మతాల మధ్య చిచ్చుపెట్టడం దారుణం
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:10 AM
మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ నాయకులు యత్నించడం దారుణమని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు.
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లె, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ నాయకులు యత్నించడం దారుణమని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. శనివారం పట్టణంలోని ఎస్సార్బీసీ కాలనీలో జంగిల్ క్లియరెన్స్ పనులను ఆర్డీవో నరేంద్రనాథరెడ్డి, తహసీల్దారు రాజీవ్‌రెడ్డితో కలసి పరిశీలించారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసేందుకు జంగిల్ క్లియరెన్సులో భాగంగా ఈద్గాను తొలగించాల్సి వచ్చిందన్నారు. ఈద్గాకు కాలనీలోనే స్థలం కేటాయించి అన్ని వసతులు కల్పిస్తామని ముస్లింలకు హామీ ఇచ్చామన్నారు. దీన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని వైసీపీ నాయకులు యత్నిస్తున్నారని వారి మాటలు నమ్మే స్థితిలో ముస్లింలు లేరన్నారు. బనగానపల్లెలో షాదీఖానా నిర్మిస్తుంటే అధికారంలోకి వచ్చిన కాటసాని రామిరెడ్డి అడ్డుపడ్డారన్నారు. బనగానపల్లె, కోవెలకుంట్లలో కమ్యూనిటీ హాల్‌నే షాదీఖానా అంటూ ముస్లింలను దగాచేసిన వ్యక్తి కాటసాని అన్నారు. జుర్రేరు వాగు పొరంబోకు స్థలంలో కార్పెంటర్లకు స్థలాలు ఇచ్చి మోసం చేశారన్నారు. మండి మర్చంట్ అసోసియేషన్ వారికి దొంగ పట్టాలు ఇచ్చి వారిని నమ్మించి మోసం చేశారన్నారు. రాజకీయాల్లోకి రాకముందే తాను పాతబస్టాండ్ వద్ద దర్గాను నిర్మించానని, ముస్లింల కోసం కొండపేటలో రెండు దుకాణాలు నిర్మిస్తుంటే అడ్డుకున్న దుర్మార్గులు వైసీపీ వారన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో 3,500 పట్టాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టామన్నారు. తాగునీటి కనెక్షన్ కావాలని కోరగా తప్పక ఇస్తామని హామీ ఇచ్చారు.