Share News

కష్టం సర్‌..!

ABN , Publish Date - Jun 30 , 2026 | 11:46 PM

కేంద్ర ఎన్నికల సంఘం ‘ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌)’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. బోగస్‌, డబుల్‌ ఎంట్రీ ఓటర్లను తొలగించడం కోసం చేపట్టిన ఈ ప్రక్రియ మంచిదే.

కష్టం సర్‌..!

2002 నాటి ఓటర్ల జాబితా వివరాలు నమోదు తప్పనిసరి

ఓటర్లకు తప్పని తిప్పలు

సవాల్‌గా మారిన ఎన్యుమరేషన్‌ పత్రాల భర్తీ

తెలుగింటికి కోడళ్లుగా వచ్చిన కర్ణాటక యువతులు

అక్కడి వివరాలు దొరక్క అవస్థలు

కేంద్ర ఎన్నికల సంఘం ‘ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌)’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. బోగస్‌, డబుల్‌ ఎంట్రీ ఓటర్లను తొలగించడం కోసం చేపట్టిన ఈ ప్రక్రియ మంచిదే. అయితే.. 2002 నాటి ఓటరు వివరాలు తప్పని సరిగా నమోదు చేయాల్సి రావడంతో పట్టణ, గ్రామీణ ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్యుమరేషన్‌ పత్రాలను భర్తీ చేయడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. సాంకేతిక, పరిపాలనపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలుగింటికి కోడళ్లుగా వచ్చిన కర్ణాటక రాష్ట్ర మహిళలకు కష్టాలు రెట్టింపయ్యాయి. ‘సర్‌’ లక్ష్యం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమే అయినప్పటికి క్షేత్రస్థాయిలో ఓటర్ల సమస్యలు పరిష్కారం కాలేదు. జిల్లా ఎన్నికల యంత్రాంగం, బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌వో) ఆ సమస్యలు పరిష్కారంపై దృష్టి పెట్టాలి. అప్పుడే ఓటర్ల జాబితా నుంచి అర్హత ఉన్న ఏ ఒక్క ఓటు కూడా మిస్‌ అవ్వదు. లేదంటే.. సర్‌ పూర్తయ్యాక మా ఓటు గల్లంతయ్యిందంటూ వేలాది మంది గగ్గోలు పెట్టే అవకాశం ఉంది.

కర్నూలు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో 2024 సాధారణ ఎన్నికల నాటికి 20,54,563 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 10,13,794, మహిళలు 10,40,451 ఓటర్లు ఉన్నారు. ‘ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-సర్‌)’ ప్రక్రియ శ్రీకారం చుట్టే నాటికి 20,86,119 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికి ఎన్యుమరేషన్‌ ఫారాలు (ఈఎఫ్‌) పంపిణీ చేయాలి. ఎన్నికల సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓటర్లను మ్యాపింగ్‌ చేయాలి. ఎన్యూమరేషన్‌ ఫారాలను సీఈసీ నిబంధనలు ప్రకారం భర్తీ చేసి బీఎల్‌ఓలకు ఇస్తే ఈఎఫ్‌లను డిజిటలైజేషన్‌ చేయాలి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈఎఫ్‌ ఫారాలను నింపేందుకు ఓటర్లకు సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా 2002 నాటి ఓటరు జాబితాలోని వివరాలను తప్పని సరిగా నమోదు చేయాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండేళ్ల క్రితం 2024 మే 13న జరిగిన ఎన్నికల నాటి ఓటరు జాబితాలో వివరాలు, బూత్‌ నంబరు గుర్తుంచుకోవమే కష్టం. అలాంటిది 24 ఏళ్ల క్రితం ఏ నియోజకవర్గం, ఏ గ్రామం ఓటర్ల జాబితాలో ఓటు క్రమ సంఖ్య, ఓటర్లు గుర్తింపు కార్డు నంబరు, సీరియల్‌ నంబరు, పోలింగ్‌ స్టేషన్‌.. వంటి వివరాలు ఎన్యుమరేషన్‌ ఫారంలో నమోదు చేయాల్సి ఉంది. ఆ వివరాలు తెలియక అయోమయానికి గురవుతున్నారు.

2002 ఓటరు జాబితా తెలియక అవస్థలు

సర్‌ ఎన్యుమరేషన్‌ ఫారం మొదటి కాలంలో 2002 నాటి ఓటరు వివరాలు నమోదు చేయాలి. తాజాగా ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ 2002 ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతు న్నారు. బీఎల్‌వోల వద్ద పాత ఓటర్ల జాబితా పీడీఎఫ్‌ రూపంలో ఉంది. మొబైల్‌లో చూసి వివరాలు చెబుతున్నారు. ఇంటింటికి వచ్చి ఎన్యుమరేషన్‌ ఫారాలు ఇచ్చి భర్తీ చేసి ఇవ్వాలని బీఎల్‌ఓలో చెప్పి వెళ్లారు. ఏదైనా అనుమానం ఉంటే ఆ ఫారం పైభాగంలో బీఎల్‌ఓ పేరు, మొబైల్‌ నంబరు ఉంటుంది. ఆ నంబరుకు ఫోన్‌ చేసి మెజార్టీ బీఎల్‌ఓలు సమాధానం ఇవ్వడం లేదు. ఒకవేళ ఫోన్‌ ఎత్తినా తెలిసిన వారి వద్దకు వెళ్లి భర్తీ చేసి తీసుకురమ్మంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం తెలియని నిరక్షరాస్యులు, వృద్ధులు కష్టాలు వర్ణనాతీతం.

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ 2009లో జరిగింది. అప్పట్లో ఒక నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు మరో నియోజకవర్గంలో కలిపారు. దీంతో ఓటర్ల బాబితాలో క్రమ సంఖ్య, పోలింగ్‌ కేంద్రాల నంబర్లు మారిపోయాయి. 2009 వరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్న మంత్రాలయం, పెద్దకడుబూరు, కోసిగి, ఆదోని నియోజకవర్గంలోని కౌతాళం మండలాలు కొత్తగా ఏర్పడిన మంత్రాలయం నియోజకవర్గంలో కలిపారు. పత్తికొండ నియోజకర్గంలో ఉన్న గోనేగండ్ల మండలం ఎమ్మిగనూరు నియోజకవర్గం, దేవనకొండ మండలాన్ని ఆలూరు నియోజకవర్గంలో, డోన్‌ నియోజకవర్గంలో ఉన్న వెల్దుర్తి, కృష్ణగిరి మండలాలను పత్తికొండ నియోజకవర్గంలో కలిపారు. అలాగే.. కర్నూలు నియోజకవర్గంలోని కర్నూలు నగరపాలక సంస్థకు చెందిన 16 కల్లూరు అర్బన్‌ వార్డులు పాణ్యం నియోజకవర్గంలో, మూడు వార్డులు సహా కర్నూలు రూరల్‌ మండలంలోని పలు గ్రామాలు కోడుమూరు నియోజకవర్గంలో కలిపారు. కోడుమూరు నియోజకవర్గంలోని కల్లూరు మండలం పాణ్యం నియోజకవర్గంలో కలిపారు. దీంతో ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాలు పూర్తిగా మారిపోయాయి. 2002 నాటి ఓటర్ల వివరాలు గుర్తించడం కష్టంగా మారింది. ఎన్యుమరేషన్‌ ఫారాలను అందుకున్న ఓటర్లు వాటి వివరాలను సక్రమంగా పూరించకపోతే ‘సర్‌’ పూర్తయి తుది ఓటర్ల జాబితా వచ్చాక.. ఆ జాబితాలో మా ఓటు ఉంటుందా..? పోతుందా..? అనే భయం వెంటాడుతోంది.

కోడళ్లుగా వచ్చిన కన్నడిగులు

ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాలోని పలు గ్రామాలకు కర్ణాటక, కోడుమూరు, కర్నూలు, పాణ్యం నియోజకవర్గాల్లోని గ్రామాలకు తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల మధ్య వివాహ అనుబంధాలు ఉన్నాయి. సరిహద్దు గ్రామాల్లో ఒక్కో గ్రామంలో వందల మంది కర్ణాటక అమ్మాయిలు తెలుగింటికి కోడళ్లుగా వచ్చారు. 2002కు ముందే ఇక్కడికి కోడళ్లుగా వచ్చిన వారు ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లో దాదాపుగా 25-30 వేల మందికి పైగా ఉన్నట్లు తెలుస్తుంది. 24 ఏళ్ల క్రితం సరిహద్దు గ్రామాల్లో 15-18 ఏళ్లలోపు అమ్మాయిలకే బాల్య వివాహాలు చేసేవారు. దీంతో కర్ణాటకలో ఓటు హక్కు రాకమునుపే ఇక్కడికి అబ్బాయిలతో పెళ్లై కోడళ్లుగా వచ్చారు. కొందరైతే వయోభారం వల్ల తల్లిదండ్రులను కోల్పోయారు. సర్‌ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్‌ ఫారాలు భర్తీ చేసేందుకు 2002 నాటి ఓటరు వివరాలు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. కర్ణాటకకు వెళ్లినా అక్కడ కూడా సరైన వివరాలు దొరకడం లేదు.

బీఎల్‌వోలకు అవగాహన లేక..

చాలా మంది బీఎల్‌వోలకు సరైన అవాగాహన లేకపోవడం ఇబ్బందులు తప్పడం లేదు. 2002 జాబితాలో పేరు లేకపోతే మా ఓటు పోతుందా..? వంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. పీడీఎఫ్‌ ఫైల్‌లో 2002 నాటి ఓటరు వివరాలు తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. చదువుకున్న వారు సైతం ఎన్యూమరేషన్‌ ఫారాలు భర్తీ చేయడానికి ఇతరుల సహాయం తీసుకుంటున్నారు. ఒక్కో బీఎల్‌వో 1,200 మంది ఓటర్ల ఫారాలు పంపిణీ చేసి తిరిగి కలెక్ట్‌ చేసుకోవాలి. సర్వర్‌ సమస్యలు, గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్‌ సమస్యలు కారణంగా సర్‌ ప్రక్రియ జాప్యం అవుతుంది.

Updated Date - Jun 30 , 2026 | 11:58 PM