Share News

నేటి నుంచి జేఈఈ ఫేజ్‌-2 పరీక్షలు

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:17 AM

: 2026-27 బీటెక్‌ కోర్సుల్లో చేరేందుకు జేఈఈ-మెయిన్స్‌ పేపర్‌-1 పరీక్షలు ఈ నెల 2, 4, 5, 6, 7 తేదీల్లో జరగనున్నాయి. అలాగే బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ కోర్సుల్లో చేరేందుకు పేపర్‌-2 పరీక్ష 7వ తేదీన నిర్వహిస్తారు.

నేటి నుంచి జేఈఈ ఫేజ్‌-2 పరీక్షలు

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): 2026-27 బీటెక్‌ కోర్సుల్లో చేరేందుకు జేఈఈ-మెయిన్స్‌ పేపర్‌-1 పరీక్షలు ఈ నెల 2, 4, 5, 6, 7 తేదీల్లో జరగనున్నాయి. అలాగే బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ కోర్సుల్లో చేరేందుకు పేపర్‌-2 పరీక్ష 7వ తేదీన నిర్వహిస్తారు. జేఈఈ-మెయిన్స్‌ ఫేజ్‌-2 పరీక్షలు ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆయా రోజుల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లలో జరుగుతాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతాయి. తొలి విడత పరీక్షలు జనవరిలో జరిగాయి విద్యార్థులు రెండు విడతలకు హాజరవుతారు. రెండింటలో ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకుని ఎన్‌టీఏ అఖిల భారత ర్యాంకులను వెల్లడిస్తుంది. కర్నూలు నగరంలో కేవీ సుబ్బారెడ్డి కళాశాల ప్రాంగణంలోని టీటీఎస్‌ ఆధ్వర్యంలో జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు కొనసాగుతాయి. ఈ నెల 20వ తేదీలోపు ర్యాంకులను వెల్లడిస్తామని ఇప్పటికే ఎన్‌టీఏ ప్రకటించింది. జేఈఈ-మెయిన్స్‌లో అర్హత సాదించిన విద్యార్థులు మే 10వ తేదీన జరిగే జేఈఈ-అడ్వాన్సడ్‌ పరీక్షలు రాసేందుకు అర్హులు. ఈ నెల 2, 4 తేదీల్లో పరీక్షలకు ఇప్పటికే అడ్మిట్‌ కార్డులను విడుదల చేశారు. 5. 6, 7, 8 తేదీల్లో జరగనున్న పరీక్షలకు అడ్మిట్‌ కార్డులను త్వరలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

విద్యార్థులకు సూచనలు

పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా అడ్మిట్‌ కార్డును విద్యార్థులు వెంట తీసుకెళ్లాలి.

ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడు చేసిన సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఫారం నింపాలి.

పరీక్ష తేదీ, షిప్టు, పరీక్ష కేంద్రం, రిపోర్టింగ్‌ సమయం, పరీక్ష సెంటర్‌ వద్ద గేటు మూసివేసే సమయాన్ని సరి చూసుకోవాలి.

విద్యార్థులు తమ ధ్రుకరణను నిర్ధారించేలా ఫొటోతో కూడిన ఏదైనా ఒరిజినల్‌ గుర్తింపు కార్డు డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌పోర్టు, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, అభ్యర్థి ఫొటోతో కూడిన బ్యాంక్‌ పాస్‌బుక్‌ తీసుకెళ్లాలి.

పరీక్ష కేంద్రానికి రెండు పాస్‌ ఫోటోలతో పాటు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసినప్పుడు అప్‌లోడు చేసిన ఫొటోను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి.

విద్యార్థులు బాల్‌పాయింట్‌ పెన్నును తీసుకెళ్లాలి.

దివ్యాంగులైన విద్యార్థులు తమ వెంట మెడికల్‌ ఆఫీసర్‌ ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

పరీక్ష కేంద్రానికి 2 గంటల ముందే విద్యార్థులు చేరుకోవాలి.

పరీక్ష హాలులో ఏదైనా సాంకేతిక సాయం, ఎమర్జెన్సీ, పరీక్ష సంబంధించి ఇబ్బందులు ఎదురైతే కేంద్రం సూపరింటెండెంట్‌, ఇన్విజిలేటర్‌ను సంప్రదించాలి.

మీరు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు ప్రకారం కంప్యూటర్‌లో ప్రశ్నాపత్రం వచ్చిందా? లేదా? అనేది నిర్ధారించుకోవాలి. వేరే పేపర్‌ వస్తే వెంటనే ఇన్విజిలేటర్‌ దృష్టికి తీసుకెళ్లాలి.

మధుమేహం ఉన్న విద్యార్థులైతే షుగర్‌ ట్యాబ్లెట్స్‌, పండ్లు, వాటర్‌ బాటిల్స్‌ వెంట తీసుకెళ్లవచ్చు.

ఇయర్‌ ఫోన్లు, మైక్రో ఫోన్లు, క్యాలికులేటర్‌, కెమెరా, టేప్‌రికార్డర్‌, వాచ్‌లు ఎలక్ర్టానిక్‌ వస్తువులు అనుమతించరు.

కంప్యూటర్‌ అధారిత పరీక్షకు సంబందించి ఏమైనా సందేహాలను నివృత్తిచేసుకునేందుకు జేఈఈ-మెయిన్స్‌ వెబ్‌సైట్‌లో హెల్ప్‌లైన్‌ 011-40759000ను సంప్రదించాలి.

Updated Date - Apr 02 , 2026 | 12:17 AM