కొలను భారతీ...! ఏమిటీ దుస్థితి..
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:00 AM
నల్లమల అభయారణ్యంలో కొలువైన జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రమైన కొలనుభారతి క్షేత్ర అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. క్షేత్ర అభివృద్ధి కోసం నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా నేటికీ పనులు ప్రారంభం కాలేదు.
మధ్యలోనే నిలిచిపోయిన ఆలయ నిర్మాణ పనులు
నిధులు మంజూరైనా ప్రారంభం కాని పనులు
కొత్తపల్లి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): నల్లమల అభయారణ్యంలో కొలువైన జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రమైన కొలనుభారతి క్షేత్ర అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. క్షేత్ర అభివృద్ధి కోసం నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. ఆలయ గోపురం ముఖ మండపం పనులకు నిధులు లేక గత కొన్నేళ్లుగా పనులు నిలిచిపోయాయి. గత ఏడాది అమ్మవారి మూలధనం నుంచి రూ.20 లక్షల నిధులు, దాతల సహకారంతో మరో రూ.4 లక్షల నిధులను దేవదాయ శాఖ అధికారులు సేకరించారు. రూ.24లక్షల నిధులను సీజీఎఫ్ (కామన్ గుడ్ ఫండ్) కింద దేవదాయ శాఖకు జమ చేశారు. దీంతో స్పందించిన రాష్ట్ర దేవదాయ శాఖ రూ.1.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. టెక్నికల్ శాంక్షన్ అయినప్పటికీ కూడా ఇంతవరకు పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం మంజూరైన నిధులతోఆగిన ఆలయ గోపురంపై శిల్పి పనులు చేపట్టాల్సి ఉంది. అలాగే ధ్వజస్తంభం, అమ్మవారి గుడి ఎదుట ఫ్లోరింగ్, డ్రైనేజీ తదితర పెండింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. ప్రత్యేక అక్షరాభ్యాస కేంద్రం కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. రాష్ట్రంలో ఏకైక సరస్వతి అమ్మవారి క్షేత్రంపై శ్రీశైలం దేవదాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఆలయ అభివృద్ధికి టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
అభివృద్ధి మరిచారు
శ్రీశైలం దేవస్థానం అధికారులు కొలనుభారతిని దత్తత తీసుకున్నారు. అయితే అభివృద్ధి మాత్రం మరిచారు. కొలనుభారతికి సీజీఎఫ్ కింద రూ.1.20 కోట్ల నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా ఆలయంలోని పెండింగ్ పనులు పూర్తి చేయడం లేదు. తక్షణమే ఆలయ నిర్మాణ పనులు చేపట్టాలి.
సంజీవరాయుడు, భక్తుడు, కొత్తపల్లి