పరీక్షలకు వేళాయె..
ABN , Publish Date - Mar 16 , 2026 | 12:24 AM
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
నేటి నుంచి ‘పది’ పరీక్షలు
జిల్లాలో మొత్తం 35,791 మంది విద్యార్థులు
160 పరీక్ష కేంద్రాలు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
కర్నూలు ఎడ్యుకేషన్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగుతాయి.జిల్లాలో 552 ఉన్నత పాఠశాలల నుంచి రెగ్యులర్ విద్యార్థులు 33,796 మంది కాగా, ప్రైవేటుగా హాజరయ్యే విద్యార్థులు 1975 మంది హాజరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 160 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌకర్యార్థమై ఆర్టీసీ బస్సు సర్వీసులు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. విద్యార్థులు హాల్‌టికెట్ చూపించి ఆయా బస్సు సర్వీసులో ఉచిత ప్రయాణాన్ని పొందవచ్చు.
సీసీ కెమెరాలు ఏర్పాటు..
గార్గేయాపురం, వసంతనగర్, ఉలిందకొండ, బెళగల్ ఏ, బీ కేంద్రాలు, దేవనకొండ, ఆస్పరిలో ఏ, బీ కేంద్రాలను సమస్మాత్మక సెంటర్లుగా జిల్లా విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఈ కేంద్రాల్లో ఎలాంటి చూచి రాతలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ విధించి గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్ షాపులను మూసివేయాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లాకు రాష్ట్ర పరిశీలకులుగా జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి అబ్రహంను నియమించారు.
పొరపాట్లు జరగకుండా చర్యలు
రాష్ట్ర పరిశీలకుడి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులను సమన్వయం చేసుకుని పరీక్షలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే కలెక్టర్ డా.సిరి కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటుచేసి వివిద జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేం దుకు కంట్రోల్ రూమ్.నెంబర్ 9000822394ను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో గాలి, వెలుతురు, ప్యాన్‌లు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను పూర్తి స్థాయిలో విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఓపెన్ స్కూల్ ‘పది’
ఓపెన్ స్కూల్ పదవ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు 1547 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 10 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు.
అరగంట ముందే చేరుకోవాలి
పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాసేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలి. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్స్‌ను చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరికి అనుమతి లేదు. హాల్ టికెట్ నెంబర్‌ను నోటీసు బోర్డులో చూసుకునేందుకు వీలుగా ఏర్పాటుచేశాం.