Share News

కోసిగి హౌసింగ్‌స్కామ్‌ బట్టబయలు

ABN , Publish Date - May 06 , 2026 | 11:51 PM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో జరిగిన గృహ నిర్మాణ పథకంలో భారీ అవినీతి బట్టబయలైంది. కోసిగి మండలంలో హౌసింగ్‌ మెటీరియల్‌ పక్కదారి పట్టిందంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన వరుస కథనాలకు జిల్లా యంత్రాంగం స్పందించింది.

కోసిగి హౌసింగ్‌స్కామ్‌ బట్టబయలు
గోడౌన్‌లో స్టీల్‌ను పరిశీలిస్తున్న పీఆర్‌ ఈఈ డీసీ వెంకటేష్‌, ఏఈ మాలిక్‌

సిమెంట్‌, స్టీల్‌ స్టాక్‌లో భారీ గోల్‌మాల్‌

రూ.50 లక్షల పైచిలుకు అవినీతి

రంగంలోకి దిగిన పీ.ఆర్‌. ఎస్‌ఈ ఈఈ వెంకటేష్‌, ఏఈ మాలిక్‌

విచారణకు గైర్హాజరైన మాజీ ఏఈ షేక్షావలిపై అధికారుల ఆగ్రహం

కోసిగి, మే 6 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో జరిగిన గృహ నిర్మాణ పథకంలో భారీ అవినీతి బట్టబయలైంది. కోసిగి మండలంలో హౌసింగ్‌ మెటీరియల్‌ పక్కదారి పట్టిందంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన వరుస కథనాలకు జిల్లా యంత్రాంగం స్పందించింది. కలెక్టర్‌ ఎ. సిరి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ విచారణాధికారిగా నియమితులయ్యారు. బుధవారం కోసిగిలోని స్టీల్‌, సిమెంట్‌ గోదాముల్లో ఉన్నతాధికారులు మెరుపు తనిఖీలు నిర్వహించారు. ఆదోని పీఆర్‌ ఈఈ డి.సి. వెంకటేష్‌, కోసిగి పి.ఆర్‌. ఏఈ మాలిక్‌ బృందం కోసిగి సర్కిల్‌ పోలీస్‌ కార్యాలయం సమీపంలోని స్టీల్‌ గోడౌన్‌, మార్కెట్‌ యార్డులోని సిమెంట్‌ గోడౌన్‌లను, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారుల రికార్డు ప్రకారం బయటపడిన వాస్తవాలు దిగ్ర్భాంతి కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఉండే స్టీలు 109 మెట్రిక్‌ టన్నులు కాగా ప్రస్తుతం గోడౌన్‌లో 30 మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉందని, 79 మెట్రిక్‌ టన్నుల స్టీలు మిస్సింగ్‌ అయ్యిందని, దీని విలువ సుమారు రూ.50 లక్షల మేర ఉంటుందని అన్నారు. అలాగే ఆన్‌లైన్‌లో 800 బస్తాలు సిమెంట్‌ ఉండగా గోడౌన్‌లో 290 సిమెంట్‌ బ్యాగులు మాత్రమే ఉన్నాయని, సుమారు 500 బ్యాగుల సిమెంట్‌ మిస్‌ అయ్యిందని, దీని విలువ రూ.1.20 లక్షలు ఉంటుందని అన్నారు. గతంలో హౌసింగ్‌ ఇన్‌చార్జి ఏఈగా పనిచేసిన శేఖర్‌ హయాంలోనే ఈ భారీ వ్యత్యాసాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో స్టాకు మాయమైనా ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా లేదా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఈ శేఖర్‌పై విచారణాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు శేఖర్‌ కంటే ముందు పనిచేసిన షేక్షావలిపై కూడా గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారులకు అందాల్సిన మెటీరియల్‌ను ఆయన పక్కదారి పట్టించారని స్థానికులు చెబుతున్నారు. అయితే బుధవారం జరిగిన విచారణకు షేక్షావలి హాజరుకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తూ పేదల ఇళ్ల నిర్మాణానికి రావాల్సిన మెటీరియల్‌ను అమ్ముకున్న వారిని వదిలే ప్రసక్తే లేదని ఈఈ వెంకటేష్‌ స్పష్టం చేశారు. తనిఖీల్లో తేలిన వివరాల ఆధారంగా పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్‌, ఎస్‌ఈకి అందజేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ ఏఈ స్వరూ్‌పకుమార్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ బి. ఈరన్న, కంప్యూటర్‌ ఆపరేటర్‌ లంకేశ్వర్‌ ఉన్నారు.

Updated Date - May 06 , 2026 | 11:51 PM