Share News

కార్తీక దీపం.. ఓంకార రూపం

ABN , Publish Date - Nov 23 , 2026 | 11:40 PM

శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో సోమవారం తెల్లవారుజామున భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు, మహా మంగళ హారతుల అనంతరం నిత్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉభయ దేవాలయాల్లో భక్తులకు అలంకార దర్శనాలు మాత్రమే అందుబాటులో ఉంచారు. కృష్ణా నది పుణ్య స్నానాలు చేసుకుని పసుపు కుంకుమ సారెలు సమర్పించుకున్నారు.

కార్తీక దీపం..  ఓంకార రూపం
విద్యుద్దీప కాంతులతో ఆలయ పుష్కరిణి

శ్రీశైలంలో వైభవంగా కార్తీక మాసోత్సవాలు

స్వామి, అమ్మవారిని దర్శించుకున్న 50 వేల మందికి పైగా భక్తులు

పుష్కరిణి వద్ద ప్రత్యేక పూజలు.. శాస్త్రోక్తంగా దశవిధ హారతులు

నేడు ఆదిదంపతులకు జ్వాలా తోరణం

శ్రీశైలం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో సోమవారం తెల్లవారుజామున భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు, మహా మంగళ హారతుల అనంతరం నిత్య కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఉభయ దేవాలయాల్లో భక్తులకు అలంకార దర్శనాలు మాత్రమే అందుబాటులో ఉంచారు. కృష్ణా నది పుణ్య స్నానాలు చేసుకుని పసుపు కుంకుమ సారెలు సమర్పించుకున్నారు. శీఘ్ర, అతిశీఘ్ర ఉచిత దర్శన కంపార్టుమెంట్లు క్యూలైన్ల ద్వారా సుమారు 50 వేల మంది భక్తులకు పైగా స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ఉత్తర మాడవీధి, అమ్మవారి ఆలయ పడమర మాడవీధితో పాటు గంగాధర మండపం నుంచి నంది ఆలయం వరకు కార్తీక దీపాలు వెలిగించుకునే భక్తులతో కిటకిటలాడాయి. ప్రదోషకాల సమయంలో ప్రధాన గోపురం వద్ద ఈవో శ్రీనివాసరావు దంపతులు ఆకాశదీపానికి ప్రత్యేక పూజలు చేసి ధ్వజస్తంభంపై ఆవిష్కరించారు. అనంతరం ఆలయ పుష్కరిణి వద్ద ప్రత్యేక అలంకరణ వేదికపై స్వామి, అమ్మవార్లను ఆశీనులుజేసి షోడశోపచార పూజా క్రతువులు చేసిన అర్చకులు లక్ష దీపోత్సవం, పుష్కరిణికి దశవిధ హారతులైన ఓంకార, నాగ, త్రిశూల, నంది, సింహ, సూర్య, చంద్ర, కుంభ, నక్షత్ర, కర్పూర హారతులు సమర్పించారు. కార్తీక వైభవం, దీపం వెలిగించే ప్రాశస్త్యం, ఆకాశ దీప ఆవిష్కరణలపై ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్‌ ఐఎల్‌ఎన్‌ చంద్రశేఖర్‌ భక్తులకు వివరించిన ప్రవచనం ఆద్యంతం భక్తులను పులకింపచేసింది. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు దేవకి వెంకటేశ్వర్లు, ఏవీ రమణ, ఆకుల శ్రీనివాసులు, శివమ్మ, పీఆర్వో శ్రీనివాసరావు, ఎడిటర్‌ అనిల్‌కుమార్‌, ఏఈవోలు వెంకటేశ్వరరావు, ఉమేశ్‌ పఠ్వారి, హర్యానాయక్‌, సాములు, ప్రధాన అర్చకులు విజయ్‌కుమార్‌స్వామి, వీరన్నస్వామి, శ్రీధర్‌స్వామి, ఉప ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ, హరిస్వామి, కిట్టుస్వామి తదితరులు పాల్గొన్నారు.

నేడు ఆదిదంపతులకు జ్వాలాతోరణం

కార్తీకమాసంలో పౌర్ణమి ప్రదోషకాలంలో స్వామిఅమ్మవార్లకు అత్యంత వైభవంగా జ్వాలా తోరణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ పోతుగుంట రమేశ్‌నాయుడు తెలిపారు. ఆలయ ప్రధాన గోపురం గంగాధర మండపం వద్ద జరిగే జ్వాలాతోరణం కార్యక్రమానికి వచ్చే వీఐపీలతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

Updated Date - Nov 23 , 2026 | 11:40 PM