Share News

ఖరీఫ్‌ ప్రణాళిక ఖరారు

ABN , Publish Date - May 30 , 2026 | 11:42 PM

జూన్‌ నుంచి ఖరీఫ్‌ ఆరంభం కానుంది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయడంలో జిల్లా వ్యవసాయ శాఖ నిమగ్నమైంది.

ఖరీఫ్‌ ప్రణాళిక ఖరారు

3,72,946 హెక్టార్లలో సాగు అంచనా

ఎల్‌నినో ప్రభావంతో ఆగస్టు వరకు వర్షాభావం

ప్రత్యామ్నాయ, స్వల్పకాలిక పంటలపై రైతులకు అవగాహన

వర్షాభావం వల్ల ఖరీఫ్‌లో 61,035 హెక్టార్ల సాగు తగ్గే అవకాశం

జూన్‌ నుంచి ఖరీఫ్‌ ఆరంభం కానుంది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయడంలో జిల్లా వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. ఇంకో పక్క ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఆగస్టు వరకు కొనసాగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిస్తున్నారు. దీనికి అనుగుణంగా రైతులు ఏ పంటలు సాగు చేయాలో అవగాహన కల్పించేందుకు అధికారులు ఇప్పటి నుంచే చర్యలు మొదలు పెట్టారు. మరో వైపు గత సంవత్సరం యూరియా, డీఏపీ తదితర ఎరువుల కొరతతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి యూరియాను రైతులందరికీ అవసరమైనంత సక్రమంగా సప్లయ్‌ చేసేందుకు కొత్త యాప్‌ను అమలులోకి తీసుకువచ్చారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి మే మొదటి వారం నుంచే తనిఖీలు చేపడుతు న్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల రైతులు నష్టపోకుండా స్వల్పకాలిక పంటలు, అదే విధంగా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించేలా వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున రైతులను ప్రకృతి సేద్యం వైపు దృష్టి మరల్చి సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు అధికోత్పత్తిని సాధించేలా గ్రామస్థాయి నుంచి అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టేందుకు వ్యవసాయ శాఖ యంత్రాంగం ఏర్పాట్లను చేస్తోంది.

-కర్నూలు అగ్రికల్చర్‌, మే 30 (ఆంధ్రజ్యోతి):

ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం 3,72,946 హెక్టార్లు అంచనా

జూన్‌ నుంచి మొదలయ్యే ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు ఏ ఏ పంటలు ప్రధానంగా సాగు చేసేందుకు దృష్టి పెడుతారో వ్యవసాయ శాఖ యంత్రాంగం అంచనా వేసింది. అత్యధికంగా పత్తి 2,51,909 హెక్టార్లు, వేరుశనగ 20,486 హెక్టార్లు, కందులు 60,191 హెక్టార్లు, ఆముదం 9,175 హెక్టార్లు, మొక్కజొన్న 8,666 హెక్టార్లు, వరి 14,236 హెక్టార్లు, ఇతర పంటలు 8,281 హెక్టార్లు మొత్తం అన్ని పంటలు కలిపి 3,72,946 హెక్టార్లులో రైతులు పంటలు సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ యంత్రాంగం నిర్ధారించింది. ఇందుకు తగ్గట్టుగా రైతులకు రాయితీ విత్తనాలు, ఎరువులు అందించడానికి సిద్ధమవుతోంది. అదే విధంగా ఆగస్టు వరకు కొనసాగే ప్రత్యామ్నాయ పంటలు వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోకుండా ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దాని మీద కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.

పంట సాగుకు అవసరమైన ఎరువులు 2.70 లక్షల మెట్రిక్‌ టన్నులు

ఈసారి పంటల సాగుకు అవసరమైన ఎరువులను దుర్వినియోగం చేయకుండా సాంకేతికతను జోడించి రైతులకు అవసరమైన మేరకే ఎరువులను అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. గత సంవత్సరం ఖరీఫ్‌లో 1,47,819 మెట్రిక్‌ టన్నుల ఎరువులను రైతులు వినియోగించారు. ఈసారి దాదాపు 60వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులను అదనంగా రైతులకు సప్లయ్‌ చేసేందుకు కలెక్టర్‌ డా.ఏ. సిరి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రైతులు ప్రధానంగా వినియోగించే యూరియాను ఈసారి 58,872 మెట్రిక్‌ టన్నులను సిద్ధం చేస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 10వేల మెట్రిక్‌ టన్నులు అదనంగా ఈసారి జిల్లాకు కేటాయించారు. అదే విధంగా డీఏపీ 15,408 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 2,516 టన్నులు, ఎస్‌ఎస్‌టీ 2,220 టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 1,28,013 మెట్రిక్‌ టన్నులు మొత్తం కలిపి 2.70 మెట్రిక్‌ టన్నులు ఎరువులను ఖరీఫ్‌ సాగు పూర్తయ్యే సెప్టెంబరు వరకు రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు.

యూరియాకు ప్రత్యామ్నాయంగా చర్యలు

యూరియా ఒక బస్తా ధర కేవలం రూ.266 మాత్రమే. మిగిలిన ఎరువుల బస్తా ధర రూ.1,000 నుంచి రూ.2వేల దాకా ఉంది. దీంతో రైతులు తక్కువ ధరకు లభించే యూరియాపైనే దృష్టి పెట్టి అధికంగా కొనుగోలు చేస్తారు. రైతుల అవసరాలను డీలర్లు అనుకూలంగా మార్చుకుని జేబులు నింపుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వ్యాపారులు, భూస్వాములు వివిధ మార్గాల్లో యూరియాను పెద్ద మొత్తంలో దక్కించుకు నేందుకు సిద్ధం అవుతుంటే.. సామాన్య రైతులు మాత్రం ఒక యూరియా బస్తా కోసం అంగళ్ల వద్ద రేయింబవళ్లు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది గత సంవత్సరం డీలర్లకు అధికారులు అనుకూలంగా మారడంతో పెద్ద ఎత్తున యూరియా వివిధ మార్గాలో పక్క రాష్ట్రాలకు కూడా తరలిపోయింది. వ్యవసాయానికి కాకుండా యూరియాను పరిశ్రమలు, తదితర వాటికి యూరియాను ఉపయోగించడంతో కొరత తీవ్రంగా మారింది. వ్యవసాయ శాఖ అఽధికారులు యూరియాను పెద్ద ఎత్తున దారి మళ్లించే కార్యక్రమంలో పాల్పంచుకున్నారఇ, డీలర్లకు అనుకూలంగా మారారని రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళనలు తీవ్రం చేశారు. ఈసారి ఖరీఫ్‌లో ఈ పరిస్థితులు తలెత్తకుండా రైతులకు ఎంత అవసరమో అంతే యూరియాను సప్లయ్‌ చేసేందుకు కొత్త యాప్‌ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీని వల్ల అవసరమైన మేరకే ఎరువులు రైతులకు అందుబాటులోకి రానున్నాయి. పక్కదారి పట్టే అవకాశం లేకుండా నివారించేందుకు కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ మే మొదటి వారం నుంచే పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు.

ఎల్‌నినోకు ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం

ఖరీఫ్‌లో జూలై 15 వరకు వర్షాలు లేకపోతే సుమారు 1,03,786 హెక్టార్లలో పంటలు సాగు కాకపోవచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జూలై నెలాఖరు వరకు వర్షాలు పడకపోతే 65,056 హెక్టార్లలో సాగు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో పొలాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటగా కంది పంటను సాగు చేసేందుకు రైతులను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 15 వరకు వర్షాలు పడకపోతే 61,035 హెక్టార్లకు పంటలు పండే అవకాశం ఉండదని, ఈ పరిస్థితుల్లో స్వల్పకాలిక పంటలైన కందులు, పెసర్లు, ఉలువలు కొర్ర వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఎల్‌నినో ప్రభావం నుంచి రైతులను బయట పడేసేందుకు పెద్ద ఎత్తున స్వల్పకాలిక పంటలు సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో పంటలు సాగు చేసేలా విస్తృతంగా ప్రచారం చేపట్టేందుకు వ్యవసాయ శాఖ నిర్ణయించింది.

ఎల్‌నినో ప్రభావం నుంచి రైతులను గట్టెక్కిస్తాం

ఈసారి ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల నుంచి రైతులను గట్టెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. స్వల్పకాలిక పంటలతో పాటు వరి, పత్తి తదితర దీర్ఘకాలిక పంటలకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తాం. . యూరియా, డీఏపీ తదితర ఎరువుల కొరత లేకుండా ఏర్పాట్లు చేశాం.

- వరలక్ష్మి, జేడీ

Updated Date - May 30 , 2026 | 11:43 PM