జగనన్న ఇళ్లు.. శిథిలాల గూళ్లు!
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:20 PM
పేదల సంక్షేమం.. వారికి పక్కా ఇళ్లు అంటూ గత వైసీపీ ప్రభుత్వం అప్పట్లో ఎన్నో ప్రగల్బాలు పలికింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటిని నిర్మించి ఇస్తామంటూ ఉపన్యాసాలు ఇచ్చి అరకొరగా పనులు చేపట్టారు.
ఓ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం
46 మంది బాధితులకు శాపం
కూలిపోతున్న ఇళ్లు
స్థలాలు రాక.. పాత ఇళ్లు పూర్తి కాక..
అయోమయంలో లబ్ధిదారులు
ఆదోని రూరల్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): పేదల సంక్షేమం.. వారికి పక్కా ఇళ్లు అంటూ గత వైసీపీ ప్రభుత్వం అప్పట్లో ఎన్నో ప్రగల్బాలు పలికింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటిని నిర్మించి ఇస్తామంటూ ఉపన్యాసాలు ఇచ్చి అరకొరగా పనులు చేపట్టారు. ఆ పనులు సైతం నాసిరకంగా చేయడంతో పేదల ఇళ్లు శిథిలావస్థ దశకు చేరుకుని నేడో రేపో కూలిపోయేలా ఉన్నాయి. అప్పట్లో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇళ్లు మధ్యలోనే ఆగిపోవడంతో జగనన్న కాలనీ మొత్తం అడవిని తలపిస్తోంది. పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగిపోయి విషపురుగులు సంచరిస్తున్నాయి. మందుబాబులు, జూదరులు జగనన్న నివాసాలను అడ్డాగా మార్చుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఆదోని-2 మండల మరిధిలోని నాగనాథనహళ్లి గ్రామంలో జగనన్న ఇళ్లు శిథిలావస్థదశకు చేరుకోవడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. అప్పటి ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లు పూర్తికాక.. ప్రస్తుతం కొత్తవి మంజూరు కాకపోవడంతో పేదలు లబోదిబోమంటున్నారు. నాగనాథనహళ్లి గ్రామంలోని జగనన్న కాలనీలో 2021 జూన్ నెలలో శ్మశాన వాటిక సర్వే నెం. 262, 264లో 2.47 ఎకరాల్లో 1.5 సెంటు విస్తీర్ణంలో 46 ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఇందులో 24 ఇళ్లు టాప్‌లెవల్, 19 ఇళ్లు పునాది స్థాయిలో ఉన్నాయి. రెండు రూఫ్ లెవల్ వరకు నిర్మాణాలు జరిగి ఆగిపోయాయి. ఈ ఇళ్ల నిర్మాణాలకు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు మెటీరియల్ పేమెంట్ కింద రూ.22 లక్షలు, లబ్ధిదారుల ఖాతాల్లో రూ.31.15,998 జమ చేసింది. లబ్ధిదారుల ఖాతాల్లో జమఅయిన డబ్బును కాంట్రాక్టర్ తమ అనుచరుల ద్వారా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం బేస్ మట్టం వేసిన ఇళ్లు, టాప్ లెవల్‌కు వచ్చిన ఇళ్లు దాదాపు అన్ని కుప్పకూలిపోయాయి. గోడలన్నీ నెర్రలు చీలాయి.
విచారణ చేస్తాం
నాగనాథనహళ్లి జగనన్న కాలనీలలో నాసిరకంగా ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్, అప్పటి అధికారులపై విచారణ చేపడతాం. నాసిరకమైన ఇటుకల వినియోగం, పునాది లోతు లేకపోవడం, సకాలంలో క్యూరింగ్ చేయకపోవడం వల్లే ఇళ్లు కూలిపోయే దశకు చేరుకున్నాయి. ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స ద్వారా కాంట్రాక్టర్‌కు నాటి ఒప్పందం ప్రకారం ప్రతి ఇంటికి రూ.30వేలు ఇవ్వాల్సి ఉందని వైసీపీ నాయకుడు తిమ్మారెడ్డి మాపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ నిధులు కూడా ఇవ్వకుండా నిలిపేస్తాం. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
-చంద్రశేఖర్ హౌసింగ్ ఈఈ, ఆదోని
మధ్యలోనే ఇంటి నిర్మాణం ఆగిపోయింది
మాది పేద కుటుంబం. ఇప్పటికీ పూరిగుడిసెలోనే ఉంటున్నాం. మాకు నలుగురు పిల్లలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్లు మంజూరైందంటే ఎంతో సంతోషించాం. ఇళ్లు పూర్తి కాకుండా మధ్యలోనే ఆపేశారు. నాసిరకంగా కట్టిన ఆ ఇళ్లు కూడా ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియని పరిస్థితి. అప్పట్లో నా బ్యాంకు ఖాతాలో జమ అయిన రూ.1.90 లక్షల సొమ్మును తిమ్మారెడ్డి మనుషులు వచ్చి విత్ డ్రా చేయించుకుని వెళ్లారు. ఇది చాలా అన్యాయం. ఇప్పుడు మాకు పాత ఇళ్లు సిద్ధం కాదు.. కొత్త స్థలం, ఇళ్లు మంజూరు కాదు. మాకు ప్రభుత్వమే న్యాయం చేయాలి.
- సుశీల, లబ్ధిదారు, నాగనాథనహళ్లి