వద్ద 200 కేజీలతో అన్నపురాశిని కుంభంగా పోసి ప్రత్యేక పూజా క్రతువులు నిర్వహించారు. ఆ తరువాత స్త్రీ వేషధారణలో ఉన్న పురుషుడు (స్వామివారి ద్వారపాలకుడు) సంప్రదాయం ప్రకారం మంగళవాయిద్యాలు వేదమంత్రాలతో ఆలయ ప్రదక్షిణగా వచ్చి అమ్మవారికి కుంభహారతిని సమర్పించారు. ఆఖరి ఘట్టంగా అమ్మవారికి ప్రీతికరమైన పిండి వంటలను చేసి మహానివేదన చేశారు.

భ్రమరాంబికగా నిజరూప దర్శనం: కుంభోత్సవం తర్వాత అమ్మవారిని భక్తులు నిజరూప దర్శనం చేసుకున్నారు. ఎనిమిది చేతులలో వివిధ రకాల ఆయుధాలతో మూల విరాట్టును భక్తులు సేవించారు.

Updated Date - Apr 08 , 2026 | 12:09 AM