‘జయహో బీసీ’ టీడీపీ విధానం
ABN , Publish Date - Aug 19 , 2026 | 11:33 PM
‘జయహో బీసీ..’ అనేది నినాదం కాదని తెలుగుదేశం పార్టీ విధానం అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.
బీసీల కోసం 34 శాతం రిజర్వేషన్లు
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ
కర్నూలు అర్బన్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ‘జయహో బీసీ..’ అనేది నినాదం కాదని తెలుగుదేశం పార్టీ విధానం అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. చట్టసభల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై బుధవారం టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. జిల్లా కార్యాలయం ఎదుట ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కార్యాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేఈ. జగదీష్ గౌడ్, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, డీసీఎంఎస్ చైర్మన్ వై.నాగేశ్వరరావు యాదవ్‌లతో కలసి ఆమె విలేకరులతో మాట్లాడారు. టీడీపీలో కష్టపడే వారికే పదవులు వస్తాయన్నారు. అందుకు నిదర్శనం వడ్డెర సామాజిక వర్గానికి చెందిన దలవాయి రమాదేవి, ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యలు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపిక కావడమే అన్నారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించకపోయి ఉంటే బీసీలు ఈ స్థాయిలో ఉండేవారు కాదన్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలపై కక్ష కట్టి రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించారన్నారు. కానీ చంద్రబాబు నేడు 34 శాతం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేలా నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేయడంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీలకు కృతజ్ఞతలు తెలిపారు. తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ తానెప్పుడూ పార్టీ మారలేదని, తెలుగుదేశం పార్టీలోనే మొదటి నుంచి ఉన్నానని అన్నారు. తాను, తన కుటుంబం ఎప్పుడూ పార్టీ మారలేదన్నారు. తన ఇంట్లో ఇప్పటికీ చంద్రబాబు, ఎన్టీఆర్ ఫొటోలు ఉంటాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బీసీల పార్టీగా తెలుగుదేశంలోనే ప్రస్థానం మొదలైందని, అదే పార్టీలోనే కడవరకూ ఉంటానని ఆయన అన్నారు. కొందరు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పద్మాలతారెడ్డి, కార్పొరేషన్ల డైరెక్టర్లు కొంకతి లక్ష్మి నారాయణ, ధరూర్ జేమ్స్, న్యాయవాది దాశెట్టి శ్రీనివాసులు, పోతురాజు రవికుమార్, ఎల్వీ ప్రసాద్, చంద్రకాంత్, హనుమంతరావు, కృష్ణుడు, సత్రం రామకృష్ణుడు, తదితరులు పాల్గొన్నారు.