పొడిగింపులతోనే సరి..
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:21 AM
పొడిగింపులతోనే సరి..
భూముల మ్యుటేషన్ నిలుపుదల
కొనసాగుతున్న నిషేధం
బాధిత రైతులకు తప్పని తిప్పలు
ఈభూములపై సీఎం స్పష్టమైన ప్రకటన చేసేనా?
భూముల ఫ్రీ హోల్డ్, ప్రభుత్వ భూముల (డీ పట్టా) మ్యుటేషన్ నిలుపుదల భూ హక్కుదారులను కుదిపేస్తోంది. 2024 ఆగస్టులో మొదలైన ఈ నిషేధాన్ని నేటికీ కొనసాగిస్తుండటం బాధిత రైతులకు శాపంగా మారింది. వైసీపీ హయంలో ఫ్రీ హోల్డ్ భూముల్లో అక్ర మాలు జరిగాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిషేధం విధించింది. ఈ క్రమంలో విచారణ పేరుతో పలుమార్లు పొడిగించడంతో హక్కుదారు(రైతులు)లకు ఇబ్బందులు తప్పడం లేదు.
నంద్యాల, మార్చి 8(ఆంధ్రజ్యోతి): ఫ్రీహోల్డ్ భూములపై 2024 ఆగస్టులో నిషేధం విధించారు. అప్పటి నుంచి ఇప్పటికి ఏడు సార్లు సదరు ఆదేశాలను పొడిగిస్తూ వచ్చారు. గత ప్రభు త్వంలో ఫ్రీ హోల్డ్ పరిధిలోని భూముల్లో అక్రమాలు జరిగాయని పెద్దఎత్తున ఆరోపణలొచ్చాయి. సదరు భూముల్లో జరిగిన అక్రమాలు, వాస్తవ విషయాలు, చట్టబద్ధతను పరిశీలిం చడానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటుచేశారు. నేటికీ విచారణ కొలిక్కి రాకపో వడంతో సదరు నిషేధాన్ని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తమ వద్ద అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ భూముల క్రయ విక్రయాలు జరపలేక అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని బాధిత వర్గాల వాదన.
జీవో నెంబరు 596 ..
2023లో అప్పటి ప్రభుత్వం భూముల ఫ్రీ హోల్డ్‌కు సంబంధించి జీవో నెంబర్ 596ను విడు దల చేసింది. వివిధ వర్గాలకు చెందిన భూమి అసైన్ చేసి 20 ఏళ్లు పూర్తయితే సదరు భూములను ఫ్రీ హోల్డ్ చేయాలని ఆ జీవో ఉద్దేశం. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల ఎకరాల భూములను ఫ్రీ హోల్డ్ చేసింది. ఉమ్మడి జిల్లా పరంగా చూస్తే దాదాపు లక్ష ఎకరాల భూములను ఫ్రీ హోల్డ్ చేసింది. ఆ భూముల్లో అవక తవకలు జరిగాయని కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో విచారణ పేరుతో సదరు భూములపై ఫ్రీ హోల్డ్‌పై కాలయాపన చేస్తోందని బాధిత వర్గాలు వాపోతున్నాయి.
రైతుల జీవనోపాధిపై ప్రభావం
గత వైసీపీ పాలనలో జరిగిన రీ సర్వేతో భారీగా తప్పిదాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా ప్రభుత్వ భూముల మ్యుటేషన్ సేవలను నిలిపివేసింది. దీంతో రైతుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడినట్లైంది. రైతులు తమ భూములను అమ్ముకోవాలన్నా.. అభివృద్ధి చేసుకోవాలన్నా.. రుణాలు తీసుకోవాలన్నా.. ప్రభుత్వ విధానాలు అడ్డంకిగా మారాయి.
జిల్లాలో పరిస్థితి ఇలా...
జిల్లాలో ఫ్రీ హోల్డ్ చేసిన భూమి : 64,066.9812 ఎకరాలు
ఇప్పటి వరకు విచారణ చేసిన భూమి : 48.054.315 ఎకరాలు
ఇంకా విచారణ చేయాల్సిన భూమి : 16,012.6712 ఎకరాలు
జాయింట్ ఎల్పీ నెంబర్లతోనూ..
ఫ్రీహోల్డ్ నిషేధం పేరుతో హక్కుదారులు పలు రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తు తం జరుగుతున్న రీసర్వేలోనూ కొన్నిచోట్ల భూము లకు జాయింట్ ఎల్పీ నెంబర్లు ఇస్తున్నారు. రైతులకు ఆ భూములను క్రయ విక్రయాలు చేసుకోలేని పరిస్థితి. అవసరాల నిమిత్తం భూమి విక్రయించు కోవాలంటే జాయింట్ ఎల్పీ నెంబర్ నుంచి వేరు చేసుకొని విక్రయించుకోవాల్సి ఉంది. ఇందు కోసం రైతులు మళ్లీ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన దుస్థితి.
ఆగిపోయిన ఆదాయం
రీ సర్వే తప్పిదాలు, మ్యుటేషన్ సేవలు ఆగిపోవ డంతో రైతులకు అనేక రూపాల్లో ఇబ్బందులు తలెత్తాయి. క్రయ విక్రయాలు కూడా ఆగిపోయా యి. ప్రభుత్వానికి ప్రత్యేక్షంగా.. పరోక్షంగా ఆదాయం ఆగిపోయినట్లైంది. రియల్ ఎస్టేట్ రంగంపై కూడా ప్రభావం పడింది.
జిల్లాలో 48,054 ఎకరాల..
జిల్లావ్యాప్తంగా 64,066 ఎకరాలు ఫ్రీ హోల్డ్‌లో ఉండగా.. ఇప్పటి వరకు జరిగిన విచారణ నివేదిక ఆధారంగా 48,054 ఎకరాలకు చెందిన రైతులకు చెందిన భూములు సక్రమంగా ఉన్నట్లు తేలింది. మిగిలిన 16,012 ఎకరాలకు చెందిన రైతుల భూములను ఇంకా విచారణ చేయాల్సి ఉంది.
సీఎం ప్రకటన చేసేనా...?
ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో సీఎం చంద్రబాబు సోమవారం డోన్ పర్యటనలో భాగంగా స్పష్టమైన ప్రకటన చేసేనా..? అన్న సందేహాలు జిల్లా జిల్లా రైతులతో పాటు బాధిత రైతుల్లో నెలకొంది. ఒకవేళ చేస్తే జిల్లాలో 20 వేలకు పైగా రైతులకు వరంగా మారనుంది.