Share News

కాత్యాయనీ.. శక్తి రూపిణి

ABN , Publish Date - Oct 16 , 2026 | 11:48 PM

శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రోత్సవాల్లో ఆరో రోజు శుక్రవారం భ్రమరాంబ దేవి కాత్యాయనిగా దర్శనమిచ్చారు.

కాత్యాయనీ.. శక్తి రూపిణి

హంస వాహనంపై ఆది దంపతులు

శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ

శ్రీశైలం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రోత్సవాల్లో ఆరో రోజు శుక్రవారం భ్రమరాంబ దేవి కాత్యాయనిగా దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లు హంస వాహన సేవలో పూజలందుకున్నారు. పుష్పపల్లకిలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. పుష్పపల్లకిని ఎర్ర, పసుపు బంతులు, తెల్ల పచ్చ చామంతులు, డచ్‌ రోజ్‌, అశోక పత్రాలు, కనకాంబరాలు, కాగడాలు, గ్లాడియేలస్‌, అస్పెర్‌, గ్రాస్‌, జాబ్రా, కార్నేషన్‌, ఆర్కిడ్స్‌, నందివర్థనం, గరుడవర్థ్దనం, వంటి పలురకాల పూలతో అలంకరించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవారికి ప్రాత:కాల పూజలు విశేష కుంకమార్చనలు, చండీ, రుద్రహోమాలు నిర్వహించారు.

చతుర్భుజాల్లో

భ్రమరాంబదేవి కాత్యాయనీ స్వరూపంలో చతుర్భుజాల్లో అభయహస్తం, వరముద్ర, పద్మం, ఖడ్గం ధరించి భక్తులకు దర్శనం ఇచ్చారు. కాత్యాయన మహర్షి పుత్రికగా జన్మించినందుకు అమ్మవారిని కాత్యాయనీగా పిలుస్తారు. అమ్మవారిని పూజించడంవలన జన్మజన్మల పాపాలు హరింపబడతాయని భక్తుల విశ్వాసం.

కాళరాత్రి.. గజవాహన సేవ

ఉత్సవాల్లో ఏడవ రోజు శనివారం భ్రమరాంబ అమ్మవారు కాళరాత్రి స్వరూపంలో, మల్లికార్జునుడు గజవాహనసేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Updated Date - Oct 16 , 2026 | 11:48 PM