Share News

ప్రియుడి కోసం కొడుకునే చంపి..

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:09 AM

2024 నవంబర్‌ మాసంలో కౌతాళం మండలం బదినేహళ్‌లో దిగ్ర్భాంతికరమైన నేరం జరిగింది.

ప్రియుడి కోసం కొడుకునే చంపి..
వీరేంద్ర పూడ్చిన గుంతను తొలగిస్తున్న సిట్‌ బృందం

కనపడడం లేదని పోలీసులకు ఫిర్యాదు

సరిగా దర్యాప్తు చేయడం లేదని హైకోర్టులో కేసు వేసిన తల్లి

చివరకు నిజం తేలడంతో అనుమానాస్పద స్థితిలో మృతి

ఆదోని రూరల్‌/కౌతాళం, మే 31 (ఆంధ్రజ్యోతి) : 2024 నవంబర్‌ మాసంలో కౌతాళం మండలం బదినేహళ్‌లో దిగ్ర్భాంతికరమైన నేరం జరిగింది. తాజాగా దాని ఆనుపానులు బైటపడ్డాయి. వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని ఓ మహిళ తన ప్రియుడితో కలిసి 15 ఏళ్ల కొడుకును కసితీర పొడిచి చంపిన ఘటన ఇది. ఆదోని మండలం జి.హొసళ్ళి గ్రామానికి చెందిన గంగమ్మకు 25సంవత్సరాల క్రితం కౌతాళం మండలం పెద్ద లక్ష్మన్నతో వివాహమైంది. వీరికి వీర్రేంద(15), శివకుమార్‌(14), లక్ష్మి(11) సంతానం. ఐదేళ్ల కింద రోడ్డు ప్రమాదంలో పెద్ద లక్ష్మన్న మృతి చెందాడు. ఈ క్రమంలో గంగమ్మకు సమీప బంధువైన జి.హొసళ్ళి గ్రామానికి చెందిన మాజీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ వైసీపీ నాయకుడు దర్గప్పతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం గంగమ్మ పెద్ద కుమారుడు వీరేంద్రకు తెలిసింది. తమ యింటికి ఎందుకు వస్తున్నావని దర్గప్పను నిలదీశాడు. ఇది మనస్సులో పెట్టుకొన్న దర్గప్ప, గంగమ్మ ఎలాగైనా వీరేంద్రను తప్పించాని 2024 నవంబర్‌ మాసంలో మిగిలిన ఇద్దరు పిల్లల సాక్షిగా వీరేంద్రను కత్తితో కసితీరా పొడిచి చంపి శవానికి దుప్పటి చుట్టి ఒక కవర్‌లో పెట్టి ద్విచక్ర వాహనంపై గంగమ్మ, దర్గప్ప బైటికి తీసుకెళ్లారు. అనంతరం దర్గప్ప బాలుడి శవాన్ని బండి మీద జి.హొసళ్ళి శ్మశాన వాటికకు తీసుకెళ్ళి పూడ్చి పెట్టాడు.

కొడుకు కనపడడం లేదని తల్లి ఫిర్యాదు...

కాగా.. తన కొడుకు కనిపించడం లేదని గంగమ్మ 2011 నవంబర్‌ 11వ తేదిన కౌతాళం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ హత్యను ఇతరులపై నెట్టి ఎస్సీ, ఎస్టీ యాక్టు ద్వారా బెనిఫిట్‌ను పొందాలనే ఆశతో ఈ పని చేసింది. సీఐ ఆశోక్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కౌతాళం పోలీసులు తమ కొడుకు ఆచూకీ కనిపెట్టలేకపోయారని, ఎలాగైనా ఆచూకీ కనిపెట్టాలని గంగమ్మ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. 20 రోజుల్లో ఈ కేసు వివరాలను తమకు అందించాలని డీజీపీని హైకోర్టు కోరింది. దీంతో డీజీపీ కార్యాలయం ఏఎస్పీ స్థాయి అధికారులతో కూడిన సిట్‌ బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతో సిట్‌ అధికారులు ఏఎస్పీ సుప్రజ, డిఎస్పీలు రవి కుమార్‌, వెంకట్రామయ్య, ిసీఐలు రామలింగయ్య, నల్లప్ప, యుగంధర్‌తోపాటు ఫోరెన్సిక్‌ బృందం గత 15రోజులుగా ఈ కేసు విషయంపై విచారణ చేపట్టింది. సాంకేతిక పరిజ్ఞానంతో ఫిర్యాదుదారులైన గంగమ్మ, ఆమె ప్రియుడు దర్గప్పలే నిందితులని ప్రాథమికంగా తేల్చేశారు. ఈ క్రమంలో సిట్‌ అధికారులు తమదైన శైలిలో విచారణ చేసినప్పటికీ దర్గప్ప సిట్‌ బృందాన్ని తప్పుదోవ పట్టించాడు. పొలం పాతి పెట్టానని, ఎల్లెల్సీ కాల్వల్లో పడేశానని తెలిపాడు. చివరిగా ఆదివారం జి.హొసళ్ళి వ్మశాన వాటికలో పూడ్చానని చెప్పడంతో సిట్‌ బృందం పెద్ద ఎత్తున పోలీస్‌ బలగాలతో ఆదోని తహసీల్దార్‌ శేషఫణి, కౌతాళం తహసీల్దార్‌ రవిచంద్రతోపాటు వైద్య బృందం అక్కడ చేరుకొని వీరేంద్రను పూడ్చిన గుంతను తవ్వి వీరేంద్రకు సంబంధించి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.

చికిత్స పొందుతూ, గంగమ్మ మృతి

గత 15రోజులుగా పోలీసుల విచారణలో ఎదుర్కొన్న గంగమ్మ ఆదివారం మృతి చెందింది. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఉన్న ఆమె కర్నూలు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. అయితే తన కొడుకును తానే చంపానని బైటికి తెలియడంతో అవమానానికి గురైనట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల వేధింపుల వలనే గంగమ్మ మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Jun 01 , 2026 | 12:09 AM