గాడి తప్పింది..
ABN , Publish Date - Jul 26 , 2026 | 11:51 PM
జిల్లా వైద్యఆరోగ్యశాఖలో భ్రూణ హత్యలను అరికట్టడానికి, గర్భస్థ శిశువులింగ నిర్ధారణను నిషేధించడానికి అమలులో ఉన్న పీసీపీఎన్‌డీటీ విభాగం దిక్కు లేకుండాపోయింది.
దిక్కులేని గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం
పీసీపీఎన్‌డీటీలో సెలవుల్లో వెళ్లిన కాంట్రాక్ట్ ఉద్యోగి
ఫైల్స్ అప్పగించకపోవడంతో ఇబ్బందులు
పలువురు డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు
కర్నూలు హాస్పిటల్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్యఆరోగ్యశాఖలో భ్రూణ హత్యలను అరికట్టడానికి, గర్భస్థ శిశువులింగ నిర్ధారణను నిషేధించడానికి అమలులో ఉన్న పీసీపీఎన్‌డీటీ విభాగం దిక్కు లేకుండాపోయింది. కార్యాలయంలోని ఉద్యోగులు సెలవుల్లో వెళ్లడం, ఇతరులకు బాధ్యతలు అప్పగించకపోవడంతో జిల్లా వైద్యఆరోగ్యశాఖలో పరిపాలన గాడి తప్పింది. కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గర్భస్థ శిశులింగ నిర్దారణ నిషేధ చట్టం (పీసీపీఎన్‌డీటీ 1994) విభాగంలో లీగల్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ఓఉద్యోగిని ఈనెల 13వ తేదీ నుంచి చెప్పాపెట్టకుండా సెలవులో వెళ్లారు. ఇతరులకు ఆవిభాగపు ఫైల్స్, రికార్డులు అప్పగించ కుండా సెలవుల్లో వెళ్లిపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఈనెల 6వ తేదీ నుంచి ఆ ఉద్యోగిని..
వాస్తవానికి పీసీపీఎన్‌డీటీ విభాగానికి చెందిన ఫైల్స్, రికార్డులు బీరువాలో ఉంచి తాళాలు తనవద్దే ఉంచుకోవ డంతో ఉన్నతాధికారుల నుంచి చివాట్లు వచ్చాయి. వాస్తవా నికి ఈనెల 6వ తేదీ నుంచి ఆ ఉద్యోగిని విధులకు గైర్హాజ రవుతున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి తాను సెలవులోకి వెళ్తున్నట్లు డీఎంహెచ్‌వోకు మెసేజ్ పెట్టినట్లు అధికారులు చూపెడుతున్నారు. పీసీపీఎన్‌డీటీ విభాగానికి సంబంధిం చిన పనులు, ఫైల్స్ ఇతర వ్యవహారాల పనులన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. గత శుక్రవారం పీసీపీఎన్‌డీటీ నోడల్ ఆఫీసర్ జూమ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ జూమ్‌ను క్వార్టర్ రిపోర్టు ఇవ్వాలని అధికారులను అడుగగా లీగల్ కన్సల్టెంట్ అనధికార గైర్హాజరులో ఉన్నారని స్టేట్ నోడల్ ఆఫీసర్‌కు చెప్పడం చూస్తే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుంది.
ఉత్సవ మూర్తులుగా డెమో, డిప్యూటీ డెమోలు
ఏ జిల్లాలోనైనా పీసీపీఎన్‌డీటీ విభాగాన్ని డీఎంహెచ్‌వో ఆఫీసులోని రెగ్యులర్ ఉద్యోగులైన జిల్లా మాస్ మీడియా అధికారి(డెమో) డిప్యూటీ డెమోలు నిర్వహిస్తుంటారు. కొందరి పెత్తనంతో పీసీపీఎన్‌డీటీ విభాగాన్ని కర్నూలులో లీగల్ కన్సల్టెంట్ నిర్వహిస్తుంది. లీగల్ కన్సల్టెంట్ పీసీపీఎన్‌డీటీ యాక్టుకు సంబంధించిన కోర్టు కేసులను మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు హాస్పిటల్స్ స్కానింగ్ కేంద్రాల రిజిస్ర్టేషన్స్, రెన్యువల్స్ వ్యవహారాలు చూస్తుండటం విశేషం. ఈ విభాగంలో ఉత్తర ప్రత్యుత్తరాలు స్కానింగ్ కేంద్రాల రిజిస్ర్టేషన్, రెన్యువల్స్, ఇతర పనులన్నీ లీగల్ కన్సల్టెంట్ నిర్వహిస్తుండటంతో డెమో, డిప్యూటీ డెమోలను ఉత్సవ మూర్తులుగా మారిపోయారు.
నెలరోజులుగా తిరుగుతున్నారు..
20 రోజులుగా పీసీపీఎన్‌డీటీ ఫైల్స్, రికార్డులకు సంబంధించిన బీరువా తాళాలు లీగల్ కన్సల్టెంట్ అప్పగించలేదు. కొందరు ప్రైవేటు హాస్పిటల్స్ యజమానులు స్కానింగ్ కేంద్రాల అనుమతులు, రెన్యువల్స్ కోసం నెల రోజులుగా తిరుగుతున్నారు. కొందరు నేరుగా డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశా రు. ఈఏడాది జనవరిలో కూడా లీగల్ కన్సల్టెంట్ ఇదే విధంగా రికార్డులు, ఫైల్స్ అప్పగించకుండా సెలవులో వెళితే బీరువా తాళాలు పగులకొట్టేందుకు సిద్ధం కాగా అదేరోజు ఓఅధికారికి బీరువా తాళాలు పంపారు. ఈ విష యంలో అప్పటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
తరుచూ సమస్యలు
ఇటీవల కాలంలో డీఎంహెచ్‌వో ఆఫీసులో ఉద్యోగులు సెల వుల్లో వెళితే.. రికార్డులు, ఫైల్స్ సంబంధిత ఉద్యోగులకు అప్పగిం చకపోవడంతో తరుచూ పాలనాపరంగా సమస్యలు తలెత్తుతు న్నాయి. ఇప్పటికైనా డీఎంహెచ్‌వో నిర్లక్ష్యాన్ని వీడి పీసీపీఎన్‌డీటీ విభాగంలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని ప్రైవేటు హాస్పిటల్స్ యజమానులు కోరుతున్నారు.
మిస్సింగ్ కేసు నమోదు
లీగల్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగిని ఈనెల 6వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆమె భర్త నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీతారాంనగర్‌లో నివాసం ఉం టున్న ఆమె10 రోజులుగా ఇంటికి రాలేదని, బంధువుల ఇళ్లలో వెతికినా జాడ కనిపించలేదన్నారు. ఇటీవల ఆమె పిల్లలు డీఎం హెచ్‌వో కార్యాలయంలోని డెమో సెక్షన్‌కు వెళ్లి తమ తల్లి ఇం టికి రావడం లేదని, ఎక్కడ డ్యూటీ వేశారో చెప్పాలని అధికా రులను అడిగినట్లు చెప్పారు.ఓఅర్బన్ హెల్త్ సెంటర్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఓడాక్టర్ తన భార్యను తీసుకెళ్లారన్న అనుమానం వ్యక్తం చేసినట్లు భర్త తన ఫిర్యాదులో పేర్కొ న్నాడు. ఆ ఫిర్యాదు మేరకు నాల్గవ పట్టణ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై డీఎంహెచ్‌వో డా.వై.కామేశ్వర ప్రసాద్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా సీఎం పర్యటన వల్ల బిజీగా ఉన్నామని, సోమవారం వరకు గడువు ఇచ్చామని తెలిపారు.