Share News

ఓటుకు వేళాయె..!

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:37 PM

పట్టణ భవిషత్తు ఎవరి చేతుల్లో ఉండాలి? సమస్యలు తెలిసిన పాలకులు కావాలా?

ఓటుకు వేళాయె..!

కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరులో మున్సిపల్‌ ఎన్నికలు

పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది

పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు

ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి

ఉదయం 7గంటలకే ప్రారంభం

నేడు మున్సిపల్‌ పోలింగ్‌

పట్టణ భవిషత్తు ఎవరి చేతుల్లో ఉండాలి? సమస్యలు తెలిసిన పాలకులు కావాలా? అభివృద్ధికి బాటలు వేసే నాయకత్వం కావాలా? ప్రగతి కోసం పాటుపడే ప్రజా ప్రతినిధులు ఎన్నుకోవాలా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం మీ ఓటే. ఆ సమయం వచ్చేసింది. ఓటుకు వేళైంది. ఆదివారం పోలింగ్‌. బద్ధకం వీడి.. బాధ్యతగా అడుగులు వేద్దాం.. పోలింగ్‌ కేంద్రానికి చేరుకుందాం.. మన ఓటుతో నగరం, పట్టణాల ప్రగతికి బలమైన పునాదాలు వేద్దాం..! ఇప్పటికే ఆయా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్‌కు సంబంధించి అధికారులు సర్వం సిద్ధం చేశారు.

కర్నూలు, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): పురపోరుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే తరువాయి. జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు పురపాలక సం ఘాలు, గూడూరు నగర పంచాయతీల ఎన్నికల్లో భాగంగా ఆదివారం పోలింగ్‌ నిర్వహించనున్నారు. కర్నూలు కార్పొరేషన్‌ మేయర్‌గా పీఠం కోసం టీడీపీ అభ్యర్థిగా విజయ ప్రత్యూష, వైసీపీ అభ్యర్థి సుశీల, కాంగ్రెస్‌ అభ్యర్థిగా కల్లమల తామరవేణి, సీపీఎం అభ్యర్థిగా బి.శ్యామల సహా 13 మంది, 67 డివిజన్లకు కార్పొరేటర్లుగా 304 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 4,79,861 మంది ఓటర్లు తమకు నచ్చిన నగర పాలకులను ఎన్నుకోవడానికి వీలుగా ఎన్నికల అథారిటీ, కమిషనర్‌ చల్లా ఓబులేసు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదోని పురపాలక సంఘం చైర్‌పర్సన్‌ పీఠం కోసం టీడీపీ అభ్యర్థి టి.మణి, వైసీపీ అభ్యర్థిగా ప్రణతి, స్వతంత్ర అభ్యర్థిగా స్వప్న నాయకర్‌ సహా ఎనిమిది మంది. 52 వార్డుల కౌన్సిలర్‌ పదవి కోసం 247 మంది పోటీ పడుతున్నారు. 1,76,676 మంది ఓటర్లు తమకు నచ్చిన పాలకులను ఎన్నుకోవడానికి వీలు కల్పిస్తూ ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎమ్మిగనూరు మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం కోసం కూటమి అభ్యర్థి మాచాని సునీత, వైసీపీ అభ్యర్థి కేఎస్‌ రఘుతోపాటు ఆరుగురు, 44 వార్డులకు కౌన్సిలరు అభ్యర్థులుగా 126మంది పోటీలో ఉన్నారు. 84,934 మంది ఓటర్లు ఓటేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గూడూరు నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ పీఠం కోసం కూటమి బీజేపీ అభ్యర్థి డమాం సునీతాబాయి, వైసీపీ అభ్యర్థి ఎల్‌.పద్మావతి, 23 వార్డుల కౌన్సిలర్‌ పదవి కోసం 60 మంది బరిలో ఉన్నారు. ఇక్కడ 17,665 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా మున్సిపాలిటీల్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఏ.సిరి ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్‌ సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.

పోలింగ్‌ కేంద్రాల వైపు..

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. అది కేవలం వేలిపై పడే సిరా గుర్తు కాదు. మన భవిషత్తును నిర్దేశించే శక్తి. రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, వీధి దీపాలు ఇలా నిత్యం మనల్ని ప్రభావితం చేసే ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపే నాయకత్వాన్ని ఎంచుకునే సమయం ఇది. నగర, పట్టణాభివృద్ధి కాంక్షించే మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, వ్యాపారులు, తమ భవిషత్తు కోసం ఎన్నో కలలు కంటున్న జెన్‌-జీ పోలింగ్‌ కేంద్రాల వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓటేయడానికి సమయం లేదనో.. ఆదివారం సెలవు రోజు కదా అని విశ్రాంతి తీసుకోవాలో భావించకూడదు. మన నగరం, పట్టణం ఎలా ఉండాలని కలలు కంటున్నామో.. ఆ కలలు సాకారం చేయగలిగే విజన్‌ కలిగిన నాయకత్వాన్ని ఎంచుకునే బాధ్యత మనదే. అందుకే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.

కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డును చూపించి ఓటు వేయవచ్చు. ఆ కార్డు లేనిపక్షంలో ఆధార్‌, ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డు, బ్యాంక్‌/ పోస్టాఫీసు జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్‌, పట్టాదారు పాస్‌ పుస్తం, కార్మిక శాఖ జారీ చేసిన ఆరోగ్యబీమా స్మార్ట్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డు, పాస్‌పోర్ట్‌, ఫొటోతో కూడిన పెన్షన్‌ డాక్యుమెంట్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు ద్వారా ఉద్యోగులకు జారీ చేసిన ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, ప్రత్యేక వైకల్యం గుర్తింపు కార్డులు.. ఇలా 12 రకాల గుర్తింపు కార్డులను ఓటరు పోలింగ్‌ కేంద్రాల్లో చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

అన్ని చర్యలు తీసుకున్నాం : చల్లా ఓబులేసు, నగర ఎన్నికల అథారిటీ అధికారి

కర్నూలు నగరంలో 68 వార్డులున్నాయి. 4,79,861 మంది ఓటర్లు ఓటేసేలా 487 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. అసెంబ్లీ నియోజవర్గం ఓటర్ల జాబితా ప్రకారం ఇంటి నంబరు ఆధారంగా వార్డులు విభజన చేశాం. ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నాం. 153 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మక, 153 కేంద్రాలు అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించాం. అక్కడ ప్రత్యేక నిఘా పెట్టాం. ఇప్పటికే ఓటరు స్లిప్పులు పంపిణీ చేశాం. ఆ స్లిప్పులు లేకున్నా.. సీఈసీ ఆమోదించిన గుర్తింపు కార్డులు చూపించి ఓటేయవచ్చు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తోంది. 3వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు కూడా ఏర్పాట్లు చేశాం.

ఓటు ప్రజాస్వామ్యానికి బలం

అభివృద్ధిని ఆకాక్షించే వారినే ఎన్నుకోండి

రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌

కర్నూలు, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ఓటు హక్కు వినియోగంతో ప్రజాస్వామ్యానికి బలం చేకూరు తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. నగర, మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని విజ్ఞతతో ఆలోచించి.. అభివృద్ధిని ఆకాక్షించే వారికే ఓటేయాలని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఓటు హక్కును పౌ రులు బాధ్యతగా వినియోగించుకోవాలి. ఎలాంటి భయం, ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైంద న్నారు. కర్నూలు నగర భవిషత్తు నిర్ణయించే శక్తి ఓటర్లుగా ప్రజలకే ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం ఆశయంగా ముందుకు సాగు తుందని, అదే అభివృద్ధి ప్రస్థానం నిరంతరాయంగా కొనసాగాలంటే ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు. ప్రజలకు అందుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధిని బేరీజు వేసుకొని ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఓటు వేయడం మన హక్కే కాదు.. బాధ్యత కూడా. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని, ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Updated Date - Oct 31 , 2026 | 11:37 PM