Share News

ఆర్డీఎ్‌సను పరిశీలించిన కేఆర్‌ఎంబీ చైర్మన్‌ బిస్వాస్‌

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:13 AM

తుంగభద్ర నదిపై నిర్మించిన రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ (ఆర్డీఎస్‌) ఆనకట్టను కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌ బిస్వాస్‌, సభ్యుడు కేకే జాంగిద్‌ కర్ణాటక, తెలంగాణ, ఏపీ ఇంజనీర్లతో కలసి మంగళవారం పరిశీలించారు.

ఆర్డీఎ్‌సను పరిశీలించిన కేఆర్‌ఎంబీ చైర్మన్‌ బిస్వాస్‌
ఆర్డీఎస్‌ ఆనకట్టను కర్ణాటక వైపు పరిశీలిస్తున్న కృష్ణా బోర్డు చైర్మన్‌ బిస్వాస్‌

మా నీటి హక్కును కర్ణాటక అడ్డుకుంటోంది

కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

క్షేత్రస్థాయిలో పరిశీలించిన కృష్ణా బోర్డు చైర్మన్‌ బిస్వాస్‌

కర్ణాటక, తెలంగాణ, ఏపీ ఇంజనీర్లతో సమీక్ష

ఏపీ వైపు కూడా ఆనకట్ట పరిశీలించిన కేఆర్‌ఎంబీ బృందం

కర్నూలు, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర నదిపై నిర్మించిన రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌ (ఆర్డీఎస్‌) ఆనకట్టను కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్‌ బిస్వాస్‌, సభ్యుడు కేకే జాంగిద్‌ కర్ణాటక, తెలంగాణ, ఏపీ ఇంజనీర్లతో కలసి మంగళవారం పరిశీలించారు. నీటి వాటాలు, వినియోగంపై మూడు రాష్ట్రాల ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా రాజోలి దగ్గర ఆర్డీఎస్‌ ఎడమ కాలువ స్లూయిస్‌, ఏపీలోని కర్నూలు జిల్లా కోసిగి మండలం సాతనూరు సమీపంలోని ఆనకట్ట రివన్‌ స్లూయి్‌సలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద నీటి ప్రవాహం లెక్కలు తనిఖీ చేశారు. ఆర్డీఎస్‌ ఎడమ కాలువ ద్వారా తెలంగాణ 17.10 టీఎంసీలు వాటా నిఖర జలాలు రావాలి. 87,500 ఎకరాలు ఆయకట్టు ఉంది. అయితే.. ‘ఎగువ రాష్ట్రం కర్ణాటక మా వాటా జలాలు రాకుం డా అడ్డుకుంటుంది.. మాకు సగం వాటా నీరు కూడా రావడం లేదు. తద్వారా ఆయకట్టు పొలాలు బీడుగా మారుతున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు..’ అని తెలంగాణ ప్రభుత్వం కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసింది. కర్ణాటక జల చౌర్యాన్ని కట్టడి చేసి మాకు రావాల్సిన నీటి వాటాను జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం సింధనూరు సమీపంలో ఇవ్వాలని కృష్ణా బోర్డుకు చేసిన ఫిర్యాదులు పేర్కొన్నారు. తెలంగాణ ఫిర్యాదు మేరకు కేఆర్‌ఎంబీ చైర్మన్‌ బిస్వాస్‌, సభ్యుడు కేకే జాంగిద్‌లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాయచూరు జిల్లా గిలకసూగూరు వద్ద ఆర్డీఎస్‌ కాలువను తనిఖీ చేశారు. ఆర్డీఎస్‌ ఆనకట్ట నుంచి ఆర్డీఎస్‌ ఎడమ కాలువకు ఏ లెవల్‌లో నీటి ప్రవాహం ఉంది..? ఎంత నీరు ప్రవహిస్తుంది..? వంటి వివరాలను తనిఖీ చేశారు.

నీటి వినియోగంపై ఇంజనీర్లతో చర్చించిన కృష్ణా బోర్డు

కర్ణాటక, తెలంగాణ, ఏపీ ఇంజనీర్లతో ఆర్డీఎస్‌ వాటా జలాలు, ఆధునికీకరణ పనులు, తదితర అంశాలపై చర్చించారు. ఆర్డీఎస్‌ ఎడమ కాలువ, ఆనకట్ట ఆధునికీకరణ పనులు కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాయి. తెలంగాణ వాటాగా దాదాపు రూ.100 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం రూ.58 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇంకా రూ.35 కోట్లు ఆ రాష్ట్రం ఇస్తే కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి చేసి తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను ఇస్తామని కర్ణాటక ఇంజనీర్లు కేఆర్‌ఎంబీ చైర్మన్‌ దృష్టికి తెచ్చారు. ఇప్పటికే ఇచ్చిన నిధులకు బిల్లులు, ఇన్వాయి్‌సలు ఇస్తే మిగిలిన బ్యాలెన్స్‌ నిధులు ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ఇంజనీర్లు కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు వివరించారు. నిధులు ఇవ్వలేదని తమ వాటా జలాలు రాకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.

గుండ్రేవులపై నిర్ణయం తీసుకోండి

రాయలసీమ రైతుల కరువు, వలసలు పూర్తిగా నివారించాలంటే తుంగభద్రపై గుండ్రేవుల జలాశయం నిర్మాణమే ఏకైక మార్గమని, ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకోవాలని ఆర్డీఎస్‌ కుడి కాలువ ప్రాజెక్ట్‌ డీఈఈ రామకృష్ణ కేఆర్‌ఎంబీ చైర్మన్‌ బిస్వా్‌సకు వివరించారు. ప్రస్తుతం తెలంగాణ ఫిర్యాదును మాత్రమే పరిశీలిస్తున్నామని, వేరే విషయాలు దృష్టి పెట్టడం లేదని బిస్వాస్‌ వివరించారు. ఏపీ నుంచి ఆర్డీఎస్‌ ప్రాజెక్టు డీఈఈ రామకృష్ణ, ఏఈఈలు జగదీష్‌ నాయక్‌, విజయకుమార్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఏపీపై కర్ణాటక ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌ వైపు ఆర్డీఎస్‌ ఆనకట్ట ఆధునికీకరణ, కాంక్రీట్‌ స్కిన్‌ వాల్‌ నిర్మాణం చేయకుండా కర్నూలు జిల్లా రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారు.. అటువైపు ఉన్న రివర్‌ స్లూయిస్‌ ద్వారా నిరంతరాయంగా నీటిని తీసుకెళ్తున్నారని కర్ణాటక ఇంజనీర్లు కేఆర్‌ఎంబీ చైర్మన్‌ బిస్వా్‌సకు ఫిర్యాదు చేశారు. మూడు రాష్ట్రాల ఇంజనీర్లతో కలసి ఆంధ్రప్రదేశ్‌ వైపున కర్నూలు జిల్లా కోసిగి మండలం సాతనూరు సమీపంలోని ఆర్డీఎస్‌ ఆనకట్ట, రివర్‌ స్లూయిస్‌లను పరిశీలించారు. సమగ్ర వివరాలను మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు పంపి తెలంగాణ ఫిర్యాదుపై తుది నిర్ణయం తీసుకుంటామని చైర్మన్‌ బిస్వాస్‌ తెలిపారు.

Updated Date - Jun 17 , 2026 | 12:13 AM