Share News

ప్రాణాలు తోడే పేడ రంగు

ABN , Publish Date - May 24 , 2026 | 12:23 AM

గతంలో ఉదయాన్నే మహిళలు ఇళ్లముందు పేడనీళ్లతో కళ్లాపి చల్లేవారు. కాలానుగుణంగా పట్టణాభివృద్ధి చెంది పశువులు తగ్గిపోయాయి. దీంతో పేడ లభ్యత తగ్గింది. ఇదే అదనుగా కొన్ని వ్యాపార సంస్థలు పేడరంగు పేరుతో రసాయన పదార్థాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి.

ప్రాణాలు తోడే పేడ రంగు

క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకుంటున్న మహిళలు

నిషేధించాలని ప్రజల డిమాండ్‌

బేతంచెర్ల, మే 23 (ఆంధ్రజ్యోతి):గతంలో ఉదయాన్నే మహిళలు ఇళ్లముందు పేడనీళ్లతో కళ్లాపి చల్లేవారు. కాలానుగుణంగా పట్టణాభివృద్ధి చెంది పశువులు తగ్గిపోయాయి. దీంతో పేడ లభ్యత తగ్గింది. ఇదే అదనుగా కొన్ని వ్యాపార సంస్థలు పేడరంగు పేరుతో రసాయన పదార్థాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి.

క్షణికావేశంతో ప్రాణాలు తీసుకుంటున్నారు

కళ్లాపి కోసం ఉపయోగించే పేడరంగు ప్రాణాలు తీస్తోంది. క్షణికావేశానికి గురైన మహిళలు, పురుషులు కూడా దీన్ని తాగి ప్రాణాలు కోల్పోతున్నారు. పేడ రంగు సులువుగా కేవలం రూ.6కే లభ్యమవుతుండటంతో ప్రాణం మీదకు వస్తోంది.

పెరుగుతున్న ఆత్మహత్యలు

నాలుగు రోజుల క్రితం బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామం ఎస్సీ కాలనీకి చెందినమహిళ పేడ రంగు తాగి మృతి చెందింది. పేడ రంగు తాగి మహిళలు ఆత్మహత్యకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, జీవిత భాగస్వామితో గొడవల కారణంగా ఎక్కువగా మహిళలు దీనితో ప్రాణాలు తీసుకుంటున్నారు.

చికిత్స లేదు

పేడరంగు విషం క్షణాల్లో ప్రభావం చూపుతుంది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా ప్రాణాపాయం సంభవిస్తుంది. దీనికి వైద్యరంగంలో చికిత్స కూడా లేదు. కిరాణ అంగళ్లలో చౌకగా దొరికే పేడ రంగుతో మహిళలు తమ నూరేళ్ల జీవితాన్ని తీసుకోవడం విచారకరం. పంచాయతీ, పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకుని పేడరంగు విక్రయాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

పేడ రంగు విక్రయాలను అడ్డుకుంటాం

మండలంలో పేడ రంగు విక్రయాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ విష ద్రావణం త్రాగి మహిళలు ఆత్మహత్యకు పాల్పడుతుండటం విచారణం. నగర పంచాయతీ అధికారులతో చర్చించి పేడ రంగు విక్రయాల నివారణకు కృషి చేస్తాం. - వెంకటేశ్వరరావు, సీఐ, బేతంచెర్ల

Updated Date - May 24 , 2026 | 12:23 AM