పల్లెకు జల్ జీవన్
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:56 PM
తీవ్ర తాగునీటి ఎద్దడితో తల్లడిల్లుతున్న గ్రామసీమలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది.
తీరనున్న తాగునీటి తిప్పలు
రూ.189.52 కోట్లతో నీటి వసతులు
474 గ్రామాలకు ప్రయోజనం.. ఇంటింటికి కుళాయి
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ.. డీపీఆర్ తయారీలో ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు
తీవ్ర తాగునీటి ఎద్దడితో తల్లడిల్లుతున్న గ్రామసీమలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. గత వైసీపీ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులు సకాలంలో సద్వినియోగం చేసుకోలేదు. దీంతో పథకం గడువు ముగియడంతో కేంద్రం రద్దు చేసింది. రద్దైన జల్ జీవన్ మిషన్ (జేజేఎం) కేంద్ర ప్రభుత్వం 2028 వరకు పొడిగించడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులను పునరుద్ధరించింది. తాజా ఉత్తర్వులతో జిల్లాలో రూ.189.52 కోట్లతో చేపట్టబోయే 269 పనులను తిరిగి అమల్లోకి తీసుకొచ్చింది. గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ రోజుకు 55 లీటర్లు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంగా మౌలిక వసతులు కల్పించనుంది. జీవో ఎంఎస్ నంబరు 54 కింద 53 గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మంజూరు చేసిన రూ.128.75 కోట్లు రద్దు చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ వివరాలపై ఆంధ్రజ్యోతి కథనం.
కర్నూలు, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పశ్చిమ ప్రాంతం అంటే గుర్తుకొచ్చే కన్నీటి కష్టాలే.. బిందెడు నీటి కోసం తల్లడిల్లుతున్న పల్లెసీమలు. వేసవిలో ఏ పల్లెకు వెళ్లినా, ఎవరిని పలకరించినా గుక్కెడు మంచినీటి కోసం పడుతున్న అవస్థలు కనిపిస్తాయి. జిల్లాలో కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల్లోని 27 మండలాల పరిధిలో 484 పంచాయతీలు ఉన్నాయి. గ్రామీణ తాగునీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) విభాగం రికార్డుల మేరకు 32 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) ద్వారా 360 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారు. మెజార్టీ సీపీడబ్ల్యూఎస్ పథకాలు 25-35 ఏళ్లకు ముందు నిర్మించినవే. జనాభా పెరగడం, నీటి పథకాలు నిర్వహణ లోపం వల్ల పశ్చిమ ప్రాంతాల్లో నీటి కష్టాలు చుట్టిముట్టాయి. గ్రామాల్లో నీటి కష్టాలకు స్వస్తి చెప్పి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంగా 2019 ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ (జేజేఎం) అమలులోకి తెచ్చింది. 2024 వరకు అంటే ఐదేళ్లలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్‌తో పాటు శుద్ధి చేసిన స్వచ్ఛమైన నీరు అందించాలి. రూ.692.92 కోట్లతో 1,491 పనులు చేపట్టారు. నిధులు ఉన్నా.. నాటి జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సకాలంలో నిధులు సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల రూ.567.29 కోట్లు విలువైన 1,024 పనులు రద్దు చేశారు.
జేజేఎం పనుల పునరుద్ధరణ
సీఎం చంద్రబాబు సారథ్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం జేజేఎం పనులను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఎట్టకేలకే 2028 వరకు పొడగించారు. దీంతో రాష్ట్రంలో రూ.4,053.85 కోట్లు విలువైన 13,252 జేజేఎం పనులను పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబ రు 10న జీవో ఎంఎస్ నంబరు.118 కింద ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగానే జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో రూ.189.51 కోట్లతో చేపట్టే 269 జల్‌జీవన్ మిషన్ పనులు పునరుద్ధరించారు. 474 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు క్షేత్రస్థాయి లో పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేసి డీపీఆర్ ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది. ప్రతిపాదనల తయారీలో ఇంజనీర్లు నిమగ్నమయ్యారని ఎస్‌ఈ మనోహర్ పేర్కొన్నారు. ఈ పనులు పూర్తైతే గ్రామాల్లో తాగునీటి సమస్యకు చెక్ పెట్టినట్లు అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఆదోని, ఆలూరు, కోడుమూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో 53 గ్రామాలకు తాగునీటి సమస్య శాశ్వాత పరిష్కారం చూపాలని స్టేట్ డెవపల్‌మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్), ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌డీఎస్ (ప్లెయిన్) గ్రాంట్ కింద రూ.128.75 కోట్లు మంజూరు చేస్తూ గత మార్చి 26న జీవోఎంఎస్ నంబరు 54 జారీ చేశారు. అందులో ఎన్నో ఏళ్లుగా తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్న కోడుమూరు పట్టణానికి గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైప్‌లైన్ తాగునీటి సరఫరాకు రూ.38.67 కోట్లు, తాతల కాలం నుంచి వక్రేణి (వర్షపు నీటి నిల్వ కుంట) నీటితో దాహం తీర్చుకుంటున్న ఆస్పరి మండలం జొహరాపురం గ్రామానికి హంద్రీ నీవా నుంచి పైప్‌లైన్ ద్వారా తాగునీరు అందించేందుకు రూ.6.75 కోట్లు మంజూరు చేశారు. తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న 53 గ్రామాలకు నీటి సమస్య శాశ్వత పరిష్కారం లభించిందని ప్రజలు సంతోషించారు. అయితే.. ఆ నిధులను ప్రభుత్వం రద్దు చేసినట్లు అధికారులు పేర్కొనడం కొసమెరుపు.
సబ్ డివిజన్ల వారిగా జేజేఎం కింద మంజూరైన పనులు, లబ్ధిపొందే గ్రామాలు, నిధులు రూ.కోట్లలో
సబ్ డివిజన్ పనులు గ్రామాలు నిధులు
ఆదోని 64 87 69.14
ఆలూరు 52 82 11.62
కోడుమూడు 21 38 37.93
కర్నూలు 30 49 19.95
మంత్రాలయం 36 50 11.67
పత్తికొండ 27 90 34.07
ఎమ్మిగనూరు 24 42 5.14
మొత్తం 269 474 189.52
ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం
జిల్లాలో జేజేఎం కింద గతంలో రద్దు చేసిన, కొత్తగా ప్రతిపాదించిన 269 పనులకు రూ.189.52 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో 474 గ్రామాల్లో చేపట్టే పనులకు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపుతున్నాం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపడుతాం. తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 53 గ్రామాల్లో శాశ్వతంగా పరిష్కారం కోసం రూ.128.75 కోట్లు మంజూరు చేస్తూ ఇచ్చిన జీవో ఎంఎస్ నంబరు 54 ప్రభుత్వం రద్దు చేసింది. అందులోని పనులు కొన్ని జేజేఎం కింద చేర్చారు.
- మనోహర్, ఎస్‌ఈ, గ్రామీణ తాగునీటి విభాగం, కర్నూలు