ఉనికి కోసమే జగన్ పాకులాట
ABN , Publish Date - Apr 11 , 2026 | 11:24 PM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విధ్వంస పాలన కొనసాగిందని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు
వైసీపీ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం
చంద్రబాబు బ్రాండ్‌తో వికాసం దిశగా రాష్ట్రం
రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
కొలిమిగుండ్ల, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విధ్వంస పాలన కొనసాగిందని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. శనివారం కొలిమిగుండ్ల మండలంలోని వివిధ గ్రామాలలో జరిగిన రూ 4.59 కోట్ల అభివృద్ధి పనులను మండల కేంద్రం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విధ్వంస పాలన నుండి చంద్రబాబు బ్రాండ్‌తో వికాసం దిశగా పయనం సాగిస్తునట్లు పేర్కొన్నారు. చంద్రబాబు అనుభవంతో రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్, సిసిఎస్ లాంటి భారీ పరిశ్రమలు తరలి వస్తున్నాయని అన్నారు. కొలిమిగుండ్ల మండలంలో రామ్‌కో సిమెంట్ పరిశ్రమ గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఫౌండేషన్ వేయగా ప్రస్తుత ప్రభుత్వంలో అలా్ట్రటెక్ సిమెంట్ పరిశ్రమ ప్రారంభానికి నోచుకుందని అన్నారు. గత పాలనలో మాజీ సీఎం జగన్ మూడు ముక్కలాటతో రాష్ట్ర ప్రజలను అవహేళన చేశారని విమర్శించారు. అమరావతి అభివృద్ధిని చూసి ఓర్వలేక మావిగన్ అంటూ మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టడానికి జగన్‌మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల రామేశ్వర్ రెడ్డి, మూలే రామేశ్వర్ రెడ్డి, వీఆర్ లక్ష్మీరెడ్డి, గొంగటి హుస్సేన్ రెడ్డి, అంబటి వివేకానంద రెడ్డి, గూలి నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు.