అంతా హడావిడే..!
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:06 PM
రైతులను నమ్మించేలా వైసీపీ మంగవారం తలపెట్టిన వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి అంతా హడావిడిగా సాగింది.
వెలుగోడు రిజర్వాయర్ ముట్టడితో వైసీపీ నానా యాగీ
నిరసనల పేరుతో రచ్చచేసిన నాయకులు
అడ్డుకున్న పోలీసులతో దురుసు ప్రవర్తన
నంద్యాల, సెప్టెంబరు1(ఆంధ్రజ్యోతి): రైతులను నమ్మించేలా వైసీపీ మంగవారం తలపెట్టిన వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి అంతా హడావిడిగా సాగింది. జిల్లాలోని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి సదరు జలాశయం ముట్టడిలో భాగంగా నానా యాగీ చేశారు. పోలీసుల ముందస్తు నోటీసులిచ్చినా భేఖాతారు చేసి మరీ ముట్టడికి తరలివచ్చారు. ఈనిరసనలో ఆశించిన స్థాయిలో రైతులు లేకపోవడం పలు వి మర్శలకు తావిస్తోంది. నంద్యాల నుంచి మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవి తమ వైసీపీ నాయకులు, కార్యకర్తలతో బండి ఆత్మకూరుకు చేరుకున్నారు. ఏఎస్పీ సుస్మిత తమ సిబ్బందితో కలిసి అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించారు. కొందరు వైసీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించడంతో కాసేపు వైసీపీ నాయకులు, పోలీసుల మధ్య ఉద్రిక్తతకు దారీ తీసింది. కొందరు నాయకులైతే పోలీసులపై దాడికి పాల్పడే ప్రయత్నం చేశారు. వెలుగోడు మండలం మోతుకురు వద్ద రోడ్డుపై శిల్పా చక్రపాణిరెడ్డి తనయుడు శిల్పా కార్తీక్ రెడ్డి, సోదరుడు శిల్పా భువనేశ్వర్‌రెడ్డిని, వేల్పనూరు నుంచి వెలుగోడుకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నందికొ ట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త ధార సుధీర్ వస్తుండగా ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ పలువురు సీఐ లు, ఎస్‌ఐలు అడ్డుకున్నారు. పోలీసులు తీరుపై ఆయా వైసీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వారు రోడ్డుపై బెఠాయించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం వరకు వైసీపీ నాయకులు రోడ్లను దిగ్బంధించడంతో వైసీపీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఏది ఏమైనా బండి ఆత్మకూరు, వెలుగోడు, మోతుకురు వద్ద గంటల తరబడి ఉద్రిక్తత దారి తీసింది.
కనిపించని కీలక నాయకులు
ఆళ్లగడ్డ మాజీ వైసీపీ ఎమ్మెల్యే ఇంటి వద్దనే ఆగిపోయారు. మాజీ మంత్రి బుగ్గన నిరసనలో కనిపించలేదు. వీరితో పాటు మరికొందరు కీలక వైసీపీ నాయకులు సైతం సదరు నిరసనలో కనిపించకపోవడం పలు సందేహాలు లేకపోలేదు.
ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని..
ఎల్‌నినో నేపథ్యంలో అనుమతి రాగానే వెలుగోడు రిజర్వాయర్ నుంచి తాగునీటి కోసం నీరు విడుదల చేస్తామని జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌తో పాటు ఆశాఖ అధికారులు చెబుతూనే ఉన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా వైసీపీ నాయకులు వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని వెలుగోడు రిజర్వాయర్ ముట్టడి డ్రామాకు తెరలేపారు. చివరికి సదరు ముట్టడితో ఏమైనా సాధించారా? అంటే ఏమీ లేదు.