కాళరాత్రీ.. భక్తజన శుభంకరీ
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:22 PM
: శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ శరనవరాత్ర్సోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడో రోజు శనివారం అమ్మవారు కాళరాత్రి స్వరూపంలో, స్వామి, అమ్మవారు గజవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు.
గజవాహనంపై గరళకంఠుడు
ఏడో రోజుకు చేరుకున్న దసరా మహోత్సవాలు
నేడు మహాగౌరిగా ఆదిపరాశక్తి
శ్రీశైలం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ శరనవరాత్ర్సోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడో రోజు శనివారం అమ్మవారు కాళరాత్రి స్వరూపంలో, స్వామి, అమ్మవారు గజవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ఉదయం ఉత్సవాలను పురస్కరించుకొని స్వామి, అమ్మవార్ల ఉభయ దేవాలయాల్లో విశేష పూజలు, శ్రీ చక్రచార్చన, నవవారణనార్చనలు, కుంకుమార్చనలు, కుమారీపూజలు, చండీహోమం, ఏకాదశ రుధ్రాభిషేకం, రుద్రహోమం నిర్వహించారు. రాత్రి కాళరాత్రి పూజ, సువాసినీ పూజలు జరిపించారు.
కాళరాత్రి అలంకారంలో భ్రమరాంబ
అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరో శక్తిపీఠమైన భ్రమరాంబ అమ్మవారు దేవి శరనవరాత్రోత్సవాల్లో ఏడోరోజు కాళరాత్రి స్వరూపంలో దర్శనమిచ్చారు. నవదుర్గల్లో ఏడో రూపమైన ఈ దేవి నల్లటి దేహఛాయతో జుట్టు విరబోసుకొని పెడబొబ్బల నవ్వులతో రౌద్రరూపములో చతుర్బుజాలు కలిగి కుడివైపు అభయహస్తం, వరముద్ర ఎడమవైపు లోహఘంటం, ఖడ్గం ధరించి దర్శనం ఇచ్చింది. .
గజవాహనం సేవలో గరళకంఠుడు
దసరా మహోత్సవాల్లో స్వామి, అమ్మవార్లకు గజవాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో ఈవో శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేశ్ నాయుడు, సభ్యులు కాశీనాథ్, ఏవీ రమణ, చిట్టిబొట్ల భరద్వాజశర్మ, ఆల అనిల్కుమార్, మురళీధర్, శ్రీదేవి, ఆకుల శ్రీనివాసులు, పీఆర్వో శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ ఎడిటర్ అనిల్కుమార్, ఏఈవో స్వాములు, సీఎస్వో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు మహాగౌరి అలంకారం.. నందివాహన సేవ
నేడు దసరా మహోత్సవాల్లో ఎనిమిదోరోజైన ఆదివారం భ్రమరాంబ దేవి మహాగౌరీగా దర్శనమిస్తారు. స్వామి, అమ్మవారు నందివాహన సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఈవో తెలిపారు.