Share News

సాగు నీరు లేనట్లే

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:50 PM

జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం జరిగిన తీరు పాము చావదు.. కట్టె విరగదు..! అనే సామెత గుర్తుకు తెస్తుంది.

సాగు నీరు లేనట్లే
ఐఏబీ సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ నూరల్‌ ఖమర్‌

తాగు నీటికే తొలి ప్రాధాన్యం

టీబీపీ ఎల్లెల్సీ కాలువకు 670 క్యూసెక్కులు

జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మలతో చర్చించాకే సాగునీటిపై నిర్ణయం

ఐఏబీలో డొంక తిరుగుడు నిర్ణయాలు

హైపవర్‌ కమిటీ అజెండాలో గుండ్రేవుల ప్రాజెక్టు చేర్చాలి

హంద్రీ నీవా నుంచి లద్దగిరి, కృష్ణగిరి స్లూయిస్‌ ద్వారా 150 క్యూసెక్కులు ఇవ్వాలి

ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఐఏబీ తీర్మానాలు

కర్నూలు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం జరిగిన తీరు పాము చావదు.. కట్టె విరగదు..! అనే సామెత గుర్తుకు తెస్తుంది. ‘తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ)కు నీటి విడుదలపై ఈ రోజే ఇండెంట్‌ ఇస్తాం.. తాగునీటికే ప్రథమ ప్రాధాన్యత.. దాహం తీరగా మిగిలితేనే వారబంది పద్ధతిలో స్టాండింగ్‌ క్రాప్‌ అరతడి పంటలకు సాగునీరు ఇచ్చే విషయం పరిశీలిస్తాం. అదికూడా జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కలెక్టర్‌ ఏ.సిరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాం..!’ అంటూ ముగించారు. సాగునీరు ఇస్తారా? ఇవ్వరా? అనేదానిపై ఎటూ తేల్చలేదు. దీన్నిబట్టి సాగునీరు లేనట్లేనా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో హంద్రీ నీవా కాలువ లద్దగిరి, కృష్ణగిరి స్లూయిస్‌ల ద్వారా, ఆలూరు బ్రాంచి కాలువ (ఏబీసీ)కు నీటి విడుదల చేయాలని, గాజలదిన్నె ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే స్లూయిస్‌ సామర్థ్యం పెంచాలని, తుంగభద్ర జలాల వినియోగంపై కేంద్ర జలశక్తి శాఖ నియమించిన హైపవర్‌ కమిటీ అజెండాలో గుండ్రేవుల ప్రాజెక్టు చేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

తుంగభద్ర డ్యాంలో 105 టీఎంసీలు వరద చేరింది. కేడబ్ల్యూడీటీ-1 (బచావత్‌ అవార్డు) కేటాయింపుల ప్రకారం జిల్లాకు తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) వాటాగా 11.896 టీఎంసీలు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే తాగునీటి కోసం 1.43 టీఎంసీలు వాడుకోగా, డ్యాంలో మిగులు వాటా 10.466 టీఎంసీలు ఉంది. అందులో నవంబరు ఆఖరు వరకు సాగు, తాగునీటి కోసం ఆరు టీఎంసీలు ఇవ్వాలని ఆయకట్టు రైతులు, రైతు సంఘం నాయకుల ప్రధాన డిమాండ్‌. మూడు రోజుల కిత్రం విజయవాడలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలతో కీలక భేటీ నిర్వహించారు. సాగునీరు ఇస్తారే ఆశతో ఇప్పటికే టీబీపీ ఎల్లెల్సీ కాలువ పరిధిలో ఆయకట్టు, నాన్‌ ఆయకట్టు రైతులు దాదాపుగా 35-40 వేల ఎకరాల్లో వివిధ పంటలు చేశారు.. ఈ పరిస్థితుల్లో స్టాండింగ్‌ క్రాప్‌కు సాగునీరు ఇవ్వకపోతే రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని మంత్రి నిమ్మల దృష్టికి తీసుకెళ్లారు. ఆయన జిల్లా ఇరిగేషన్‌, టీబీపీ బోర్డు అధికారులతో మాట్లాడి నీటి వాటాలపై ఒక అంచనాకు వచ్చారు. సీఎం చంద్రబాబుతో చర్చించి సాగునీటిపై నిర్ణయం తీసుకంటామని ఆ సమావేశంలో భరోసా ఇవ్వడంతో సాగునీరు ఇస్తారనే ఆశ రైతుల్లో బలపడింది. తుంగభద్ర డ్యాం నుంచి నీటి విడుదలపై ఐఏబీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని జలవనరుల శాఖ ఈఎన్‌సీ సూచన మేరకు శనివారం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌, జేసీ నూరుల్‌ ఖమర్‌ అధ్యక్షతన జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, జడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి, టీబీపీ ఎల్లెల్సీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ టిప్పు సుల్తాన్‌, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి హాజరై చర్చించారు. డ్యాం నుంచి 670 క్యూసెక్కులు విడుదల చేయాలని టీబీపీ బోర్డు అధికారులకు ఇండెంట్‌ పెట్టేలా తీర్మానించారు. ఆ నీరు 90 రోజులు తాగునీటికి మాత్రమే వినియోగించాలని, మిగిలిన నీటిని ఇన్‌చార్జి మంత్రి నిమ్మలతో చర్చించి, ఆయన ఆమోదం తెలిపితేనే వారబంది పద్ధతిలో స్టాండింగ్‌ క్రాప్‌కు నీరు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం రైతులను సందిగ్ధంలో నెట్టేసింది.

తాగునీటికే తొలి ప్రాధాన్యం

తుంగభద్ర డ్యాం నుంచి ఎల్లెల్సీ ద్వారా తీసుకునే నీటిని తొలి ప్రాధాన్యతగా తాగునీటికే వినియోగిస్తామని, మిగులు నీటిని స్టాండింగ్‌ క్రాప్‌కు విడదల చేసే అంశాన్ని పరిశీలిస్తామని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌, జేసీ నూరుల్‌ ఖమర్‌ పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్ష్షపాతం తగ్గే అవకాశం ఉందని ముందుగానే రైతుల్లో అవగాహన కల్పించామన్నారు. 22 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు అయిందన్నారు. జిల్లా మొత్తంగా 37 శాతం లోటు వర్షపాతం ఉందన్నారు. తక్కువ నీటితో వచ్చే పంటలే సాగు చేయాలని రైతులకు ఇప్పటికే అవగాహన కల్పించామన్నారు. తుంగభద్ర డ్యాంలో ఇప్పటికే 1.43 టీఎంసీలు వాడుకున్నామని,. ఇంకా 10.89 టీఎంసీలు మిగులు ఉందని తెలిపారు. తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం ఆదేశాల మేరకు టీబీపీ ఎల్లెల్సీ కాలువకు నీటి విడుదల చేయాలని టీబీపీ బోర్డు అధికారులకు ఇండెంట్‌ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. తాగునీటి అవసరాలు పోను మిగులు నీటినే వారబంది పద్ధతిలో స్టాండింగ్‌ క్రాప్‌కు ఇచ్చేలా జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, కలెక్టర్‌ డాక్టర్‌ సిరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాలువలకు తప్ప నదులకు నీరు విడుదల చేయవద్దని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈ శైలేశ్వర్‌ మాట్లాడుతూ తుంగభద్ర డ్యాంలో ఉన్న టీబీపీ ఎల్లెల్సీ మిగుల వాటా 10.49 టీఎంసీల్లో డిసెంబరు నుంచి రాబోయే జూలై వరకు తాగునీరు మూడు దశల్లో విడుదల చేసేలా 4.50 టీఎంసీలు నిల్వ ఉంచాల్సి ఉందన్నారు. మిగిలిన ఆరు టీఎంసీల్లో నవంబరు వరకు తాగునీటి కోసం 670 క్యూసెక్కులు డ్యాం నుంచి విడుదల చేసేలా ఇండెంట్‌ ఇస్తామన్నారు.ఎస్‌ఎస్‌ ట్యాంకులు నింపిన తరువాత మిగులు నీటిని ప్రభుత్వం ఆదేశాల ఇస్తు వారబంది పద్ధతిలో సాగులో ఉన్న పంటలకు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. టీబీపీ బోర్డు సరిహద్దు 250 కిలో మీటర్ల వద్ద ఎంత ప్రవాహం ఉంటే అంత నీటికే లెక్క ఉంటుందన్నారు. మోటర్ల ద్వారా ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారని, దీనిని నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో తెలుగు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డీసీ చైర్మన్‌ రమాకాంతరెడ్డి, టీబీపీ ఎల్లెల్సీ ప్రాజెక్టు కమిటీ వైస్‌ చైర్మన్‌ గోవర్ధన్‌రెడ్డి, ఎల్లెల్సీ డీసీ చైర్మన్లు మిక్కిలినేని వెంకట శివప్రసాద్‌, ధర్మారెడ్డి, హుశేన్‌సాహెబ్‌, ఈఈలు విజయరాజు, వెంకటేశ్వర్లు, జేడీ వరలక్ష్మి, సీపీవో భారతి, హార్టికల్చర్‌ అధికారి రాజా కృష్ణారెడ్డి తదిరులు పాల్గొన్నారు.

ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు గైర్హాజరు

జిల్లాలో గ్రామీణ ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సాగు, తాగునీరు ఇబ్బందులు ఎలా పరిష్కరించాలి. ఎల్‌నినో ప్రభావం జిల్లాలో తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జలాశయాల్లో ఉన్న నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి..? రాబోయే రోజుల్లో తాగునీటి సమస్య రాకుండా ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలి..? సాగులో ఉన్న పంటలను ఎలా కాపాలి..? వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించి.. రైతుల ఆశలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన జిల్లా సాగునీటి సలహా మండలి కీలక సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు గైర్హాజరు కావడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. రైతుల జీవనాధారమైన సాగునీటి విషయంలో చర్చించే ఐఏబీ సమావేశానికి హాజరయ్యే తీరిక మన ఎమ్మెల్యేలకు లేదా..? అంటూ పలువురు చర్చించుకున్నారు.

ఐఏబీలో కీలక తీర్మానాలు ఇవే

తుంగభద్ర నదిపై గుండ్రేవుల ప్రాజెక్టు సీమ రైతుల సెంటిమెంట్‌. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, ఏపీ, కర్ణాటక, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, డీకే శివకుమార్‌, రేవంత్‌రెడ్డి చర్చల తరువాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీ అజెండాలో గుండ్రేవుల ప్రాజెక్టు అంశాన్ని చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.

హంద్రీ నీవా కాలువ లద్దగిరి, కృష్ణగిరి స్లూయిస్‌ నుంచి కనీసం 150 క్యూసెక్కులు తక్షణమే విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. తద్వారా హంద్రీ నది తీరంలోని 18 గ్రామాల ప్రజలు దాహం తీర్చాలి.

హంద్రీనీవా 110.44 కిలోమీటర్ల వద్ద ఏర్పాటు చేసిన తూముల నుంచి గాజులదిన్నె జలాశయానికి 200 క్యూసెక్కులకు మించి విడుదల చేయలేని పరిస్థితి ఉంది. అది కూడా ఐదు పంపులు ఆన్‌లో ఉంటేనే నీటిని తీసుకొనే అవకాశం ఉంది. తూముల సామర్థ్యం పెంచేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.

కర్నూలు నగరం, గాజులదిన్నె జలాశయం ఆధారిత గ్రామాల్లో తాగునీరు అందించడం కోసం హంద్రీ నీవా నుంచి జీడీపీకి వెంటనే నీటి విడుదల చేపట్టాలి.

ఆలూరు, చిప్పగిరి, హాలహర్వి మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నివారణకు హంద్రీనీవా నుంచి ఆలూరు బ్రాంచి కెనాల్‌ (ఏబీసీ)కు నీటిని విడుదల చేయాలి.

తూములు పగులగొట్టే పరిస్థితి ఉంది

హంద్రీనీవా కాలువలో 3,050 క్యూసెక్కులు ప్రవహిస్తోంది. పాణ్యం నియోజకవర్గంలో ఎనిమిది గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తింది. తాగడానికి చుక్కనీరు కూడా హంద్రీ నదిలో లేవు. లద్దగిరి, కృష్ణగిరి స్లూయిస్‌ ద్వారా 150 క్యూసెక్కులు విడుదల చేసి ఆదుకోవాలి. తాగునీటి సమస్య తీరడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. నీళ్లు ఇవ్వకపోతే రైతులు, ప్రజలు తూములు పగులగొట్టి నీళ్లు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ పరిస్థితి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. జీడీపీ నీటి విడుదల, హైపవర్‌ కమిటీ అజెండాలో గుండ్రేవుల ప్రాజెక్టు చేర్చాలి.

- గౌరు చరిత, పాణ్యం ఎమ్మెల్యే

హంద్రీ నదితీర గ్రామాల్లో నీటి కష్టాలు తీర్చాలి

కోడుమూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని హంద్రీ తీర గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్లెల్సీ నీటిని సమర్థవంతంగా వాడుకొని తాగునీటి సమస్య తీర్చాలి. బి.తాండ్రపాడు, పసుపుల గ్రామాల్లో నీటి సమస్యలు రాకుండా తాండ్రపాడు గంగమ్మ చెరువును హంద్రీనీవా నీటితో నింపాలి.

విష్ణువర్ధన్‌రెడ్డి, కేడీసీసీబీ చైర్మన్‌

నీళ్లున్నాయి.. సాగునీరు ఇవ్వాలి

తుంగభద్ర డ్యాంలో పూర్తిస్థాయిలో నీళ్లు ఉన్నాయి. ఖరీఫ్‌ పంటలకు సాగునీరు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే క్రమంలో కర్ణాటకలో జల చౌర్యం జరగకుండా చూడాలి. జిల్లాలో నీటిని నిల్వ చేసుకోవడానికి వీలుగా నూతన జలాశయాలు నిర్మించాలి.

పాపిరెడ్డి, జడ్పీ చైర్మన్‌

ఏబీసీకి హంద్రీనీవా ద్వారా నీటిని ఇవ్వాలి

ఆలూరు, చిప్పగిరి మండలాల్లో తెలెత్తున్న తీవ్ర తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు హంద్రీ నీవా కాలువ నుంచి ఏబీసీ కాలువకు నీటిని విడుదల చేయాలి. సీఎం చంద్రబాబు సూచన మేరకు భవిషత్తు అవరాలను దృష్టిలో ఉంచుకొని పక్కా ప్రణాళితో నీటిని వాడుకోవాలి. టీబీపీ ఎల్లెల్సీ నీటి వాటా కర్ణాటకలో జల చౌర్యం జరగకుండా చూడాలి.

- వైకుంఠం జ్యోతి, ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి

స్టాండింగ్‌ పంటలకు నీళ్లు ఇవ్వాలి

ఎల్లెల్సీ కాలువకు నీళ్లు వస్తాయనే ఆశతో దాదాపు 35 వేల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. అరతడి స్టాండింగ్‌ క్రాప్‌ను కాపాడేందుకు సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయం మంత్రి నిమ్మల రామానాయుడుకు వివరించాం. డీసీ చైర్మన్‌ మిక్కిలినేనే వెంకట శివప్రసాద్‌ మాట్లాడుతూ సరిహద్దులో ఎంత నీరు వస్తే అంతే నీటిని లెక్కిస్తామని అనడం సరికాదు.. 670 క్యూసెక్కులు వాటా వచ్చేలా కృషి చేయాలని అన్నారు.

- టిప్పు సుల్తాన్‌, టీబీపీ ఎల్లెల్సీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌

Updated Date - Aug 22 , 2026 | 11:50 PM