కృష్ణవేణీ.. జల తరంగిణీ
ABN , Publish Date - Aug 01 , 2026 | 11:34 PM
కృష్ణవేణీ.. జల తరంగిణీ
జూరాల గేట్లు దాటి శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు
డ్యాంలో చేరిన 63.5654 టీఎంసీలు
ఒక్క రోజులోనే 9.215 టీఎంసీలు చేరిక
తుంగభద్రకు ఆశాజనకంగా వరద ప్రవాహం
సాగునీరు విడుదల చేయాలని టీబీపీ ఎల్లెల్సీ రైతుల డిమాండ్
వెలవెలబోతున్న సుంకేసుల బ్యారేజీ
గాజులదిన్నె ప్రాజెక్టే ప్రాణాధారం
జూరాల గేట్లు దాటుకుంటూ.. శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. ఆలస్యంగానైనా వరద ప్రవాహం ప్రారంభం కావడంతో కరువు రైతుల్లో సాగు ఆశలు చిగురిస్తున్నాయి. ఎగువన ఆల్మట్టి, నారాయణపుర్, జూరాల ప్రాజెక్టులు గరిష్ఠ నీటి మట్టానికి చేరడంతో.. ఆ డ్యాంలకు వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ఆ నీరంతా ఇప్పుడు శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతోంది. గడిచిన 24 గంటల్లో డ్యాం నీటి మట్టం 6.7 అడుగుల పెరగడంతో పాటుగా 9.2159 టీఎంసీలు వరద చేరింది. జిల్లా పశ్చిమ ప్రాంతానికి సాగు, తాగునీటికి ప్రాణాధారమైన తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. ఇప్పటికే 38.68 టీఎంసీలు వరద చేరింది. కర్నూలు నగర ప్రజల దాహం తీర్చే సుంకేసుల జలాశయం నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. రాబోయే రోజుల్లో కర్నూలు సహా వివిధ ప్రాంతాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తుకుండా గాజులదిన్నె ప్రాజెక్టును నింపుకోవాల్సి ఉంది. నిర్లక్ష్యం చేస్తే కన్నీటి కష్టాలు తప్పవని సాగునీటి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు నుంచి శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో 1,71,747 క్యూసెక్కులు వరద కొనసాగుతోంది. డ్యాం వద్ద 1,23,696 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదు చేసుకుంది. ఈ నీటి సంవత్సరం జూన్ ఒకటో తారీఖున ప్రారంభమైంది. దాదాపు రెండు నెలలు చుక్క నీరు కూడా డ్యాంలోకి చేరలేదు. పదేళ్ల వరద రికార్డుల్లో ఇంతటి దారుణ పరిస్థితి ఎన్నడూ లేదు. తాగునీటికైనా వరద వస్తుందా? అంటూ ఆశగా ఎదురు చూసే పరిస్థితి. ఎగువ భాగంలో కర్ణాటక, మహారాష్ట్రల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణమ్మ ఉప్పొంగింది. ఆల్మటి, నారాయణపుర్, జూరాల ప్రాజెక్టును నింపుకుంటూ జూలై 29వ తేదీన బుధవారం జూరాల డ్యాం గేట్లు దాటుకుంటూ 29,600 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయం దిశగా అడుగులు వేశాయి. తొలి రోజు డ్యాం వద్ద 14,373 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో నమోదు చేసుకుంది. అలా అడుగులు వేసిన కృష్ణమ్మ వడివడిగా పరుగులు పెడుతూ శ్రీశైలానికి చేరుతోంది. మంగళవారం 820.60 అడుగుల లెవల్‌లో 41.279 టీఎంసీలు ఉంటే.. శనివారం నాటికి 63.565 టీఎంసీలకు చేరుకుంది. అంటే.. గడిచిన నాలుగు రోజుల్లో 21.7 అడుగులు నీటి మట్టం పెరగడమే కాకుండా 24.045 టీఎంసీలు వరద చేరింది. డ్యాం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు, సామర్థ్యం 212.80 టీఎంసీలు కాగా.. శనివారం రాత్రి 8 గంటల సమయంలో 842.30 అడుగుల లెవల్‌లో 65.3203 టీఎంసీలకు వరద చేరింది. ఎగువన జూరాల డ్యాం నుంచి 1.80 లక్షలు క్యూసెక్కులు విడుదల చేస్తే, శ్రీశైలం డ్యాం వద్ద 1,28,576 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. ఆదివారం ఉదయం నాటికి రెండు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు అయ్యే అవకాశం ఉందని డ్యాం ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.
హంద్రీనీవా ద్వారా ఎత్తిపోసుకుంటే..!
కర్నూలు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పశ్చిమ ప్రాంతం నీటి ఎద్దడి ఎదుర్కొంటోంది. నిర్లక్ష్యం చేస్తే తాగునీటి కోసం సమరం తప్పని పరిస్థితులు తలెత్తే అవకాశం లేకపోలేదు. హంద్రీనీవా ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ప్రధాన కాలువకు అనుబంధంగా నిర్మించిన కృష్ణగిరి రిజర్వాయర్ సామర్థ్యం 0.164 టీఎంసీలు అయితే 0.013 టీఎంసీలు, పత్తికొండ జలాశయం సామర్థ్యం 1.126 టీఎంసీలకు గాను 0.59 టీఎంసీలు నిల్వ ఉంది. 68 చెరువులకు హంద్రీనీవా కాలువ నుంచి కృష్ణా జలాలు ఎత్తిపోసేందుకు ఎత్తిపోతల పథకం నిర్మించారు. శ్రీశైలం డ్యాం 834 అడుగుల లెవల్ నుంచి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం 841.10 అడుగుల లెవల్‌లో 1.71 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు ఇస్తున్నారు. దీంతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రత్యేక అనుమతితో హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలు ఎత్తిపోసి కృష్ణగిరి, పత్తికొండ, గాజులదిన్నె జలాశయాలు సహా 68 చెరువులు నింపుకునే అవకాశం ఉంది. అదే జరిగితే ఎల్‌నినో ప్రభావం కారణంగా ఎలాంటి పరిస్థితులు తలెత్తినా కర్నూలు నగరం, కోడు మూరు, డోన్, పత్తికొండ, కృష్ణగిరి పట్టణాలు సహా వివిధ గ్రామాలకు తాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, జలవనరుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
వివిధ జలాశయాల్లో నీటి నిల్వలు (టీఎంసీలు), ఇన్‌ఫ్లో (క్యూసెక్కులు) వివరాలు
జలాశయం సామర్థ్యం ప్రస్తుత నీటి నిల్వ ఇన్‌ఫ్లో
శ్రీశైలం 215.80 63.565 1,71,747
తుంగభద్ర 195.788 38.688 24,968
గాజులదిన్నె 4.50 2.45 166
సుంకేసుల 1.235 0.688 --
కృష్ణగిరి 0.164 0.013 --
పత్తికొండ 1.126 0.590 --
సాగునీరు లేనట్లేనా..?
తుంగభద్ర డ్యాంకు ఆశాజనకంగా వరద చేరుతుండడంతో ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగ నూరు, కోడుమూరు నియోజ కవర్గాల్లో ఆయకట్టు రైతుల్లో సాగు ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం డ్యాంకు 24,968 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. డ్యాం గరిష్ట నీటి మట్టం 1633 అడుగులు, సామర్థ్యం 105,788 టీఎంసీలు కాగా.. 1610.56 అడుగుల లెవల్‌లో 38.688 టీఎంసీలు వరద చేరింది.రెండు రాష్ట్రాల్లో తాగునీటి అవసరాల కోసం 3,003 క్యూసెక్కులు కర్ణాటక, ఆంధ్ర కాలువలకు విడుదల చేస్తున్నారు. జిల్లాలో తాగునీటి కోసం టీబీపీ ఎల్లెల్సీ కోటాలో టీబీపీ బోర్డు సరిహద్దు 250.580 కిలోమీటర్ల వద్ద కేవలం 560 క్యూసెక్కులు ప్రవాహం కొనసాగుతుంది. వాస్తవంగా ఈ నెల 4న ఇచ్చిన ఇండెంట్ కోటా ముగుస్తుంది. పల్లెల్లో నీటి అవసరాల దృష్ట్యా జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేది వరకు రోజుకు 600 క్యూసెక్కులు ఇవ్వాలని ఇండెంట్ ఇచ్చారు. తుంగభద్ర డ్యాంలో 40 టీఎంసీలు వరద చేరి, ఆశాజనకంగా వరద ఉంటే ఆయా రాష్ట్రాలు ఇచ్చే ఇండెంట్ మేరకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్నా, ఎల్‌నినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో ఎలాంటి ముప్పు ఎదుర్కొవాల్సి వస్తుందో? అన్న భయంతో జిల్లా యంత్రాంగం సాగునీటి విడుదల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జిల్లాలో పశ్చిమ ప్రాంతంలోని ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాలు సహా 245 గ్రామాలు ఎల్లెల్సీపై ఆధార పడ్డాయి. ఏడాది పొడవున తాగునీరు ఇవ్వాలంటే 7-8 టీఎంసీలు అవసరమని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 1.50 టీఎంసీలు తాగునీటి కోసం తీసుకున్నాం. తుంగభద్ర డ్యాంలో వంద టీఎంసీలకు పైగా వరద చేయడమే కాకుండా ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోకు సమానంగా కాస్త అటుఇటూ ఇన్‌ఫ్లో ఉంటే తప్ప టీబీపీ ఎల్లెల్సీ కాలువకు సాగునీరు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
గాజులదిన్నె ప్రాజెక్టే ప్రాణాధారం:
కర్నూలు నగర జనభా ఆరు లక్షలు పైమాటే. తాగునీటి అవసరాల కోసం రోజులకు 150-160 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. నగరవాసుల దాహం తీర్చే సుంకేసులు బ్యారేజీ సామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.688 టీఎంసీలకు పడిపోయింది. తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తలేదు. నది పరివాహక ప్రాంతంతో వరద వచ్చేంత వర్షాలు పడడం లేదు. దీంతో రోజురోజుకూ సంకేసులు జలాశయం నీటి నిల్వలు ఖాళీ అవుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో కర్నూలు నగరం సహా డోన్, కృష్ణగిరి, పత్తికొండ, కోడుమూరు పట్టణాలు, వివిధ గ్రామాలకు తాగునీటి కోసం ప్రాణాధారం గాజులదిన్నె ప్రాజెక్టు ఒక్కటే. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 4.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.45 టీఎంసీలు నిల్వ ఉంది. అంటే.. ఇంకా రెండు టీఎంసీలు ఖాళీగా ఉంది. టీబీపీ ఎల్లెల్సీ, హంద్రీనీవా కాలువల ద్వారా గాజులదిన్నె జలాశయానికి నీటిని మళ్లించి పూర్తి స్థాయిలో నింపుకుంటే ఆ పట్టణాలు, గ్రామాలకు తాగునీటికి ఇబ్బందులు ఉండవు. ఆ దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా, సమస్య తీవ్రరూపం దాల్చిన తరువాత పరుగులు పెడితే ప్రయోజనం ఉండదు.