పూజకు వేళాయె...
ABN , Publish Date - Mar 21 , 2026 | 11:34 PM
శ్రీశైలం జలాశయం నుంచి రెండు రాష్ట్రాలకు తాగు, సాగునీటి అవసరాల కోసం నీటి విడుదల అవుతుండటంతో రోజు రోజుకు నీటి మట్టం తగ్గుతోంది.
పూర్తిగా బయల్పడిన సంగమేశ్వరాలయం
కొత్తపల్లి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయం నుంచి రెండు రాష్ట్రాలకు తాగు, సాగునీటి అవసరాల కోసం నీటి విడుదల అవుతుండటంతో రోజు రోజుకు నీటి మట్టం తగ్గుతోంది. దీంతో నదీ గర్భంలో నిక్షిప్తమైన సప్తనదుల సంగమేశ్వరాలయం శనివారం నాటికి పూర్తి స్థాయిలో బయల్పడింది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 885 అడుగులు కాగా, శనివారం 830 అడుగులకు చేరుకుంది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వలు 215 టీఎంసీలు కాగా, 61 టీఎంసీలకు చేరుకోవడంతో సంగమేశ్వర ఆలయం పూర్తిగా కనిపిస్తోంది. పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ గర్భాలయంలో రెండు అడుగుల నీరు ఉన్నప్పటికీ వెళ్లి వేపదారు శివలింగానికి పూజలు చేశారు. ఆలయం మొత్తం బురదమయంగా మారింది. అయినప్పటికీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బురదను లెక్క చేయకుండా సంగమేశ్వరుడిని దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే నీటి మధ్యలో సంగమేశ్వరాలయం భక్తులను కనువిందు చేస్తోంది. సెలవు రోజులు కావడంతో భక్తుల రద్దీ మొదలైంది. పురోహితులు తెలకపల్లి మాట్లాడుతూ ఆలయంలో బురద ఉందని, ఎవరూ వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. ఆదివారం నుంచి బురద తొలగించే కార్యక్రమాన్ని చేపడతామన్నారు.